సరిహద్దుల్లో పేలిన మందుపాతర… ఒకరి మృతి…

దిశ దశ, దండకారణ్యం:

మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి ఓ వ్యక్తి మృత్యువాత పడగా… మరో ఇద్దరు గాయాల పాలయ్యారు. సంఘటనా వివరాల్లోకి వెల్తే… ములుగు జిల్లా వాజేడు మండలం కొంగాల గుట్టపై సోమవారం ఉదయం ఓ మందుపాతర పేలింది. కట్టెల కోసం ఆ ప్రాంతానికి చేరుకున్నముగ్గురిలో ఒకరు అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. మృతుడు జగన్నాథపురానికి చెందిన ఏసు కాగా గాయాలపాలైన వారు రమేష్, ఫకీర్ గా గుర్తించారు. ఈ గుట్టలు తెలంగాణ నుండి చత్తీస్ గడ్ సరిహద్దుల వరకు విస్తరించి ఉంటాయి. సువిశాలంగా ఉండే ఈ గుట్టలో మావోయిస్టులు తరుచూ షెల్టర్ తీసుకుంటారని తెలుస్తోంది. అయితే షెల్టర్ తీసుకున్న సమయంలో బలగాలు దాడులకు పాల్పడినట్టయితే మందుపాతర పేల్చేందుకు అక్కడ ఏర్పాటు చేసి ఉంటారన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. కొంగాల గుట్ట, కర్రి గుట్టలతో అనుసంధానంగా ఉండడంతో ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుతోంది. ఇటీవల కర్రి గుట్టలపై జరిగిన ఎదురు కాల్పుల్లో మావోయిస్టు పార్టీ నేత అన్నె సాగర్ చనిపోయిన సంగతి తెలిసిందే. కీకారణ్యాలతో పాటు గుట్టలు విస్తరించి ఉన్న ఈ సరిహద్దు అటవీ ప్రాంతంలోకి చేరుకునేందుకు కేవలం బలగాలు మాత్రమే వస్తాయని భావించి నక్సల్స్ మందుపాతర అమర్చి ఉంటారన్న చర్చ సాగుతోంది. మరో వైపున కూంబింగ్ ఆపరేషన్లు నిర్వహించే బలగాలను మట్టుబెట్టేందుకు మందుపాతరను సిద్దం చేసి అక్కడ దాచిపెట్టి ఉంటారన్న అనుమానాలు కూడా వ్యక్తం అవతున్నాయి. ఏది ఏమైనా తెలంగాణ సరిహధ్దుల్లో మందుపాతర పేలిన ఘటన మాత్రం సరిహద్దు ప్రాంతాల పోలీసులను అప్రమత్తం చేసింది.

You cannot copy content of this page