దిశ దశ, కరీంనగర్:
నిండు నూరేళ్లు జీవించి తనువు చాలించిన తల్లికి అడవి నుండి తనయుడు సుదీర్ఘమైన లేఖ రాశారు. స్వతంత్ర్యం కోసం పోరాడిన తండ్రి కడుపున పుట్టిన బిడ్డగా సిద్దాంతం కోసం అడవుల బాట పట్టిన ఆ తనయుడు తల్లిని స్మరిస్తూ రాసిన లేఖ తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రపంచ మాతృ దినోత్సవం సందర్భంగా అమ్మను తలుచుకుంటూ, ఆమె గుండె నిబ్బరాన్ని కొనియాడుతూ లేఖ రాశారు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ నాయకుడు మలోజ్జుల వేణుగోపాల్. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ లేఖలో పలు అంశాలను సృషిస్తూ, అమ్మతనంలోని కమ్మతనాన్ని కీర్తించారు. ఆయన రాసిన లేఖ పూర్తి పాఠం…
విశ్వ మాతృ దినం
అమ్మల స్మృతులు అజరం అమరం
వేణు
అమ్మా అనే పిలుపు ఎంతో మధురమైనది. ఆత్మీయమైనది. పేగుబంధంతో ముడిపడిన అనుబంధం అది. అపురూపమైన అమ్మతనం గురించి సహజంగానే ప్రతి స్త్రీ ఎంతో అనుపమానమైన అనుభూతిని చెందుతుంది. తల్లుల కోసం బిడ్డలు, కన్న బిడ్డల కోసం తల్లులు పరితపించడం అత్యంత సహజం. అయితే, తరాలు మారుతున్న క్రమంలో బిడ్డలు తల్లులవుతారు. ఆ తల్లుల తల్లులు తమ బిడ్డల కోసం తన్లాడినట్టే వాళ్లు తమ బిడ్డల కోసం అణుక్షణం ఆరాటపడుతుంటారు. ఈ సహజానుభూతుల గురించి తెలిసిందే. ప్రకృతిలోని సమస్త జీవరాశులకు వివిధ రూపాలలో ఇదే వర్తిస్తుంది. అందుకు ఎవరూ అతీతులం కారు. ఈసారి నేను మా అమ్మ లేని అమ్మల దినం రోజు అమ్మల అనుభవాలను ప్రపంచ అమ్మలతో పంచుకుంటాను. యేటా నేను ప్రపంచ అమ్మల దినం నాడు మా అమ్మను, ఆమెతో నాకు, నా సహచరులకు వున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ పత్రికా ముఖంగానే భావాలను పంచుకుంటున్నాను. పెద్దపల్లి పెద్దవ్వగా సుపరిచితురాలైన మా అమ్మ గత నవంబర్ లో నిండా నూరేళ్ల వయసులో నా కోసం చివరి వరకు పలవరిస్తూ, కన్నీరు మున్నీరవుతూ, నేను నా ఆశయాన్ని, లక్ష్యాన్ని విడువకూడదనీ, నా సోదరుడు అమరుడు మల్లోజుల కోటేశ్వర్ కు కానీ, మము కన్న మా తండ్రి స్వాతంత్య్ర సమరయోధుడు మల్లోజుల వెంకటయ్య గారి ప్రతిష్టకు తలవంపులు తేకూడదనీ, నమ్మిన ప్రజలకు వెన్నుపోటు పొడవకూడదనీ బలంగా కోరుకుంటూ కన్ను మూసింది. మా అమ్మకు సాధారణంగా ప్రభుత్వ అధికారులో, పోలీసులో తమ “విధి నిర్వహణ” లో భాగంగా ఆ అవకాశాన్ని కల్పించేవారు. ఆమె ఆ కౌన్సిలింగుల వేళ కూడ మాకు ఎంతో ధైర్యాన్నిచ్చేది. అలాంటి మా అమ్మ ఈయేటి అమ్మల దినం నాడు భౌతికంగా మా మధ్య లేకుండా పోయింది. మా అమ్మకు, అమ్మలందరిని ప్రపంచ అమ్మల స్మరించుకుంటున్నాం. మా తల్లికే కాదు, నాడు వినమ్రంగా తలవంచి నాతో ప్రజా వుద్యమంలొ పాలుపంచుకుంటున్ననా సహచరులందరికి తమ తల్లులకు కౌన్సిలింగు పేరుతో అలాంటి అవకాశాలను కల్పిస్తుంటారు. “అడవిపాలైన” తమ బిడ్డలు జన జీవన స్రవంతిలోకి రావాలనీ తల్లులు పిలుపిస్తుండేవారు. అయితే, నాకు తెలిసినంత వరకు లక్షలాది పోరు తల్లుల ప్రేమపాత్రులైన ఏ బిడ్డా కన్న తల్లుల