మహా సరస్వతి సన్నిధిలో జ్ఞాన సరస్వతి…

సర్కారు బడిలో ‘అక్షయ’ విజ్ఞాన ప్రదర్శన

దిశ దశ, కాళేశ్వరం:

త్రి సరస్వతి ఆలయాల్లో ఒకటైన కాళేశ్వరంలో సరస్వతి పుత్రిక తన విజ్ఞానాన్ని ప్రదర్శిస్తోంది. సాధారణ కుటుంబంలో పుట్టిన ఈ బిడ్డలోని ప్రతిభను గుర్తించిన టీచర్ రాజేందర్ వినూత్నంగా తీర్చిదిద్దే పనిలో నిమగ్నం అయ్యారు. ‘‘అక్షయ’’ పాత్రలో ఉంచిన పదార్థం ఎంత తీసిన మళ్లీ అందులో పుట్టుకొస్తుందని చరిత్ర చెబుతోంది. అయితే ఆ అక్షయ పాత్ర పదిమంది కడుపు నింపేందుకు ఉపయోగపడింది కావచ్చు కానీ… ఈ ‘‘అక్షయ’’ మాత్రం తన జ్ఞాన సంపదను అపారంగా పెంచుకుంటూ సమాజానికి అందించే ప్రయత్నం చేస్తోంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం హైస్కూల్ లో 9వ తరగతి చదువుతున్న అక్షయ జ్ఞానాన్ని ప్రదర్శించిన తీరు అద్భతమనే చెప్పాలి.

అవధానం…

ప్రపంచంలో ఏ భాషకు లేని ప్రత్యేకత ఒక్క తెలుగు భాషకు మాత్రమే ఉంది. అష్టావధానం, శతావధానం, సహస్రావధానంతో కవులు, రచయితలు తెలుగు భాషకే వన్నె తెచ్చారు. సాధారణంగా ప్రుచ్ఛకులు వేసే ప్రశ్నలను సంధించేందుకు ఎంతమంది ఉంటే అంతమందిని లెక్కించి అవధాన కార్యక్రమం నిర్వహిస్తుంటారు. తెలుగు భాషకే పరిమితమైన అవధాన ప్రక్రియను భౌతిక శాస్త్రంలో ప్రయోగిస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించారు కాళేశ్వరం హైస్కూల్ టీచర్ దొనికల రాజేందర్. వృత్తి రిత్యా భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడే అయినా కవిగా కూడా సుపరిచితులు. కొన్ని పుస్తకాలను కూడా రచించించిన రాజేందర్ తాను పని చేస్తున్న పాఠశాలలోని విద్యార్థుల్లోని సృజనాత్మకతను గుర్తించి వారిని ప్రొత్సహించాలని నిర్ణయించుకున్నారు. మట్టిలో మాణిక్యాలను వెలుగులోకి తీసుకరావాలని పరితపించిన ఆయన ప్రయత్నం 9వ తరగతి చదువుతున్న అక్షయతో మొదలు పెట్టారు. కేవలం పాఠాలు చెప్పి పరీక్షలు పెట్టి మెరిట్ సాధించామన్న సంతృప్తి చెందడం వల్ల అధికారుల మెప్పు పొందవచ్చు కానీ… విద్యార్థుల్లోని ప్రతిభా పాఠవాలను గమనించి వారిని అటువైపుగా నడిపించినట్టయితే బంగారు భవిష్యత్తు అందించవచ్చని భావించారు రాజేందర్ టీచర్. తన ఆలోచనలకు అనుగుణంగానే అక్షయలోని జిజ్ఞాసను గుర్తించిన ఆయన భౌతిక శాస్త్రంలో సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ల్యాబుల్లో మాత్రమే చేసే ప్రయోగాలు కాదు… తరగతి గదులను ప్రయోగశాలలుగా ఎందుకు మార్చకూడదని అనుకున్నారు. ఇందులో భాగంగా సబ్జెక్టుతో సంబంధం లేని తెలుగుకు, భౌతిక శాస్త్రానికి అనుసంధానం చేసే ప్రయత్నంలో సఫలం అయ్యారు. తెలుగు భాషకు మాత్రమే పరిమితం అయిన అవధాన ప్రక్రియను భౌతిక శాస్త్రంలోనూ ప్రయోగించి పలువురు మన్ననలు అందుకుంటున్నారు రాజేందర్ మా‘‘స్టార్’’.

