దిశ దశ, దండకారణ్యం:
ఆందోళనలు జరుగుతున్నాయంటే సాధారణంగా అధికార పార్టీ నాయకులు అటువైపు కన్నెత్తి చూడరు. ఆందోళనకారులను కలిసేందుకు అధికార యంత్రాంగం, అనుచర గణం కలిసేందుకు కూడా కూడా సమ్మతించారు. కానీ అక్కడ మాత్రం అధికార పార్టీ ఎంపీనే స్వయంగా ఆందోళనకారుల శిబిరానికి వెల్లి చర్చలు జరపి మరీ వారి సమస్య పరిష్కారం కోసం చొరవ తీసుకోవడం ఆదర్శంగా నిలిచింది.
ఎక్కడి ఎంపీ.. ఎం చేశారక్కడ…?
తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్ బ్యాక్ వాటర్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన సరిహద్దు గ్రామాల ప్రజలు గత కొంతకాలంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సిరొంచ తాలుకాలోని 12 గ్రామాల్లో నోటిఫై చేసిన భూమికి పూర్తిగా పరిహారం అందించలేదని, అదనంగా మునుగుతున్న భూమికి సంబంధించిన సర్వే జరపాలన్న డిమాండ్ తో ఆందోళనలు చేపట్టారు బాధిత గ్రామాల రైతులు. అయితే నిరసన చేపట్టిన రైతులు కేవలం సిరొంచ తహసీల్ కార్యాలయం ముందు దీక్షా శిబిరంలో కూర్చొని వెల్లడంతోనే సరిపెట్టకుండా పాలకపక్షానికి చెందిన నేతలను, అధికారులను కలుస్తూ వినతి పత్రాలు సమర్పిస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగా ఐదు నెలల క్రితం నాగపూర్ లో జరిగిన అసెంబ్లీ సమావేశాలకు హాజరైన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ను కలిసి తమ గోడు వెల్లబోసుకోగా తగిన న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో సిరొంచలో దీక్షా శిబిరాన్ని తొలగించారు. ఆ తరువాత జిల్లా అధికార యంత్రాంగంలో కూడా మేడిగడ్డ బాధిత రైతులకు పరిహారం ఫైలు కూడా కదలడం మొదలుపెట్టింది. గడ్చిరోలి జిల్లా అధికారులు ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వానికి కూడా లేఖ రాశారు. అయితే ఐదు నెలలు గడిచినా తమకు మాత్రం పరిహారం అందలేదని మళ్లీ రైతులు నిరంతర నిరసన దీక్షకు శ్రీకారం చుట్టారు. పోలీసులు 144 సెక్షన్ అమల్లో ఉందని చెప్పినా శిబిరంలో నలుగురు రైతుల చొప్పున నిరసనలు వ్యక్తం చేయడం ఆరంభించారు. దీక్షా శిబిరం సాగుతున్న నేపథ్యంలోనే గడ్చిరోలి జిల్లా ఇంఛార్జి మంత్రి కూడా అయిన దేవేంద్ర ఫడ్నవిస్ మూడు రోజుల క్రితం రాగా ఆయన్ని వ్యక్తిగతంగా కలిసి మళ్లీ వినతి పత్రం అందించారు. పది రోజుల్లో పరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటామని, తెలంగాణ ప్రభుత్వంతో సంబంధం లేకుండా నోటిఫై చేసిన 128 హెక్టార్ల భూమికి ముందుగా నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకున్న రైతులు మాత్రం దీక్షా శిబిరాన్ని తొలగించకుండా యథావిధిగా కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో శుక్రవారం సిరొంచ తాలుకా కేంద్రానికి బీజేపీకి చెందిన గడ్చిరోలి ఎంపీ అశోక్ నేతే వచ్చారు. రేపన్ పల్లి రోడ్డు ప్రారంభోత్సవానికి వచ్చిన ఆయన్ను మేడిగడ్డ బాధిత రైతులు మరో సారి కలిశారు. గతంలో సిరొంచ తాలుకా సమీక్షా సమావేశానికి వచ్చినప్పుడు కూడా కలిశామని గుర్తు చేసిన రైతుల వినతికి సానుకూలంగా స్పందించిన అశోక్ నేతే నేరుగా తహసీల్ కార్యాలయ ఆవరణలోని దీక్షా శిబిరానికి చేరుకున్నారు. శిబిరంలో ఉన్న రైతులతో పాటు, బాధిత గ్రామాలకు చెందిన వారితో దాదాపు 3 గంటలకు పైగా చర్చలు జరిపారు. సిరొంచ తాలుకాలోని మేడిగడ్డ బాధిత 12 గ్రామాల రైతాంగం సమస్య విన్న ఎంపీ అశోక్ నేతే రైతుల ముందే గడ్చిరోలి కలెక్టర్ తో ఫోన్లో మాట్లాడారు. బాధిత రైతులకు అందించే పరిహారం విషయంలో ఎలాంటి చొరవ తీసుకున్నారు..? వీరికి న్యాయం చేసేందుకు ఎలా ముందుకు వెల్తున్నారు అన్న వివరాలు అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం పరిహారం ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నప్పటికీ నిధులు బదిలీ చేయడం లేదని వివరించిన కలెక్టర్, మహారాష్ట్ర ప్రభుత్వమే ఇందుకు సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేసిందని వివరించారు. మే నెల చివరి వరకు నోటిఫై చేసిన భూములకు సంబంధించిన పరిహారం ఇచ్చేందుకు అవసరమైన ప్రతిపాదనల ఫైలు ముంబాయి సెక్రటరియేట్ కు వెల్లిందని కూడా కలెక్టర్ వివరించారు. మేడిగడ్డ బాధిత రైతులకు పరిహారం ఇచ్చే విషయంలో అన్నింటా అండగా ఉంటామని గడ్చిరోలి ఎంపీ అశోక్ నేతే ప్రకటించారు. దీంతో బాధిత రైతాంగంలో సంతోషం వ్యక్తమవుతోంది.
నాన్ నోటిఫై భూములపై…
అలాగే మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం సమయంలో చేసిన సర్వేలో నోటిఫై చేసిన భూములకన్నా ఎక్కువగా వ్యవసాయ భూములు ముంపునకు గురవుతున్నాయని బాధిత గ్రామాల రైతులు ఎంపీకి వివరించారు. బ్యారేజీ నిర్మాణం చేసిన తరువాత తెలంగాణ ప్రభుత్వం ప్రొటెక్షన్ వాల్ నిర్మిచలేదని, అదనంగా ముంపునకు గురవుతున్న భూముల గురించి కూడా పట్టించుకోవడం లేదని ఎంపీ ముందు బాధిత రైతులు వాపోయారు. అదనపు భూముల విషయాన్ని కూడా తాను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకవెళ్లి పరిష్కారం చూపిస్తానని ఆశోక్ నేతే హామీ ఇచ్చారు. అంతేకాకుండా ముంబాయిలో మహారాష్ట్ర, తెలంగాణకు సంబంధించిన మంత్రులు, అధికారులు, సంబంధిత జిల్లాల అధికారులతో పాటు బాధిత రైతులతో ప్రత్యేకంగా సమావేశం కూడా ఏర్పాటు చేయిస్తానని రైతులకు హామీ ఇచ్చారు ఎంపీ. దీంతో సిరొంచ తాలుకాలోని మేడిగడ్డ బ్యారేజ్ బాధిత రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. అయితే తమ సమస్యలు శాశ్వత పరిష్కారం అయ్యే వరకు మాత్రం తమ దీక్షా శిబిరాన్ని తొలగించవద్దని రైతాంగం అభిప్రాయపడుతోంది.