స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యపై వచ్చిన ఆరోపణలు తెర మరుగుయి పోయాయా..? నిన్నటి వరకు వేధింపులకు గురి చేశారని చెప్పిన సర్పంచ్ నవ్య గ్రామ అభివృద్ది నినాదాన్ని ఎత్తుకోవడం వెనక కారణం ఏంటీ..? అన్యాయం జరిగితే మాత్రం సహించేది లేదని ఆమె చెప్పడాన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి. ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీలో అసలేం జరుగుతోంది…
మూడు రోజులుగా ఆరోపణలు…
స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తనను లైంగిక వేధింపులకు గురి చేశాడని ధర్మసాగర్ మండలం జానకిపురం సర్పంచ్ నవ్య మూడు రోజులుగా ఆరోపణలు చేస్తున్నారు. రాజయ్య మాట్లాడిన ఆడియో క్లిప్స్ కూడా తనవద్ద ఉన్నాయని అవసరమైతే వాటిని అధిష్టానం ముందు ఉంచుతానని కూడా ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా విమర్శల ఝడివాన కురిసిందనే చెప్పాలి. ఎమ్మెల్సీ కవిత లిక్కర్ స్కాం విచారణ లేనట్టయితే రాష్ట్రం మొత్తం అంతా కూడా రాజయ్య ఎపిసోడ్ హాట్ టాపిక్ గా మారేది. కానీ అందరి దృష్టి లిక్కర్ స్కాంలో ఈడీ విచారణ అంశంపై ఉండడంతో ఈ అంశం హైలెట్ కాలేదు. కానీ నెటిజన్లు మాత్రం ఈ అంశంపై విమర్శనాస్త్రాలు సంధించారు. చివరకు రాష్ట్ర మహిళా కమిషన్ కూడా ఈ అంశంపై సుమోటో కేసు నమోదు చేసి సమన్స్ కూడా జారీ చేసింది. దీంతో రాజయ్య వ్యవహారం ఎటువైపు తిరుగుతుందోనన్న ఉత్కంఠకు తెర లేచింది. కాని అనూహ్యంగా ఎమ్మెల్యే రాజయ్య జానకిపురం వెల్లి సర్పంచ్ నవ్య ఇంట్లోనే మీడియాతో మాట్లాడడం గమనార్హం. దీంతో గులాభి పార్టీలో తారస్థాయికి చేరిన నవ్య ఆరోపణల పర్వం అంతాకూడా సద్దుమణిగినట్టయింది.
సర్పంచ్ నవ్య….
అయితే నవ్య మీడియాతో మాట్లాడినప్పుడు తాటికొండ రాజయ్య వల్లే తనకు అవకాశం వచ్చిందని ఆ కారణంగానే సర్పంచును అయ్యానని చెప్పారు. కానీ ఆమె తనలోని భావాలను చెప్తున్నప్పుడు నో కాంప్రమైజ్ అన్న సంకేతాలే ఇచ్చారు. వేధింపులకు గురయ్యే వారు అన్యాయానికి గురైన వెంటనే నిలదీయాల్సిందేనని అలాంటి వారికి తాను అండగా ఉంటానని స్ఫష్టం చేస్తున్నారు. ఇలాంటి అన్యాయాలను నిలదీయడంలో వెనక్కి తగ్గొద్దని కూడా నవ్య ఇదే వేదిక మీదుగా పిలుపునివ్వడం గమానార్హం. అయితే గ్రామాభివృద్ది కోసం తాను అన్ని వేళలా అందుబాటులో ఉంటానని చెప్పిన సర్పంచ్ పదే పదే వేధింపుల విషయంలో మాత్రం తగ్గేదేలే అన్నరీతిలోనే మాట్లాడడం గమనార్హం. ఇదే సమయంలో తమకు ఎలాంటి కష్టం వచ్చినా ఎమ్మెల్యే రాజయ్య అండగా నిలవాలని కోరడం విశేషం.
రూ. 25 లక్షలు సాంక్షన్
జానకిపురం గ్రామ అభివృద్ది కోసం రూ. 25 లక్షలు మంజూరు చేస్తున్నట్టు ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ప్రకటించారు. నవ్య, ప్రవీణ్ లకు సపోర్ట్ గా ఉంటానని కూడా ప్రకటించిన ఎమ్మెల్యే తన కుటుంబంలో కూడా నలుగురు ఆడబిడ్లలు ఉన్నారని, మహిళల కోసం నియోజకవర్గంలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించానని అన్నారు. మహిళల అభ్యున్నతి కోసం అన్ని వేళల్లో సహరిస్తానని, చిన్న చిన్న పొరపాట్లు ఉంటే క్షమించాలని కోరారు. పార్టీ అధిష్టానం జానకీపురం అభివృద్ది కోసం ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించిందని వివరించారు.