మళ్లీ మొదలైన క్లబ్బులు…
సరిహద్దు ప్రజల నిరసనలు
దిశ దశ, దండకారణ్యం:
గోదావరి వారధిగా అక్రమాల జాతర మొదలైంది. అన్నల ఇలాకా అసాంఘీక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. అటు వైపు కన్నెత్తి చూసే వారు లేరన్న ధీమాతో నిర్వహాకులు మళ్లీ జూదం కేంద్రాలను మొదలు పెట్టారు. కొంత కాలం క్లోజ్ చేయడం… మరి కొంతకాలం నడిపించడం సాధారణంగా మారిపోయిందక్కడ. చట్టానికి చిక్కే అవకాశం లేదన్న ధీమాతో జూదగాళ్లు కూడా బాజాప్తాగా అక్కడకు చేరుకుంటున్నారు.
రెస్టారెంట్ ను మించిన ఫెసిలిటీస్…
స్టార్ హోటల్ వాతావరణ కనిపించకున్నా అక్కడ అన్ని రకాల ఫుడ్ అందుబాటులో ఉంచుతూ… సకల సౌకర్యాలు అందిస్తున్న నిర్వాహాకులు నెమ్మదిగా జూదగాళ్లకు సమాచారం చేరవేశారు. దీంతో ఆ అటవీ గ్రామ శివార్లలోకి వందలాది కార్లు చేరుకుంటున్నాయి. ఈ కేంద్రంలో సెంట్రల్ ఏసీ అందించేందుకు 24 గంటల పాటు జనరేటర్ సౌకర్యం కూడా అమర్చారు. దీంతో నిత్యం కార్లన్ని మహారాష్ట్ర సరిహద్దుల్లోని ఆసరెల్లికి పయనం అవుతున్నాయి. ఉత్తర తెలంగాణాలోని వరంగల్, హుజురాబాద్, కరీంనగర్, రామగుండం, మంచిర్యాల, చెన్నూరు, భూపాలపల్లి తదితర ప్రాంతాలకు చెందిన జూదగాళ్లు ఆసరెల్లి సరిహద్దు ప్రాంతంలోకి చేరుకుంటున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా ఆసరెల్లి సమీపంలో సీజ్ అయిన ఇసుక కుప్పలకు వెనక ప్రాంతంలో ఓ షెడ్ వేసి మరీ జూదం కేంద్రాన్ని నడిపిస్తున్నారంటూ ఇక్కడ ఏ స్థాయిలో డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. అధికార యంత్రాంగం కూడా ఆ ప్రాంతం వైపు కన్నెత్తి చూడకపోవడంతో పాటు… తెలంగాణ ప్రాంతం నుండి వెల్లేందుకు మేడిగడ్డ బ్యారేజ్ కూడా వారికి రాచమార్గంగా మారిపోయింది. దీంతో పేకాట నిర్వహణ కేంద్రంలో మూడు కమ్మలు… ఆరు నోట్లు అన్న చందంగా సాగుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
లక్కడికోట టు…
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాకు సరిహద్దుల్లో ఉన్న లక్కడికోట నుండి ఆసరెల్లి వరకు క్లబ్ లను ఏర్పాటు చేసి దర్జాగా జూదం ఆడిస్తున్నారు. రూ. కోట్లలో జూదం పేరిట టర్నోవర్ అవుతోందన్న ప్రచారం జరుగుతోంది. గతంలో పలు మార్లు సరిహద్దు ప్రాంతాల్లో పేకాట క్లబ్బులపై తెలంగాణ ప్రాంత మీడియాలో వచ్చిందే తడవు వాటిని క్లోజ్ చేయడం… కొద్ది రోజులకు ప్రారంభించడం రివాజుగా మారిపోయింది. రిక్రియేషన్ క్లబ్ పేరిట జూదం నడిపిస్తున్నామని బయటకు చెప్తున్నప్పటికీ వాస్తవం మాత్రం బయటకు పొక్కనీయడం లేదు. ఒక వేళ రిక్రియేషన్ క్లబ్బుల్లో అయినా కోట్ల రూపాయల టర్నోవర్ అవుతోందంటే నిభందనలకు విరుద్దమేనని అంటున్నారు. అంతేకాకుండా ఈ క్లబ్బుల్లో సభ్యులుగా ఉన్న వారేవరు..? జూదం ఆడుతున్న వారెవరు అన్న వివరాలను సేకరిస్తే ఇవి రిక్రియేషన్ క్లబ్బులా లేక కమర్షియల్ క్లబ్బులా అన్న విషయం తేటతెల్లం అవుతుందని అంటున్నారు.
స్థానికుల నిరసనలు…
మరో వైపున ఇల్లీగల్ గేమింగ్ యాక్ట్ తో తమకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని యువత పక్కదారి పట్టే ప్రమాదం ఉందని ఆసరెల్లితో పాటు సమీప గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం రహదారిపై నిరసన చేపట్టిన స్థానికులు క్లబ్ ను వెంటనే మూసివేయాలని డిమాండ్ చేశారు.