దిశ దశ, పెద్దపల్లి:
ముదితల్ నేర్వగరాని విద్యగలదే ముద్దార నేర్పినన్ అన్నాడో కవి… ప్రేమతో స్త్రీలకు విద్య నేర్పితే ఏ రంగంలో అయినా రాణిస్తారని ఆ పద్యంలోని భావం. అయితే ఈమెకు విద్య నేర్పిన వారు మాత్రం ఎవరూ లేరనే చెప్పాలి. పెనిమిటి ఆరోగ్య పరిస్థితులు… ఇద్దరు కొడుకులు… వారి కడుపులోకి ముద్ద దింపాలన్న తపనతో జీవనం సాగించిన ఆమె పరిస్థితుల ప్రభావంతో అనుభవమే పాఠంగా మల్చుకున్నారు. చిన్ననాడు అమ్మ ఒడి తప్ప బడి అంటే తెలియని ఆతల్లి దశాబ్ద కాలంగా ఒంటి చేత్తో ఇంటిని నడిపించే బాధ్యతలు మోస్తున్నారు.
రామగుండం హైవే సాక్షిగా…
రామగుండం, పెద్దపల్లి రహదారిలో ఉండే హెచ్ పి పెట్రోల్ బంక్ లో పనిచేస్తున్న ఓ నిరక్షరాస్యురాలు స్వైపింగ్ మిషన్ ను అలవోకగా ఉపయోగిస్తున్నారు. అసలే హైవే కావడం, కంపెనీ ఔట్ లెట్ బంక్ కావడంతో వాహనదారులు కూడా ఇక్కడ ఇంధనం కోసం క్యూ కడుతుంటారు. మహారాష్ట్రలోని బల్లార్ష, సిరొంచ, చత్తీస్ గడ్ లోని జగ్దల్ పూర్ హైవేకు అనుసంధానంగా ఉన్న రాజీవ్ రహదారి కావడంతో తరుచూ ఇక్కడ రద్దీ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇందులో ఉపాధి కోసం చేరిన ఆమె వ్యక్తిగత జీవన విధానాన్ని గమనిస్తే చిన్న విషయానికి మానసిక క్షోభకు గురయ్యేవారికి ఆదర్శంగా ఉంటుంది. సాంకేతితక అనగానే చాలామందిలో ఒక రకమైన ఆందోళన నెలకొనడం సహజం. మేం చదివిన చదువులు వేరు… ఇప్పుడొస్తున్న టెక్నాలజీ వేరు అని సర్దిచెప్పుకుంటూ కాలం వెల్లదీసేవారూ ఉన్నారు ఈ సమాజంలో. టెక్నాలజీ అంటేనే వెనకంజ వేసే కొందరు నేటీకి వారి డెబిట్ కార్డుతో ఏటీఎంకు వెల్లి డబ్బులు డ్రా చేసుకునే పరిస్థితిలో కూడా లేరన్నది నిజం. కానీ అక్షరం అంటే తెలియని ఈ అమ్మ మాత్రం ఇలాంటి వారందరికీ రోల్ మోడల్ అనే చెప్పాలి.
పదేళ్లుగా…
పెద్దపల్లి జిల్లా రామగుండం సమీపంలోని బద్రిపల్లికి చెందిన బోగె శ్యామల హెచ్ పి పెట్రోల్ బంకులో ఇంధనం అమ్ముతూ సంస్థ ఇచ్చే వేతనంతో జీవనం సాగిస్తున్నారు. క్యాష్ లేదు… కార్డ్ ఉందని ఓ కస్టమర్ చెప్పగానే ఆవిడ వెంటనే స్వైపింగ్ మిషన్ ద్వారా కార్డును ఉపయోగించి చకచకా అమౌంట్ బదిలీ చేసేశారు. ఆమెను నిశితంగా గమనిస్తే తప్ప చదువుకోలేదన్న విషయం స్పష్టం అవుతోంది. దీంతో అమెను కదిలిచించడంతో కుటుంబంలో నెలకొన్న పరిస్థితులు తెలిసాయి. పదేళ్లుగా తాను ఈ బంకులో ఉపాధి పొందుతున్నానని వివరించారు శ్యామల. దశాబ్ద కాలంగా పని చేస్తున్న తాను క్రమక్రమంగా స్వైపింగ్ మిషన్ వినియోగించడం ఎలాగో నేర్చుకుని ఈ రోజు అలవోకగా డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా స్వైప్ చేస్తున్నానని ధీమాతో చెప్తున్నారు. మీరేమైనా చదువుకున్నారా అమ్మా అని అడిగితే నాకు బడి అంటేనే తెలియదు బిడ్డా… ఇక్కడే ఉండి పనిచేస్తు చేస్తూ సాంకేతికతపై అవగాహన పెంచుకున్నానని చెప్పారు. తన కుటుంబం గురించి వివరించిన శ్యామల… పదేళ్ల క్రితం తన భర్తకు పక్షవాతం రావడంతో కుటుంబ పోషణ భారం తనపై వేసుకున్నానని, ఇద్దరు పిల్లలను, భర్తకు ఆహారం సమకూర్చి రావడంతో పాటు భర్త ఆరోగ్యాన్ని కూడా బాగు చేయించాల్సిన బాధ్యత నాపై పడింది. బంకులో ఉద్యోగం దొరుకుతుందని తెలిసి ఇక్కడ చేరిపోయా. కుటుంబ పోషణ కోసం ఉపాధి మార్గాన్ని ఎంచుకుని మరీ బంకులో పని చేసేందుకు సాహసించా. మహిళలు బంకుల్లో పనిచేసేందుకు అంతగా ఆసక్తి చూపడం లేని ఆ సమయంలోనే ఆమె ఇటువైపు అడుగులు వేశారంటే ఆమె కుటుంబ ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. శ్యామల పెద్ద కొడుకు కూలీ పని చేస్తూ తల్లికి చేదోడుగా నిలుస్తుంటే, చిన్న కొడుకు చదువుకుంటున్నాడు. ఏది ఏమైనా చదువంటే తెలియని ఆమె అనుభం నేర్పిన పాఠంతో ఉపాధి పొందుతున్న తీరు… అవగాహన చేసుకుని మరీ ముందుకు సాగుతున్న తీరు… సోమరితనంతో ఊగిసలాడే వారికి ఆదర్శనీయం.