వార్షికోత్సవం నాడు వరాల జల్లు
తెలుగు మీడియా రంగంలో సంచలనం
దిశ దశ, హైదరాబాద్:
వార్షికోత్సవం వస్తుందంటే చాలు మీడియా సంస్థలు చేసే హడావుడి అంతా ఇంతా కాదు… మన సంస్థ కోసం సమాజం నుండి యాడ్స్ కలెక్ట్ చేయండి… మండలం నుండి జిల్లా కేంద్రం వరకు టార్గెట్లు ఫిక్స్ చేసి అటు జనాలను… ఇటు జర్నలిస్టులను జలగల్లా పట్టి పీల్చి పిప్పి చేసే తెలుగు మీడియా రంగంలోని కొన్ని యజామాన్యాలకు కను విప్పు కల్గించే అంశం ఇది. డిజిటల్ మీడియా రంగంలో సంచలన నిర్ణయం తీసుకున్న సుమన్ టీవీ యాజమాన్యం మీడియా చరిత్రలోనే సువర్ణాధ్యాయం లిఖించింది. అవన్ని డిజిటల్ ప్లాట్ ఫాం సంస్థలు అంటూ చులకనగా ప్రచారం చేసే మెయిన్ స్ట్రీమ్ మీడియా యాజమాన్యాలు కొన్ని కళ్లప్పగించి… చెవులు పెద్దవిగా చేసుకుని మరీ తెలుసుకోవల్సిన విషయం ఇది
సుమన్ టీవీ సంచలనం…
సంస్థ కోసం సమాజం కోసం పని చేసే జర్నలిస్టులకు అత్యంత అరుదైన గౌరవాన్ని అందించారు సుమన్ టీవీ యజమాని “సుమన్ దూది”. అయన అమలు చేసిన ఈ విధానం ఆలస్యంగా వెలుగులోకి వచ్చినా తెలుగు మీడియా రంగంతో పాటు యావత్ సమాజానికి అందించాలన్న సదుద్దేశ్యంతో మా వంతుగా చిరు ప్రయత్నం ఇది. నలుగురిని సంస్థ వైస్ ప్రసిడెంట్లుగా, ఆరుగురిని సీఈఓలుగా ఎంపిక చేసి తెలుగు మీడియా రంగానికి మార్గదర్శకులు అయ్యారు సుమన్ టీవీ ఛైర్మెన్. బెంజ్ కార్లను బహుమతిగా అందించారు సుమన్ టీవీ చైర్మన్. అంతేకాదు.. వారిని వివిధ విభాగాలను సీఈవోలుగా నియమిస్తూ.. ఐదు లక్షల జీతం.. కోటి రూపాయల ఇన్సూరెన్స్ పాలసీలను ప్రకటించారు. వార్షికోత్సవం పురస్కరించుకుని సంస్థను గట్టెక్కించాలంటూ… ఏడదంతా ఊడిగం చేయించుకుని జర్నలిస్టులపై రెవెన్యూ అనే గుదిబండ మోపి హింసిస్తున్న సాధారణ మీడియాకు చెందిన కొన్ని సంస్థలు, డిజిటల్ ప్లాట్ ఫాంలోని కొన్ని సంస్థలు ‘సుమన్’ టీవీ యజమాని తీసుకున్న సంచలన నిర్ణయంతో కనువిప్పు కలగాల్సిన ఆవశ్యకత ఉంది. బ్రేక్ ఈవెన్ అంటూ కొన్ని సంస్థలు చేసుకుంటున్న ప్రచారాలకు బ్రేకేసి సుమన్ టీవీ తీసుకున్న నిర్ణయాన్ని ఆదర్శంగా తీసుకుంటే బెటర్…
ఆర్భాటం లేకుండా…
