నాగం వెంట కొత్త…

కరీంనగర్ టికెట్ పై ఆశలు గల్లంతేనా..?

దిశ దశ, కరీంనగర్:

కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించిన నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి వెంట నడుస్తున్నారు. కరీంనగర్ అభ్యర్థి విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇంకా ఫైనల్ నిర్ణయం తీసుకోకముందే ఆయన పార్టీ మారుతున్న సంకేతాలు ఇస్తుండడం గమనార్హం. కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్ కోసం మైత్రి గ్రూప్స్ ఛైర్మన్ కొత్త జైపాల్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నించారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన జైపాల్ రెడ్డి కరీంనగర్ నుండి పోటీ చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. ఏఐసీసీ పెద్దలతో పాటు, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కూడా ఒప్పించేందుకు ప్రయత్నించిన జైపాల్ రెడ్డి ఎవరూ ఊహించని విధంగా నాగం జనార్దన్ రెడ్డిని మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు కలిసినప్పుడు ఆయనతో పాటు ఉండడం సంచలనంగా మారింది. నిన్న మొన్నటి వరకు టికెట్ రేసులో ఉన్నవారిలో జైపాల్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపించినప్పటికీ ఆయన అడుగులు మాత్రం బీఆర్ఎస్ పార్టీ వైపు పడుతున్నట్టుగా స్పష్టం అవుతోంది. సీనియర్ నేత నాగం జనార్దన్ రెడ్డికి ఆప్తుడిగా ఉన్న జైపాల్ రెడ్డి ఇంతకాలం ఆయనతో కనిపించకుండా ఆదివారం మాత్రం ఆయనతో ప్రత్యక్ష్యం కావడంతో కాంగ్రెస్ టికెట్ పై ఆయనకు ఆశలు పూర్తిగా సన్నగిల్లిపోయి ఉంటాయన్న చర్చ సాగుతోంది. ఈ కారణంగానే కొత్త జైపాల్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరేందుకు సమాయత్తం అవుతున్నట్టుగా అర్థమవుతోంది. కాంగ్రెస్ టికెట్ ఖచ్చితంగా తనకే వస్తుందని తన శ్రేణులకు పదే పదే చెప్పిన ఆయన పార్టీ ఫిరాయిందేందుకు నిర్ణయించుకోవడం వెనక ఆంతర్యం ఏంటోనన్నదే అంతు చిక్కకుండా పోయింది. కరీంనగర్ కాంగ్రెస్ పాలిటిక్స్ లో కీ రోల్ పోషించే అవకాశాలు ఉన్నాయని భావించినప్పటికీ ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు మొగ్గుచూపుతున్న సంకేతాలు స్పష్టం కావడం హాట్ టాపిక్ గా మారింది. అందరి అంచనాలు తలకిందులు చేస్తూ కొత్త జైపాల్ రెడ్డి గులాభి పార్టీ వైపు తన అడుగులు వేస్తుండడం చర్చనీయాంశంగా మారింది.

You cannot copy content of this page