దిశ దశ, పెద్దపల్లి:
పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేతను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడంపై పెద్ద ఎత్తున చర్చలు సాగుతున్నాయి. పార్టీ నాయకులు కూడా ఒకింత షాక్ అవుతున్న పరిస్థితి నెలకొంది. అధినాయకత్వం వ్యవహరించిన తీరుపై లోకసభ పరిధిలోని నాయకులు కినుక వహించినట్టుగా తెలుస్తోంది. అయితే ఆయన చేరిక వల్ల కాంగ్రెస్ పార్టీకి లాభం ఉంటుందా లేదా అన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా వ్యవహరించిన తీరుపై కూడా విస్మయం వ్యక్తమవుతోంది.
లాభమేనా..?
వెంకటేష్ నేత కాంగ్రెస్ పార్టీలో చేరడం వల్ల పార్టీకి ఒరేగేదిమిటీ అన్న విషయంపై కొంమంది ముఖ్య నాయకులు అధిష్టానానికి వివరించేందుకు సిద్దమవుతున్నారని సమాచారం. సిట్టింగ్ ఎంపీగా ఉన్నప్పటికీ ఆయన వల్ల లాభం ఏమీ ఉండబోదన్న వాదనలు వినిపించాలని చూస్తున్నారు. ఏడు సెగ్మెంట్లలో ఏ మాత్రం ప్రభావం చూపించే అవకాశం లేదని, ఆయనను చేర్చుకోవడం వల్ల పార్టీకి ఒరిగేదేమీ లేదన్న అభిప్రాయాలే పార్టీ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీలో మారుతున్న సమీకరణాలను దృష్టిలో పెట్టుకున్న వెంకటేష్ నేత కాంగ్రెస్ పార్టీలో చేరారని, సిట్టింగ్ ఎంపీగా మాత్రం ఆయన ప్రబావితం చేసే అవకాశమే లేదని అంటున్నవారే ఎక్కువ. నియోజకవర్గంలో నామమాత్రమైన క్యాడర్ ఉన్న ఆయనతో పార్టీకి లాభం జరుగుతుందని అంచనా వేయడం కూడా సరికాదని కూడా ఓ సెగ్మెంట్ కు చెందిన నాయకుడు అధిష్టానం పెద్దలకు వివరించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.
మారిన సీన్…
పెద్దపల్లి లోకసభ నుండి టికెట్ల కోసం పోటీ పడుతున్న వారి సంఖ్య గణనీయంగా ఉంది. చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేకానంద తనయుడు వంశీ అభ్యర్థిత్వం దాదాపు ఖరారైనట్టేనని అనుకున్న క్రమంలో ఎన్నికలు సమీపిస్తున్నా కొద్ది ఆశావాహుల సంఖ్య కూడా పెరిగింది. గతంలో ఎంపీగా ప్రాతినిథ్యం వహించిన సిహెచ్ సుగుణ కుమారి, ఇక్కడి నుండి పోటీ చేసి ఓడిపోయిన సీనియర్ నేత గోమాస శ్రీనివాస్, మాజీ మంత్రి ఏ చంద్ర శేఖర్ తో పాటు పలువురు టికెట్ కోసం పోటీ పడుతున్నారు. వీరిలో ఎవరో ఒకరి అభ్యర్థిత్వం ఖరారు అవుతుందని భావిస్తున్న క్రమంలో సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేతను జాయిన్ చేసుకోవడంతో పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీలో సీన్ అంతా ఒక్క సారిగా మారిపోయింది. ఆశావాహులు తమ అభ్యర్థిత్వాన్నే అధిష్టానం ప్రకటించాలని ప్రయత్నిస్తున్న క్రమంలో వెంకటేష్ నేత ఎపిసోడ్ తో చర్చ అంతా కూడా ఆయన చుట్టే తిరగడం ప్రారంభించింది. ఆయనకు అధిష్టానం ఎలాంటి హామీ ఇచ్చి పార్టీలో చేర్చుకుంది..? సిట్టింగ్ అయినందున ఆయనకే టికెట్ ఇస్తారా లేక అప్పటికే టికెట్ రేసులో ఉన్న తమలో ఎవరో ఒకరికి ఇస్తారా అన్న విషయంపై తర్జనభర్జనలు సాగుతున్నాయి. ఏది ఏమైనా వెంకటేష్ నేత చేరికతో పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీలో మాత్రం అనూహ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి.