దిశ దశ, సిద్దిపేట:
ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందంటే ఇదేనేమో… పాత కలెక్టర్ సాబ్ పిలిశాడని వెళ్లారో లేక అభ్యర్థిపై ఉన్న ప్రేమతో అటెండ్ అయ్యారో తెలియదు కానీ ఎన్నికల వేళ సిద్దిపేట జిల్లాలో జరిగిన ఘటన దేశ వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. దేశంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు సంబంధించిన ఘటనలో ఇంతవరకు ఒకే సారి 106 మందిపై వేటు పడనట్టుగా సమాచారం. ఈ రికార్డు తెలంగాణాలోని సిద్దిపేట జిల్లాకే దక్కినట్టయింది.
అసలేం జరిగిందంటే..?
దేశ వ్యాప్తంగా లోకసభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అభ్యర్థులు ఎవరి ప్రచారంలో వారు బిజీబీజీగా గడుపుతున్నారు. అయితే తెలంగాణాలోని సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్ లో ఆదివారం రాత్రి ఓ సమావేశం జరిగింది. మెదక్ లోకసభ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, సిద్దిపేట మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, సిద్దిపేట అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ మాజీ చైర్మన్ రవిందర్ రెడ్డిలు హాజరైన ఈ సమావేశం గురించి బయటకు లీకయింది. దీంతో ఎన్నికల నిఘా అదికారులు, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు రంగంలోకి దిగాయి. సదరు ఫంక్షన్ హాల్ లో జరుగుతున్న ఈ సమావేశంపై సోమవారం ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు పాల్పడ్డారంటూ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి, సుడా మాజీ ఛైర్మన్ రవిందర్ రెడ్డిలపై కేసు కూడా నమోదు అయింది. దీంతో ఈ అంశం చల్లబడిపోయిందని భావించారంతా.
కలెక్టర్ సంచలన నిర్ణయం
అయితే ఈ ఘటనలకు సంబంధించిన విషయంలో సిద్దిపేట కలెక్టర్ మను చౌదరి ఈ మీటింగ్ కు సంబంధించిన విషయంపై ఆరా తీశారు. ఎన్నికల కమిషన్ నుండి కూడా ఆదేశాలు రావడంతో సీరియస్ గా తీసుకున్న జిల్లా కలెక్టర్ మను ఛౌదరి సమావేశం జరిగినప్పడు ఎన్నికల నిఘా సిబ్బంది తీసిన వీడియో ఫుటేజీని క్షుణ్నంగా పరిశీలించారు. ఈ సమావేశంలో సిద్దిపేట జిల్లాకు చెందిన 106 మంది ఉద్యోగులు పాల్గొన్నారని గుర్తించారు. ఈ మేరకు వారందరిని కూడా సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. సస్పెండ్ అయిన వారిలో సెర్ప్ ఉద్యోగులు 38 మంది ఉండగా వారిలో 14 మంది ఏపీఎంలు, 18 మంది సీసీలు, నలుగురు వీఓఏలు, ఒక సీఓ, ఒక సీబీ ఆడిటర్ లు ఉన్నారు. ఈజీఎస్ విభాగానికి చెందిన 68 మంది ఉధ్యోగుల్లో ఏపీఓలు నలుగురు, ఏడుగురు ఈసీలు, 38 మంది టీఏలు, 18మంది సీఓలు, ఒక ఏఫ్ఏ ఉన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలలో ఏకకాలంలో 106 మంది ఉధ్యోగులపై వేటు వేయడం మాత్రం ఇదే మొదటి సారి కావడం విశేషం. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కలెక్టర్లు, సీపీలు, ఎస్పీలను ఎన్నికల కమిషన్ బదిలీ చేయడం సంచలనం కాగా తాజాగా సిద్దిపేట జిల్లాలో 106 మంది ఉధ్యోగులను సస్పెండ్ చేయడం మరో రికార్డుగా నిలిచింది. దేశంలో కూడా ఒకే సారి ఈ స్థాయిలో ఉద్యోగులను ఎన్నికల కమిషన్ నిభందనలను అనుసరించి సస్పెండ్ చేయనట్టుగా తెలుస్తోంది.