దిశ దశ, హైదరాబాద్:
ఆరు దశబ్దాలుగా విప్లవ పాటల కోసం ఆయన స్వరం పని చేస్తే… కడుపులో తూటా పెట్టుకుని జీవనం సాగించిన విప్లవ యోధుడు ఆయన. గుమ్మడి విఠల్ రావు అని పేరు పెట్టి పిలిస్తే ఆయన రక్త సంబధీకులు కూడా ఆయన ఎవరో ఉండే కదా అన్న ఆలోచనలో పడిపోయే వారు కావచ్చు. కానీ గద్దర్ అనగానే ప్రతి ఒక్కరికి గుర్తుకు వచ్చేది మాత్రం… చేతిలో కర్ర… భుజనా గొంగడి, కాలికి గజ్జె కట్టుకుని ఓలియో ఓలా ఓలియా ఓలా… ఓలో ఓలా ఓలియా ఓలా అంటూ పాటలు పాడే వ్యక్తి అని స్పూరించక మానదు. రెండున్నర దశాబ్దాల క్రితం ఆయనపై కాల్పులు జరిపితే కడుపులో తూటా చిక్కుకపోయింది. అయినప్పటికీ ఆయన నోట విప్లవ పాటలు ఆగలేదు… చైతన్యం నింపే చర్యలకు బ్రేకు పడలేదు.
తూటాలు కక్కనున్న తుపాకులు
ఇక వామపక్ష విప్లవోద్యమ చరిత్రనే గద్దర్ అంత్యక్రియలు తిరగరాస్తున్నాయి. భారత రాజ్యంగానికి వ్యతిరేకంగా గళాన్ని వినిపిస్తూ పోరుబాట పట్టిన యోధుడి నిష్క్రమణ తరువాత తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆయన అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించడంతో సర్కారు ఆ దిశగా చర్యలు చేపడుతోంది. రాజ్యం తుపాకి ఎక్కు పెడితే నేలను ముద్దాడిన ఎర్ర మల్లెలు చనిపోతే సర్కారు తుపాకి తలవంచుకుని అంతిమ సంస్కారం నిర్వహించిన చరిత్ర దేశంలోనే అత్యంత అరుదే. కానీ విప్లవ పంథాలో సాగిన గద్దర్ విషయంలో మాత్రం తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం విప్లవోద్యమకారులకూ సర్కారు గౌరవం ఇస్తుందన్న సంకేతాలను ఇచ్చింది. తెలంగాణ వాగ్గేయకారుడిగా ఆయన అంతిమ సంస్కారాన్ని అధికారికంగా నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిచడం విషేశం. బ్రతికున్న రోజుల్లో ఆయన్ని ఏ తుపాకి నుండి వచ్చే తూటా ముద్దాడుతుందోనన్న ఆందోళన నెలకొన్న పరిస్థితులు ఉండేవి. చట్టానికి కొరకరాని కొయ్యలా ఉన్న ఆయన అంత్యక్రియలకు అధికారిక తుపాకులు గాలిలోకి కాల్పులు జరపనున్నాయి. ఒకప్పుడు ఏ వ్యవస్థ అయితే ఆయన్ని కక్ష్యగట్టిందో నేడు అదే వ్యవస్థ నివాళులు అర్పించబోతోంది. భారత విప్లవోద్యమ చరిత్రలోనే ఇలాంటి ఘటనలు చోటు చేసుకోలేదేమో. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఆ దిశగా చర్యలు చేపట్టడం సరికొత్త అధ్యాయాన్ని క్రియేట్ చేసినట్టయింది. ఒకప్పుడు ఆయనపైకి ఎక్కు పెట్టిన తుపాకులు ఇప్పుడు తల దించుకుని నివాళులు అర్పించేందుకు సిద్దం అవుతున్నాయి.
సోమవారం అంత్యక్రియలు…
సోమవారం 11 గంటలకు ఎల్ బి స్టేడియం నుండి గద్దర్ అంతిమ యాత్ర ప్రారంభం కానుంది. గన్ పార్క్ వద్ద గద్దర్ మృతదేహాన్ని ఉంచి నివాళులు అర్పించిన అనంతరం శోభాయాత్ర హైదరాబాద్ మహానగర ప్రధాన రహదారుల గుండా సాగి భూదేవి నగర్ లోని మహా బోధి విద్యాలయంలో అఖరి మజిలి నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గద్దర్ మరణ వార్త తెలిసిన వెంటనే కళాకారులు అంతా కూడా పెద్ద సంఖ్యలో ఎల్ బి స్టేడియంకు చేరుకున్నారు. పేద ప్రజల గొంతుకగా నిలిచిన గద్దర్ అన్నకు తమ పాటలతో నివాళులు అర్పించేందుకు తెలంగాణ కళాకారులు సమాయత్తం అయ్యారు. మూగోబోయిన పెద్ద పాటకు వేలాది గొంతుకలు తమ స్వరార్చనతో నివాళులు అర్పించనున్నారు.