గురువుకు అరుదైన గౌరవం…

దిశ దశ, వరంగల్:

రెండున్నర దశాబ్దాల క్రితం ఆ ప్రాంతంలో అక్రమంగా గంజాయి సాగు చేసే వారు. పోలీసులు ఎక్సైజ్ అధికారులు ఆ ఏరియాలో నిరంతరం దాడులు చేయడమే పనిగా పెట్టుకునే వారు. ఆనాటి పరిస్థితులకు పూర్తి భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి నేడు. ఆహార పంటలు సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నారు అక్కడి రైతాంగం. గంజాయి వనంలో తులసి మొక్కల్లా మారిన నేటి తరం అందిస్తున్న స్పూర్తి అందరిని ఆకట్టుకుంటోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒకప్పుడు గంజాయి పంటకు ప్రసిద్ది గాంచిన ఆ ప్రాంతంలో నేడు విద్యా కుసుమాలు విరబూస్తున్నాయి. సన్మార్గంలో నడవడమే కాదు తమ జీవితాలకు మార్గ నిర్దేశనం చేసిన గురువులను గౌరవించుకునే సాంప్రాదాయాన్ని కొనసాగించిన తీరు చర్చనీయాంశం అయింది. పదవి విరమణ చేసిన హింది మాస్టారుకు ఆ చిన్నారులు, గ్రామస్థులు ఏర్పాటు చేసిన వీడ్కోలు గురించి జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. జిల్లాలోని దుగ్గొండి ఉన్నత పాఠశాలలో గత కొంతకాలంగా హింది బోధన చేస్తూ అక్కడి విద్యార్థుల మనసుల్లో చెరగని ముద్ర వేశారు జనార్థన్ మాస్టారు. విద్యార్థులను సుశిక్షుతులుగా తీర్చిదిద్దడంలో తనవంతు పాత్ర పోషించిన ఆ హిందీ సార్ కు అరుదైన రీతిలో వీడ్కోలు నిర్వహించారు. పాఠశాల విద్యార్థులు హిందీ టీచర్ జానార్దన్, ఆయన సతీమణి జయలను ఎద్దుల బండిలో కూర్చోబెట్టి బండిని లాగుతూ ఊరేగింపు నిర్వహించారు. తమను తీర్చిదిద్దడం కోసం పడ్డ తపన అంతా ఇంతా కాదని, ఆయన రుణం తీర్చుకోలేనిదని భావించిన స్టూడెంట్స్ బారతీయ సాంప్రాదాయంగా ఎద్దుల బండిలో ఎక్కించి నిర్వహించిన ఈ ర్యాలీ ఆదర్శప్రాయంగా నిలిచింది. ఈ సందర్బంగా తెలంగాణ సాంస్కృతి సాంప్రాదాయలు ఉట్టిపడే విధంగా కోలాటం, బతుకమ్మ ఆడి జనార్దన్ పదవి విరమణ సందర్భంగా అత్యంత వైభంగా కార్యక్రమాలు నిర్వహించారు. తమ జీవితాలకు పునాదులను నిర్మించే ఉపాధ్యాయ లోకాన్ని విస్మరించే తీరుకు భిన్నంగా దుగ్గొండి విద్యార్థులు అందించిన అరుదైన గౌరవం స్పూర్తినిచ్చే విధంగా తయారైంది.

సాంప్రాదాయానికి ప్రతీక…

సాంప్రాదాయాలను గౌరవించుకోవడంలో భారతీయుల ప్రత్యేకతే వేరు. దుగ్గొండి పాఠశాలలో హిందీ టీచర్ జనార్దన్ కు విద్యార్థులు ఇచ్చిన పదవి విరమణ వీడ్కోలు నిర్వహించిన తీరుపై మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ట్విట్టర్ వేదికగా అభినందించారు. గురు-శిష్యుల బంధానికి ప్రతీకగా నిలిచిన తీరు అభింనదనీయమని కొనియాడారు.


You cannot copy content of this page