చొప్పదండిపై అధిష్టానం రివ్యూ
అసమ్మతీ నేతలతో భేటి…
దిశ దశ, కరీంనగర్:
రోజు రోజుకు రచ్చకెక్కుతున్న విబేధాలకు పుల్ స్టాప్ పెట్టాలని అధికార పార్టీ భావిస్తోంది. ఆ నియోజకవర్గంలో ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరిస్తుండడంతో బీఆర్ఎస్ పెద్దలు ప్రత్యేక దృష్టి సారించారు ఆ నియోజకవర్గంపై. తాజాగా కరీంనగర్ లోని ఓ హోటల్ లో ప్రత్యేకంగా సమావేశం అయి అందరి నుండి వివరాలు సేకరించే పనిలో నిమగ్నం అయింది అధిష్టానం.
హోటల్ లో మీటింగ్…
చొప్పదండి నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులతో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశారు. కొద్ది సేపట్లో నియోజకవర్గానికి చెందిన నాయకులంతా అక్కడి పరిస్థితులను వివరించనున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పై ఇప్పటికే అధిష్టానానికి ఫిర్యాదులు చేయగా మరికొంత మంది గుర్రుగా ఉన్నారు. కొంతమంది రవిశంకర్ కు టికెట్ రాదంటూ ప్రచారం చేస్తుండగా… తమకు అవకాశం ఇవ్వాలంటూ నలుగురు అభ్యర్థులు పోటీపడుతున్నారు. వీరంతా కూడా సొంతగా పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేసుకుని విస్తృతంగా ప్రచారం కూడా చేస్తున్నారు. ఈ క్రమంల చొప్పదండి నియోజకవర్గంలో నెలకొన్న వాతావరణానికి అసలు కారణం ఏంటీ..? వీటిని పరిష్కరించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి అన్న విషయాలపై ఆరా తీసేందుకు బోయినపల్లి వినోద్ కుమార్ ప్రత్యేకంగా భేటీ అవుతున్నారు. ఆరు మండలాలకు చెందిన పార్టీ నాయకులు ఈ మీటింగ్ లో తమ అభిప్రాయాలు వివరించనున్నారు.