ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్… తెరపైకి రొటేషన్ విధానం

దిశ దశ, నిజామాబాద్:

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. కరీంనగర్ నియోజకవర్గం అయినంత మాత్రాన అదే జిల్లా అభ్యర్థులకు అవకాశం ఇవ్వడం సరికాదన్న వాదనలు తెరపైకి వస్తున్నాయి. మిగతా ఉమ్మడి జిల్లాల అభ్యర్థులకు కూడా అవకాశం కల్పిస్తే బావుంటుందన్న ప్రతిపాదన తీసుకొస్తున్నారు కొన్ని పార్టీల నాయకులు. ఈ ప్రతిపాదన మండలిలోకి అడుగు పెట్టాలని కలలు కంటున్న కరీంనగర్ జిల్లాకు చెందిన ఆశావాహులకు ఆశనిపాతంగా మారనుంది. గతంలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన జిల్లాలకు చెందిన వారికి కాకుండా ఇతర జిల్లాలకు చెందిన అర్థులకు ప్రాతినిథ్యం కల్పించాలన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.  గతంలో ఏనాడు లేని విధంగా ఈ సారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కరీంనగర్ జిల్లాకు చెందిన వారే ఎక్కువ మంది పోటీ చేసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. విద్యా సంస్థల అధినేతలు కూడా రంగంలోకి దిగి ఓటర్ల నమోదు ప్రక్రియపై కూడా దృష్టి సారించిన ఈ సమయంలో సరికొత్త ప్రతిపాదన తెరపైకి రావడంతో ఆయా పార్టీలు ఎలా వ్యవహరిస్తాయోనన్న చర్చ మొదలైంది. అయితే ఓటర్లు ఎక్కువగా ఉన్న జిల్లాలకు చెందిన వారి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్టయితే సానుకూల ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయని రాజకీయ పార్టీలు అంచనా వేస్తుంటాయి. గతంలో తమ జిల్లాకు చెందిన వారికి ప్రాతినిథ్యం దక్కనందున ఈ సారి తమ జిల్లా వారికే అవకాశం కల్పించాలన్న వాదన బలంగా వినిపిస్తే ఆయా జిల్లాలకు చెందిన పట్టభద్రుల సొంత జిల్లా వారి వైపే మొగ్గు చూపే అవకాశాలు ఉంటాయి. దీనివల్ల అభ్యర్థుల తలరాతలు మారే అవకాశం కూడా ఉంటుంది. తమ జిల్లాల వారికి ప్రాధాన్యత ఇవ్వని పార్టీల పట్ల సానుకూలత దృక్ఫథంలో ఉండేది లేదన్న వాదనలు ఆయా జిల్లాలకు చెందిన పట్టభద్రులు బలంగా వినిపించినట్టయితే పొలిటికల్ పార్టీలు కూడా పునరాలోచనలో పడే అవకాశాలు లేకపోలేదు.

You cannot copy content of this page