పిలుపులకు ఉద్యమ తల్లులను వదలి వెళ్లలేదు. ఈ ప్రపంచ అమ్మల దినం నాటికి నేను నా సహచరులు మరికొంత మంది తమ తల్లులను కోల్పోయిన దుర్వార్తలు వినక తప్పలేదు. ఆ తల్లులంతా సమకాలీనులు కావడంతో వారంతా దాదాపు ఒకే సమయంలో కన్నుమూశారు. ఒక పాత్రికేయ మితృడు చాలా శ్రమపడి అనేక వివరాలు సేకరించి నా ఉద్యమ సహచరుడి తల్లి రాజనర్సమ్మ కన్ను మూసిన వార్త చేరవేశాడు. అదే విధంగా నా వుద్యమ మరో సహచరుడైన కమలాకర్ తల్లి 85వ యేటా కొడుకును ఒక్కసారైన చచ్చేముందు చూడాలనీ తన్లాడి కన్ను మూసిందనీ పత్రికలు రాశాయి. అంతే కాదు, మరో తల్లి లక్ష్మీ తన సహచరున్ని విప్లవాశయాల కోసం సాగనంపి ఇంటివద్ద బిడ్డల పెంపక బాధ్యత తీసుకొని వారిని సన్మార్గంలో పోషించి పెంచి ఇటీవలే కన్నుమూసింది. అదే విధంగా మా పార్టీ నాయకుడు కామ్రేడ్ గణేశ్ తన తండ్రి మరణ వార్తతో తల్లడిల్లి ఇంటి వద్ద వున్న తల్లి ప్రేమను గుర్తు చేసుకుంటూ తండ్రి లేడని తెలసిన మనోవేదనను అమ్మతో పంచుకున్నాడు. నిజంగా వారి తల్లుల గురించి వారు వ్యక్తపరిచిన జ్ఞ్యాపకాలను ఈనాటి అమ్మల దినం నాడు నేను తలచుకుంటే, ప్రేమకు వర్గ లక్షణం వుందేమోననిపిస్తుంది. నేను పైన తెలిపినట్టు సహజంగానే తల్లులంతా తమ బిడ్డల కోసం ఎంతగానో తన్లాడుతుంటారు. అయితే, వారిలోనూ నిరుపేదలైన శ్రమజీవులైన తల్లులు, శ్రామిక కులాలకు చెందిన తల్లులు ప్రధానంగా నేనెరిగిన దళిత తల్లుల ప్రేమ మాధుర్యం అక్షరాలకు అందనిది. రక్తంతో పాటు చెమట చుక్కలను చిందించి బిడ్డలను సాదిన ఆ తల్లుల ప్రేమ. ఊళ్లల్లో కాలం చెల్లిన దొరతనపు ఆగడాలను, కనికరం లేని రాజ్య హింస పాశవిక చర్యలను బిడ్డల కోసం భరించిన ఆ తల్లులు స్మృతులు ఆ బిడ్డల నోటి వెంట వింటుంటే, సంపన్న కుటుంబాలలో పుట్టిన పిల్లల పట్ల తల్లుల ప్రేమ వాళ్ల వారసత్వ సంపదలు, ఆస్తులతో తులతూగలేదనీ సులువుగానే ఎవరైనా గ్రహించవచ్చు. చాలా వరకు ఆస్తులకు భంగం కలుగకూడదనే సంపన్నులు ప్రేమను, ఆప్యాయతను, బంధుత్వాలను త్యజిస్తుంటారు. కానీ, రెక్కల కష్టం తప్ప ఏ ఆస్తులు లేని లేద చిన్న చితక ఆస్తులున్న శ్రమజీవి తల్లులు తమ బిడ్డల కోసం ప్రేమతో ఆస్తులను కర్పూరంలా కరగదీసిన అనుభవాలు కోకొల్లలు. ప్రాణాన్ని ఫణంగా పెట్టి రాజ్యహింసను భరించిన సందర్భాలు తెలంగాణ పల్లెల్లో, ఏ దళిత వాడకు వెళ్లినా వెతలు వినపడుతాయి. నేను ఇలా రాస్తున్నానంటే ఏ తల్లి ప్రేమను శంకించడం కాదు, వర్గ సమాజంలో వారసత్వ సంపదలను కాపాడుకోవడానికి కుటుంబ పెద్దలు ముఖ్యంగా పితృస్వామ్య దాష్టీకం అనేక సాకులతో చేస్తున్న నాకు తెలిసిన యధార్థాన్నే పాఠకులతో పంచుకుంటున్నాను. సామాజిక చలన సూత్రాలు బోధపడిన బిడ్డలూ అంతే. వాళ్లు, ఎంతటి ఆస్తులనైనా లక్ష్య సాధనలో గడ్డిపోచలా భావిస్తూ అంకితభావంతో నిస్వార్థంగా విప్లవమనే భగీరథ ప్రయత్నానికి పూనుకుంటారు. చివరగా, ఒక విషయాన్ని తల్లులతో పంచుకోవాలనుకుంటున్నాను. రానున్న ప్రపంచ అమ్మల దినం లోపే దేశంలోనే మా వునికి లేకుండా చేసి తీరుతామనీ, ఈయేడే తల్లిని కోల్పోయిన మన దేశ ప్రధాని మోదీ, ఆయన అనుంగ సహచరుడు పేరుమోసిన హంతకుడు, యేళ్ల తరబడి కటకటాలు లెక్కించిన మన దేశ గృహ మంత్రి అమిత్ షా పదే పదే ప్రకటిస్తున్నారు. మావోయిస్టు రహిత భారత నిర్మాణమే వారి నూతన భారతం అని సెలవిస్తున్నారు. 