సంస్థ ఎదుగుదలకు కారణం అయిన ఉద్యోగులకు ఊహించని స్థాయిలో గౌరవం ఇచ్చారు సుమన్ దూది. సంస్థ 8వ వార్షికోత్సవం సందర్భంగా ఆ ఛానల్‌లో పనిచేస్తున్న ఆరుగురు ఉత్తమ ఉద్యోగులకు బెంజ్ కార్లు బహుమతిగా అందించడంతో పాటు వారిని ఆరు విభాగాలకు సీఈవోలుగా ప్రమోట్ చేశారు. సెలబ్రిటీల ఇంటర్వ్యూలతో పాపులర్ అయిన రోషన్‌ని ఎంటర్ టైన్ మెంట్ వింగ్ సీఈఓగా, న్యూస్ వింగ్, సీఈఓగా యాంకర్ నిరుపమ, ఉమెన్ వింగ్ సీఈఓగా జయలక్ష్మి, బిజినెస్ సీఈఓగా నాగరాజు, లైఫ్ స్టైల్, భక్తి సీఈఓగా గీతాంజలి, హెల్త్ సీఈఓగా సుదర్శన్ లకు బాధ్యతలు అప్పగిస్తూ రూ 62 లక్షలు వెచ్చించి కొనుగోలు చేసిన బెంజ్ కార్లు, ఐదు లక్షల జీతం, కోటి రూపాయల ఇన్సూరెన్స్ లను బహుమతిగా ఇచ్చారు. వీరితో పొటు మరో నలుగురిని సంస్థ వైఎస్ ప్రసిడెంట్లుగా చేసి వారికి ఆధునిక కార్లు, జీతం అందించాలని నిర్ణయించుకున్నారు. సంస్థ ఎదుగుదల కోసం తమవంతుగా బాధ్యత నెరవేర్చామన్న ఆత్మ తృప్తితో కాలం వెల్లదీసే జర్నలిస్ట్ సమాజానికి సుమన్ టీవీ అధినేత అందించిన స్వీట్ న్యూస్ కొంగొత్త ఆశలు రేకెత్తిస్తోందనే చెప్పాలి. ఎదిగినా కొద్ది కొత్త కొత్త లక్ష్యాలను నిర్దేశించుకుంటూ తమ ఉద్యోగులను ఒత్తిళ్లకు గురి చేస్తూ రెవెన్యూ రెవెన్యూ అంటూ జర్నలిజపు పరిమళలాలను దూరం చేస్తున్న కొంతమంది కుహనా జర్నలిస్టులు కూడా ఓ సారి సుమన్ దూది ఔదార్యతను తెలుకుని ఆత్మ విమర్శ చేసుకుంటే మంచిదేమో. జర్నలిజం బ్యాక్ గ్రౌండ్ అంటూ సంస్థల ప్రారంభ దశలో ప్రగల్భాలు పలికి… ఆ తర్వాత సంస్థ ఆర్థిక ఎదుగుదలే లక్ష్యంగా పని చేయించుకుంటున్న కొన్ని సంస్థలు తమ వైఖరిని మార్చుకుంటే మంచిదేమో. రెవెన్యూ విషయంలో మిగతా సంస్థలతో పోల్చే కొన్ని సంస్థలు సుమన్ టీవీ యాజమాని సుమన్ దూది తీసుకున్న నిర్ణయాన్ని పదే పదే గుర్తుంచుకుంటే బెటరేమో. తన సంస్థ ఎదుగుదలకు కారణం కులం, మతం కాదు… రాజకీయ పార్టీలు ఏ మాత్రం కాదు… కష్టాన్ని కూడా ఇష్టంతో ముద్దాడుతున్న తన సంస్థ ఉద్యోగులేనని ఘంటాపథంగా ప్రకటించిన సుమన్ దూది వ్యాఖ్యలను కూడా ప్రస్తుతించాల్సిన అవసరం ఉంది. భూమిలోకి కూరుకపోయిన పునాది రాళ్లను పట్టించుకోకుండా భవనం గురించి మాట్లాడుతున్నట్టుగా… సంస్థలను ఏర్పాటు చేసిన కొత్తలో అన్ని తామై పనిచేసిన కింది స్థాయి ఉద్యోగులకు పొమ్మనలేక పొగబెట్టి కొంతమంది హెచ్ ఓడీలు కూడా సుమన్ టీవీ అధినేత తీరును తెలుసుకోవల్సిన ఆవసరం ఎంతైనా ఉంది. ప్రభువెక్కిన పల్లకి కాదోయ్ ఆ పల్లకి మోసిన బోయిలెవ్వరు..? తాజ్ మహల్ నిర్మాణం కాదోయ్ ఆ రాళ్లను మోసిన కూలీలెవ్వరు..? అని శ్రీశ్రీ చెప్పినట్టుగా సుమన్ టీవీ అధినేత చర్యలు ఆచరణలో చూపిస్తుండడం నిజంగా నేటి జర్నలిస్ట్ సమాజానికి దిశానిర్దేశం చేసే విధంగా ఉన్నాయి. “హ్యాట్సప్ టు సుమన్ దూది… బెస్ట్ ఆఫ్ లక్ “సుమన్ టీవీ”…