మహాశక్తి ఆలయంలో అభ్యర్థుల పూజలు…
దిశ దశ, కరీంనగర్:
ఎమ్మెల్సీ ఎన్నికల్లో అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది. నామినేషన్లు వేసిన అభ్యర్థుల్లో ముగ్గురు ఒకే ఆలయంలో పూజలు చేయడం విశేషం. నామినేషన్ వేసే ముందు కరీంనగర్ చైతన్యపురిలోని మహాశక్తి ఆలయంలో అభ్యర్థులు పూజలు చేసి ఎన్నికల అధికారి వద్దకు వెల్లి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఇప్పటి వరకు ఒక్క బీజేపీ నేత బండి సంజయ్ మాత్రమే ఇక్కడ పూజలు చేసి నామినేషన్ వేసేందుకు వెల్లేవారు. ఈ ఆలయం నిర్మాణంలో సంజయ్ పాత్ర కూడా కీలకం కావడంతో ఇతర పార్టీల నాయకులు అటువైపు వెల్లేందుకు సాహసించే వారు కాదు. సాధారణ సమయాల్లో దర్శనం చేసుకునేందుకు మహాశక్తి ఆలయానికి వెల్లినప్పటికీ ఎన్నికల సమయంలో అటువైపు వెల్లేడానికి అంతగా ఆసక్తి చూపే వారు కాదు ఇతర పార్టీల నాయకులు. కానీ ప్రస్తుతం జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేషన్లు వేసిన అభ్యర్థులు ఇదే ఆలయంలో ప్రత్యేక పూజలు జరపడం గమనార్హం. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలుస్తున్న వి నరేందర్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిల్చుకుంటున్న ప్రసన్న హరికృష్ణలు మహాశక్తి ఆలయంలో పూజలు చేసేందుకు ఆసక్తి చూపడం చర్చనీయాంశంగా మారింది. దేశంలోనే అత్యంత అరుదైన చరిత్రను సంతరించుకున్న కరీంనగర్ మహాశక్తి ఆలయం బీజేపీకి చెందినదన్న అభిప్రాయం వ్యక్తం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఒకే ప్రాంగణంలో ముగ్గురు అమ్మవార్లను ప్రతిష్టించిన ఆలయం ముంబాయి తరువాత కరీంనగరే కావడంతో ఇక్కడికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. కానీ రాజకీయ పార్టీల నాయకులు మాత్రం ఈ ఆలయం వైపునకు వెల్తే కాషాయం రంగు అంటుకుంటుందేమోనన్న అనుమానంతో అటుగా వెల్లేందుకు సాహసించే వారు కాదు. ఎన్నికల సమయంలో తమకు సెంటిమెంట్ గా భావించే ఆలయాల్లో అభ్యర్థులు ప్రత్యేక పూజలు చేసే సాంప్రాదాయం కొనసాగుతోంది. అయితే ఈ సారి మాత్రం ముగ్గురు ప్రధాన అభ్యర్థులు ఇక్కడే పూజలు నిర్వహించడం సరికొత్త సాంప్రాదాయానికి తెరతీసినట్టయింది. కాంగ్రెస్, ఇండిపెండెంట్ అభ్యర్థులు ఇక్కడ పూజలు చేసి నామినేషన్లు వేసిన తరువాత మహాశక్తి ఆలయంలో ఇతర పార్టీల అభ్యర్థులు కూడా ఇక్కడకు వెల్లే ఆనవాయితీ స్టార్ట్ అయినట్టయింది.