దిశ దశ, చెన్నై:
చనిపోయిన వారికి గౌరవమర్యాదలతో అంతిమసంస్కారం చేయాలన్న తపన ప్రతిఒక్కరిలో ఉంటుంది. ఇలాంటి గౌరవాన్ని అందించే బాధ్యత తమదేనని చెప్తోంది తమిళనాడు ప్రభుత్వం. సమాజంలోని ప్రతి ఒక్కరి పేరు సువర్ణాక్షరాలతో లిఖించే అవకాశం అయితే ఉండదు. కానీ… తమిళనాడు ముఖ్యమంత్రి మాత్రం ఇలాంటి అవకాశాన్ని కల్పిస్తామని ప్రకటించారు. సీఎం స్టాలిన్ తీసుకున్న ఈ సంచలన నిర్ణయం దేశ వ్యాప్తంగా కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తాజాగా ఆయన చేసిన ప్రకటన వల్ల మరణించిన వారి కుటుంబాలు నూతన సాంప్రాదాయానికి శ్రీకారం చుట్టే అవకాశం కూడా లేకపోలేదు. ఇంతకీ తమిళనాట ఈ బంపర్ ఆఫర్ ఎలాంటిదంటే…? చనిపోయిన వ్యక్తి అంతిమ సంస్కారాలను ప్రభుత్వ ఖర్చులతో అధికారిక లాంఛనాలతో చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు.
మరణించిన వ్యక్తి అవయవదానం చేసినట్టయితే వారి అంత్యక్రియల బాధ్యతలను తమిళనాడు ప్రభుత్వం తీసుకుంటుందని, ఇందుకు అయ్యే ఖర్చులే కాకుండా అధికారిక లాంఛనాలతో తమ నిర్వహిస్తుందని ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ ప్రకటించారు. ఆకస్మిక మరణం చెందిన వారి అవయవాలు దానం చేయడం వల్ల ప్రాణాపాయంలో కొట్టుమిట్టాడుతున్న వారికి పునరుజ్జీవం పోస్తాయన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే చనిపోయిన తమ కుటుంబ సభ్యులకు సంబంధించిన అవయవాలను దానం చేసేందుకు చాలా మంది సాహసించడం లేదు. ఈ విషయంపై అవగాహన లేక కొందరు, తమ వారి అవయవాలు తీసేసి అంతిమ సంస్కారం చేయడం భావ్యం కాదన్న నమ్మకంతో మరి కొందరు దానం చేసేందుకు ముందుకు రావడం లేదు. ఇలాంటి వారిలో చైతన్యం నింపేందుకు తమిళ నాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తీసుకున్న నిర్ణయం దేశ వ్యాప్తంగా కూడా చర్చిస్తున్నారు. అవయవ దానంలో తమ రాష్ట్రం టాప్ ర్యాంక్ లో ఉన్నప్పటికీ మరింత చైతన్యం నింపినట్టయితే మరింత మంది ముందుకు వచ్చినట్టయితే ఎక్కువమందికి ఆ అవయవాలు ఉపయోగపడతాయని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఏది ఏమైనా ఇలాంటి చైతన్యం మిగతా ప్రాంతాల్లోనూ వస్తే ప్రాణాపాయంలో కొట్టుమిట్టాడుతున్న ఎంతో మందికి ఉపయోగకరంగా ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.