కిస్సా కుర్సీకా… ఎస్సై కుర్చీ గయా…

దిశ దశ, జగిత్యాల:

ఆర్టీసీ బస్సులో సీటు పంచాయితీ కాస్తా ఓ ఎస్సైని సస్పెన్షన్ చేసే వరకూ తీసుకెళ్లింది. కరీంనగర్ జిల్లాలో మహిళల మధ్య మొదలైన ఈ వివాదం జగిత్యాల జిల్లా వరకు సాగింది. చివరకు తన పట్ల ఘోరంగా వ్యవహరించారంటూ మైనార్టీ యువతి ఆరోపణలు చేసిన వీడియోలు నెట్టింట వైరల్ కావడంతో పాటు ఎంఐఎం లీడర్లు కూడా జోక్యం చేసుకోవడంతో ఎస్సై అనిల్ సస్పెన్షన్ వరకు దారి తీసింది. ఆర్టీసీ బస్సు సీటు గురించి జరిగిన గొడవ చివరకు ఎస్సైకి కుర్చీ లేకుండాపోవడం విడ్డూరం.

బాదితురాలి ఆవేదన…

తాము సిద్దిపేట నుండి ఆర్టీసీ బస్సులో వస్తున్నామని, కరీంనగర్ లో ఓ మహిళ బస్సు ఎక్కిన తరువాత సీటు గురించి గొడవకు దిగారని బాధితురాలు ఆరోపించారు. వర్గ విబేధాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడారంటూ ఆమెపై ఆరోపణలు చేశారు. జగిత్యాలలో దిగిన తరువాత కూడా ఈ వివాదం మరింత ఎక్కువ కావడం వాహనంలో వచ్చిన ఆమె భర్త కూడా తనపై దురుసుగా ప్రవర్తించారంటూ ఆమె కన్నీరు మున్నీరుగా విలపించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ కావడంతో పాటు ఎంఐఎం నాయకులు కూడా పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడడంతో బుధవారం సాయంత్రం ఎస్సై అనిల్ ను జగిత్యాల ఎస్సీ కార్యాలయానికి అటాచ్డ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గురువారం జగిత్యాలకు వచ్చిన నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ బాధితురాలిని పరమార్శించిన తరువాత పోలీసు ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడి ఎస్సై అనిల్ పై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉత్తర తెలంగాణాలోని పలు జిల్లాల నుండి జనసమీకరణ చేసి జగిత్యాలలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఇదే సమయంలో పోలీసు ఉన్నతాధికారులు ఎస్సై అనిల్ ను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటన జారీ చేయడం గమనార్హం.

మీడియా ముందుకు ఎస్సై భార్య

రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటనపై గురువారం ఎస్సై అనిల్ భార్య సంధ్య మీడియా ముందుకు వచ్చారు. తన బిడ్డకు పాలిచ్చే పరిస్థితి లేదని సీటు ఇవ్వాలని తాను అభ్యర్థించానని, కండక్టర్ కూడా జరగాలని సూచించినప్పటికీ ఆగ్రహంతో ఊగిపోయారని ఆరోపించారు. వర్గ విబేధాలు రెచ్చగొట్టే విధంగా తాను అసలు మాట్లాడలేదని, కండక్టర్ మరో బస్సు ఇప్పట్లో వచ్చే అవకాశం లేదనడం వల్ల తాను ఆ బస్సులో ప్రయాణించానని సంధ్య వివరించారు. లేనట్టయితే మరో బస్సులో వచ్చే వారమని ఈ గొడవ కూడా జరిగేది కాదన్నారు. అయితే మార్గ మధ్యలో జగిత్యాల బస్ స్టేషన్ కు రావాలని ఆమె కొంతమందికి ఫోన్లు చేస్తున్న విషయాన్ని గమనించి భయం వేసి తన భర్త అనిల్ కు సమాచారం ఇచ్చానన్నారు. ఆమె దూషణలకు తట్టుకోలేక ఏడుస్తూ నా భర్తకు ఫోన్ చేశానని, బస్ స్టేషన్ వద్ద తాను దిగనని బస్ డిపో వద్దకు వచ్చి రిసీవ్ చేసుకోవాలని చెప్పడంతో అక్కడకు వచ్చారన్నారు. అయితే వివరాలు అడిగి తెలుసుకుంటున్న క్రమంలో ఆమె వీడియో తీస్తుంటే తాను అడ్డుకుని ఫోన్ లాక్కున్నానని అప్పుడు సెల్ కిందపడిపోయిందన్నారు. ఫోన్ లాక్కుంటున్న క్రమంలో ఆమెతో తనకు జరిగి పెనుగులాటలో చేతి గాజులు పగిలిపోవడంతో తన చేతికి గాయం కూడా అయిందని సంధ్య వివరించారు. తన భర్త వారిని బూట్లతో కొట్టలేదని మఫ్టీలో ఉన్న వ్యక్తి స్లిప్పర్లు వేసుకుని వస్తే బూట్లతో తన్నాడని చేస్తున్న ఆరోపణల్లో ఎంత మాత్రం నిజం లేదని వెల్లడించారు.

సీటు తెచ్చిన తంటా…

ఆర్టీసీ బస్సు సీటు తెచ్చిన తంటా రాష్ట్రంలోని పోలీసు అధికారులను కూడా తలలు పట్టుకునేలా తయారు చేసింది. ఎంఐఎం పార్టీకి చెందిన పలువురు నాయకులు అధికారులకు ఫోన్ చేసి నిలదీస్తుండడంతో అసలేం జరిగిందోనన్న విషయాన్ని పక్కనపెట్టిన పోలీసు ఉన్నతాధికారులు ఎస్సైని సస్పెండ్ చేశారు. ఇష్యూ మరింత ఝటిలంగా మారినట్టయితే పరిస్థితి చేయి దాటిపోతుందన్న యోచనలో అనిల్ ఎస్సైని సస్పెండ్ చేసినట్టుగా తెలుస్తోంది. ఏది ఏమైనా ఆర్టీసీ బస్సు సీటు పంచాయితీ కాస్తా ఎస్సై సస్పెన్షన్ కు దారి తీయడం చర్చనీయాంశంగా మారింది.

You cannot copy content of this page