అక్షయ ప్రతిభ…

అక్షయ పాత్ర గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ కూడా దాని ప్రత్యేకత గురించి చెప్పుకుంటుంటారు. అయితే అక్షయ అని పేరు పెట్టిన ఆమె తల్లిదండ్రుల కలలను సాకారం చేస్తోంది 9వ తరగతి విద్యార్థిని అక్షయ. తనలోని అపారమైన జ్ఞానాన్ని ప్రదర్శిస్తున్న తీరు చూసిన ఉపాధ్యాయులను సైతం ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఫిజిక్స్ టీచర్ రాజేందర్ ఇచ్చిన ప్రొత్సాహంతో దశావధానం ప్రక్రియను విజయవంతంగా నిర్వహించింది అక్షయ. అక్షయ పాత్రను మరిపించేలా ఆమె తనలోని జ్ఞానానికి పదును పెట్టుకున్న తీరు నేటి తరం విద్యార్థులు కూడా అలవర్చుకోవల్సిన అవసరం ఉంది. ఇటీవల కాళేశ్వరం ఉన్నత పాఠాశాలలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా భౌతిక శాస్త్ర ఫోరం ఆధ్వర్యంలో దశావధాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగు భాషతో అనుబంధం పెనవేసుకున్న అవధాన ప్రక్రియను భౌతిక శాస్త్రంలో కొనసాగించడం విశేషం. ప్రుచ్ఛకులు సంధించే ప్రశ్నలకు అప్పటికప్పుడు అశువుగా సమాధానాలు చెప్పే అవధాన ప్రక్రియను అక్షయ కొనసాగించిన తీరు ఉపాధ్యాయులను అబ్బురపరిచింది. పదిమంది ప్రుచ్ఛకులుగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో 8 మంది సంబంధిత విషయాలకు సంబంధించిన ప్రశ్నలను సంధిస్తే ఇద్దరిలో ఒకరు అప్రస్తుత ప్రసంగం చేసి డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తారు. మరోకరు సమాధానలు చెప్తున్న క్రమంలో అందుకు సంబంధించిన ప్రశ్న తయారు చేయాలసి ఉంటుంది.  అంటే వేదికపై కొనసాగుతున్న విషయంతో సంబంధం లేని అంశాల్లో ప్రశ్నలు వేసి అలెర్ట్ డైవర్ట్ చేస్తుంటారు. వారికి అప్పటికప్పుడు ఛతురోక్తులతో కూడిన సమాధానాలు ఇస్తూ ప్రుచ్చకులు సంధించిన ప్రశ్నలకు టకటకా సమాధానలు ఇవ్వడం అవధానంలో అత్యంత కీలకం. ఇదే పద్దతిన అక్షయ భౌతిక శాస్త్రంలో తన ప్రతిభను ప్రదర్శించడంతో ఆమె ఓ మైలు రాయిని అందుకున్నట్టయింది. ఈ అవధానంలో భాగంగా పఠంలో న్యూటన్ గమన నియమానం, ప్రదర్శించిన పరికరాలతో ఏ కృత్యం చేయవచ్చు, అందులో దాగి ఉన్న నియమం ఏంటీ..? నాలుగు పదాలతో న్యూటన్ గమన నియమాలు అంతర్గతంగా ఉండేలా అప్పటికప్పుడు కథలా విడమర్చి చెప్పడం, వాటిలో దాగి ఉన్న నియమాలను వివరించడంలో అక్షయ చూపిన ప్రతిభ అనన్య సామాన్యం. కృత్యంలో గమన నియమాలను పెన్ను పేపర్ ఉపయోగించకుండా సమస్యను పూరించడం, చిత్రపటాన్ని చూసి శాస్త్ర వేత్తను గుర్తించడం, పటం  కానీ అంశాన్ని కానీ ప్రస్తావించినప్పుడు ఏ పేజీలో ఉందో ఠక్కున చెప్పేయడం, అప్రస్తుత ప్రసంగంతో ఆటంక పరిచినా అప్పటికప్పుడు తన చతురతతో వాటిని తిప్పికొడూతూ భౌతిక శాస్త్రంలో సంధించిన ప్రశ్నలను పూరించడంలో అక్షయ ప్రదర్శించిన తీరు పలువురిని ఆకట్టుకుంది.

వెన్నుదన్నుగా…

కాళేశ్వరం హైస్కూలో లో భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడు రాజేందర్ లక్ష్యానికి అనుగుణంగా వెన్నుదన్నుగా నిలిచారు ప్రధానోపాధ్యాయులు బాసిరి అన్నపూర్ణ. విద్యార్థుల్లో జ్ఞానం పెంపొందించే విషయంలో తనవంతు పూర్తి సహకారం అందిస్తున్నారు. విద్యార్థులను తీర్చిదిద్దాలని లక్ష్యం నిర్దేశించుకున్న టీచర్లను ప్రోత్సహించడమే కాకుండా విద్యార్థులకు కూడా బాసటగా నిలుస్తున్నారు హెచ్ఎం. భౌతిక శాస్త్రంలో అవధాన ప్రక్రియను విజయవంతంగా నిర్వహించిన అక్షయకు రూ. 10వేలు బహుమతి ఇస్తున్నట్టు ప్రకటించారు. అంతేకాకుండా అక్షయకు భవిష్యత్తులో అన్నింటా తన అండదండలు ఉంటాయని వెల్లడించారు.

You cannot copy content of this page