దిశ దశ, చెన్నూరు:
నవ మసాలు నిండిన ఓ తల్లికి వరణదేవుడు పరీక్ష పెట్టాడు… ఇదే సమయంలో రహాదారిలోని కల్వర్టు మరో పరీక్ష పెట్టింది… కమ్ముకున్న మేఘాలు ఓ వైపున.. దారి కానరని దుస్థితి మరో వైపున…. రహదారులన్ని జలదిగ్భధనంలో చిక్కుకపోయిన ఈ పరిస్థితుల్లో తమ బిడ్డను ప్రసూతి కోసం ఆసుపత్రికి తరలించడం ఎలా అన్ని తల్లడిల్లిపోతున్నారు ఆ ఇంటి వారు. రహదారుల్లోని కల్వర్టులు కూడా కోట్టుకపోయిన ఈ సమయంలో ఆమెను దవాఖానాకు చేర్చడం ఎలా అని ఆందోళన చెందుతున్న క్రమంలో ఆ తల్లే ధైర్యంగా నడుచుకుంటూ వెల్లింది.
మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం నీల్వాయి అటవీ ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికులను కలిచివేసింది. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో చెన్నూరు నియోజకవర్గంలో రవాణా వ్యవస్థ అంతా కూడా అస్థవ్యస్తంగా తయారైంది. వరద నీటి ప్రవాహానికి రోడ్లు, కల్వర్టులు దెబ్బతినడంతో మారుమూల పల్లెజనం బాహ్య ప్రపంచంలోకి అడుగుపెట్టే పరిస్థితి లేకుండా పోయింది. ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో నాగారం గ్రామానికి చెందిన నిండు గర్భిణీ దుర్గం లావణ్యను ప్రసూతి కోసం ఆసుపత్రికి తరలించే అవకాశం లేకుండా పోయింది ఆ కుటుంబ సభ్యులకు. నాగారం నుండి చెన్నూరుకు వెల్లేందుకు ఉన్న రహదారిలోని కల్వర్టు కూలిపోవడంతో రహదారి ప్రమాదకరంగా తయారైంది. కుటుంబ సభ్యులు లావణ్యను ఓ ఆటోలో తరలించేందుకు ప్రయత్నించినప్పటికీ కల్వర్టు కూలిపోవడంతో ప్రత్యామ్నాయ మార్గం లేకుండా పోయింది వారికి. కల్వర్టు నుండి మెయిన్ రోడ్డు వరకు లావణ్యను తీసుకెళ్లడం ఎలా అని ఆమె కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోతున్న క్రమంలో ఆమె ధైర్యంతో ముందుకు నడవడం మొదలు పెట్టింది. అటవీ మార్గం గుండా ఏర్పడిన కాలి బాట మీదుగా సుమారు కిలోమీటరు దూరం వరకు నడుచుకుంటు వచ్చి 108 అంబూలెన్స ను చేరుకుందా గర్భిణీ. ఓ వైపున ఆమెను పురిటి నొప్పులు బాధ పెడుతుంటే మరో వైపున కడుపులో ఉన్న బిడ్డ పరిస్థితిని ఆలోచించుకున్న ఆ తల్లి కుటుంబ సభ్యుల సాయంతో కాలి నడకన ప్రధాన రహదారి వరకు చేరుకోవడం విశేషం. అప్పటికే సమాచారం అందుకున్న 108 సిబ్బంది మెయిన్ రోడ్డుపై సిద్దంగా ఉండగా దుర్గం లావణ్యను అంబూలెన్స్ లో చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిండు చూలాలు అయినప్పటికీ ధైర్యంగా నడుచుకుంటూ వచ్చిన ఆమెను స్థానికులు అభినందిస్తున్నారు.
అమ్మతనం అంటే ఇదే…
తొమ్మిది నెలల పాటు తన గర్భంలో పెరిగిన బిడ్డ పుట్టే సమయానికి ప్రకృతి విలయతాండవం చేస్తోంది. ఈ సమయంలోనే పురిటి నొప్పులు రావడంతో ఇబ్బంది పడుతున్న ఆ తల్లి దారితెన్ను లేని ఈ పరిస్థితుల్లో పెద్ద దవాఖాను వెల్లడం ఎలా అని మదనపడిపోయింది. అయినప్పటికీ తన కడుపున పుట్టాల్సిన పండంటి బిడ్డను తల్చుకుని ప్రతికూల వాతావరణంలో… రోడ్డు సరిగా లేక కల్వర్టు శిథిలమై పోయినా అటవీ మార్గం గుండా ఆమె కాలి నడకన అంబూలెన్స్ వరకు చేరుకోంది. మాతృత్వపు మమకారమే లావణ్యను గమ్య స్థానం చేరేందుకు సాహసించే పరిస్థితిని తీసుకొచ్చింది. ఏది ఏమైనా ఇలాంటి దయనీయమైన పరిస్థితులు పునరావృతం కాకుండా ఉండాలంటే మారుమూల పల్లెల రహదారులను మెరుగు పర్చాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందని ఈ ఘటన రుజువు చేస్తోంది.