2047 నాటికి పరాయిపాలన అంతమై వందేళ్లు నిండుతాయనీ, ఆ పాలకుల ముందు వారి గురుతుల్యులు పలుమార్లు లొంగిపోయిన గతాన్ని మరుగునపెడుతూ నవ భారతం నిర్మిస్తామని ఆరు మాసాల క్రితం హర్యాణాలోని సూరజ్ కుండ్ లో పూర్తి చేసుకున్నగుజరాత్ నమూనా చింతన్ శిబిర్లో కంకణం కట్టుకున్నారు. ఫలితంగా, అడవులన్నీ బాంబు దాడులతో, తుపాకుల మోతలతో దద్దరిల్లు తున్నాయి. జనావాసలపై, అడవి అడవంతా ఆకాశం నుండి డ్రోన్ లు బాంబులు గుమ్మరిస్తున్నాయి. మున్నెన్నడూ లేని విధంగా చరిత్రలో తొలిసారిగా మన దేశ మూలవాసీ ప్రజలపై, వారి బిడ్డలతో నిర్మితమైన ప్రజా సైన్యంపై హెలీకాప్టర్లు గుళ్ల వర్షం కురిపిస్తున్నాయి. ప్రజల రక్తంతో అడవులు రక్తసిక్తమవు తున్నాయి. వారి మావోయిస్టు రహిత భారతం కోసం అడవులను ధ్వంసం చేస్తున్నారు. వారి నవ భారతం కోసం మన దేశంలోని మూలవాసులు గుర్తింపునే నిరాకరిస్తూ వారి అస్థిత్వాన్ని కాలరాస్తూ వారి ఆత్మగౌరవాన్ని మంట గలుపుతున్నారు, దేశ పీడిత ప్రజల కోసం, దేశ ప్రజల సౌభాగ్యం కోసం, దేశ రక్షణ కోసం, దేశ అమూల్య వనరులను తరతరాలకు అందించే గురుతరమైన బాధ్యతతో వాటి రక్షణ కోసం, పర్యావరణ పరిరక్షణ కోసం నిస్వార్థంగా జాతికి అంకితమై, సామ్రాజ్యవాద వ్యతిరేక నిజమైన దేశభక్తితో, దృఢ సంకల్పంతో పోరాడుతున్న విప్లవకారులను మతొన్మదంతో, క్షుద్ర జాతీయ ప్రేలాపనలతో, సామ్రాజ్యవాదులకు, బహుళ జాతుల పెట్టుబడులకు మున్నెన్నటికన్నా శరవేగంగా దేశాన్ని తాకట్టుపెడుతున్న వర్తమాన హిందుత్వ పాలకులు మావోయిస్టులను రూపుమాసి నవ భారతాన్ని నిర్మిస్తామంటున్నారు. అది నవ భారతం కాదు, మను భారతం అవుతుంది. చరిత్ర రథ చక్రాలను వెనక్కి మళ్లించానుకుంటున్నారు. అందుకు మనం ఎంతమాత్రం అవకాశాన్ని ఇవ్వకూడదు. ఇది దేశానికి విషమ పరీక్షాకాలం. ప్రజలంతా జాగరూకులు కావాలి. దేశ విప్లవోద్యమాన్ని కాపాడుకోవాలి. దేశ వివిధతను రక్షించుకోవాలి. వివిధ మతాల, జాతుల, భాషల, సంస్కృతుల, ఆచారాల, సంప్రదాయాల భారత సమైక్యతను నిలుపుకుందాం. ఏ తల్లికి కడుపుశోఖం కలుగకుండా సుసంపన్నమైన, ప్రజాస్వామిక, లౌకిక నవ భారతాన్ని, యుద్ధాలకు, మత మారణహోమాలకు తావులేని న్యూ ఇండియాను మనమే పోరాడి నిర్మించుకుందాం. 2047కు ముందే మనం ఆ పని పరిపూర్తి చేసుకుందాం. మో- షాల విధ్యంసకర కలలు సాకారం కాకుండా వసుదైవ కుటుంబకానికై ప్రతిన పూనుదాం. ఈ బ్రుహత్ కర్తవ్య నిర్వహణలో లక్షలాది నక్షత్రాలు నేల రాలనిదే ఉజ్వలమైన భవిష్యత్తు ప్రకాశించదు అన్నట్టు అనేక త్యాగాలు తప్పవు. ఆ త్యాగధనులు అనునిత్యం మన కలలలో నిలుస్తారు. కలాలలో సిరా అవుతారు. గళాలకు స్వరాలవుతారు. వారి చరిత్రలతో పాటు వారిని కన్న తల్లుల స్మతులు అజరం, అమరం.