పోలీసుల దృష్టికి వచ్చిన కొత్త విషయాలు…
దిశ దశ, కరీంనగర్:
భూ దందాలు… సెటిల్ మెంట్లు… ఫైనాన్స్ వ్యవహరాలు ఇలా ఒక్కటా రెండా పోలీసుల వద్దకు వచ్చి చేరుతున్న ఫిర్యాదుల పరంపరను చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే… ఒక్కో కేసును విచారిస్తున్న పోలీసులకు కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నట్టుగా సమాచారం. ఆర్థిక నేరాలు… భూ అక్రమణలే కాదు ఏకంగా కుటుంబాల మధ్య కూడా చిచ్చులు పెట్టిన ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి.
‘పీసా’ కట్ పీసా..?
ఏడెమినిదేళ్ల క్రితం విజయవాడలో వెలుగులోకి వచ్చిన కాల్ మనీ దందాగాళ్లను మరిపించే విధంగా కొన్ని బ్యాచులు కూడా కరీంనగర్ లో ఏర్పడినట్టుగా తెలుస్తోంది. ఏ దందా అయినా ‘ఆ’ వ్యవహారానికి లింక్ పెట్టిన తరువాతే కథ కానిచ్చేవాళ్లన్న ప్రచారం సాగుతోంది. కొంతమందిని టార్గెట్ చేసుకుని మరీ సాదాసీదా జీవనం సాగిస్తున్న వారిని ఈ రొంపిలోకి దింపిన ఘనులు అరాచకాలు కూడా పోలీసు అదికారుల దృష్టికి వచ్చినట్టుగా సమాచారం. ఇటీవల కాలంలో కరీంనగర్ లో వస్తున్న ఫిర్యాదులపై స్పెషల్ ఆపరేషన్ నిర్వహించిన పోలీసు అధికారులకు కరీంనగర్ లో విజయవాడ కాల్ మనీ దందాను మరిపించిన ఘనుల ఘనకార్యాలు కూడా వెలుగులోకి వస్తున్నట్టుగా సమాచారం. చట్టాన్ని అచేతనావస్థకు చేర్చిన కొంతమంది పోలీసు అధికారులు కూడా ఈ దందాతో మిలాఖత్ కావడంతో అప్పుడు కొంతమంది ప్రముఖులది ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టుగా మారిందన్న ప్రచారం జరుగుతోంది. దీంతో అవసరాల కోసం వచ్చిన వారే అయినా తమ అవసరాలు తీర్చాలనుకున్న వారే అయినా ఆర్థిక పరమైన లావాదేవీలే కాదు ‘ఆ’ అవసరం తీర్చితేనే అన్నీ సాఫిగా జరిగేవని లేనట్టయితే హింస ఎదుర్కొక తప్పేది కాదని కొంతమంది బాధితులు కన్నీటి పర్యంతం అయినట్టుగా విశ్వసనీయంగా తెలుస్తోంది. కొన్ని ఫ్యామిలను అయితే ఏకంగా విడగొట్టి మరీ తమ పాదాల ముందు పడగొట్టే విధంగా వ్యవహరించారంటే కమిషనరేట్ పరిధిలో మానవతా విలువలు ఏ స్థాయిలో దిగజారిపోయాయో అర్థం చేసుకోవచ్చని ఓ సీనియర్ నాయకుడు వ్యాఖ్యానించారు. పీస్ అంటే ఓకే… కట్ పీస్ అంటే నో అన్న కోడ్ భాషలతో కూడా తమ పబ్బం గడుపుకున్నారని కూడా తెలుస్తోంది.
పైశాచిక ఆనందం కోసం…
తమ పబ్బం గడుపుకునేందుకు కొందరు… తమ పైశాచిక ఆనందం కోసం మరికొందరు వెంపర్లాడి మరీ ఆ సమాజాన్ని అంతరించిపోయేలా చేసిన తీరు గురించి ఇప్పుడిప్పుడే చర్చ మొదలైంది. ఈ వ్యవహారంలో కొన్ని టీమ్స్ ఏర్పడి కొంతమంది జీవితాలతోనే చెలగాటమాడుకున్నాన్నాయని తెలుస్తోంది. ఒక్కటా రెండా వందల సంఖ్యలో కుటుంబాలు ఘరాన గ్యాంగుల క్రూరత్వానికి బలైపోయారన్న వాదనలు వినిపిస్తున్నాయి. బంధాలు… అనుభందాలు కూడా మర్చిపోయిన కొంతమంది గ్యాంగులుగా ఏర్పడి రొంపిలోది దింపడం… సరఫరా చేయడమే పనిగా పెట్టుకున్నారని పోలీసు అధికారుల దృష్టికి వచ్చింది. తప్పటడుగులు వేస్తూ… తప్పటడగులు వేయించిన ఈ దందాగాళ్లపై కూడా పోలీసుల నిఘా మొదలైనట్టుగా విశ్వసనీయంగా తెలుస్తోంది. రహస్యంగా వీరి వివరాలను సేకరిస్తున్న కమిషనరేట్ పోలీసులు వీరందరిపై చట్టాలు ఉపయోగించేందుకు సమాయత్తం అవుతున్నట్టుగా సమాచారం. వీరి ‘ఆ’ అవసరాలను తీర్చేందుకు మానసికంగా హిసించి జీవితాంతం మానసిక వేదనకు గురయ్యేలా చేసిన వారి గురించి పోలీసుల దృష్టికి వచ్చిన విషయాలు తెలిస్తే ఒళ్లు జలధరించకమానదు. ఇలాంటి వారిపై కూడా కఠినంగా వ్యవహరించాలని నిర్ణయంచడంతో ఈ పాపం ఎవరెవరి మెడకు చుట్టుకోనుందో అన్నదే తేలాల్సి ఉంది.