తెలంగాణలో హోళీ పండుగలో వైవిద్యం…
దిశ దశ, నిజామాబాద్:
హోళీ రోజున రంగు రంగులు పూసుకోవడం… సంబరాలు జరుపుకునే ఆనవాయితీని మాత్రమే చూస్తుంటాం. కానీ అక్కడ మాత్రం హోళీ పండగ రోజున పిడిగుద్దులు గుద్దుకునే సాంప్రాదాయం కొనసాగుతోంది. కొద్దిసేపు ఇరు పక్షాలు కొట్టుకున్న తరువాత హోళీ శుభాకాంక్షలు చెప్పుకునే ఆనవాయితీని కొనసాగిస్తున్నారు. తెలంగాణాలోని ఓ సరిహద్దు గ్రామంలో అత్యంత విచిత్రంగా కొనసాగతున్న హోళీ కేళీ గురించి తెలిస్తే ఆశ్యర్యపోకమానరు. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం హున్నా గ్రామంలో అత్యంత వైవిధ్య భరితంగా హోళీ పర్వదినాన్ని జరుపుకుంటుంటారు.
గుద్దుల వర్షం…
హున్నా గ్రామంలో హోళీ సంబరాల్లో భాగంగా పౌర్ణమి రోజు సాయంత్రం ఓ చోట గుమిగూడుతారు. రెండు వర్గాలుగా విడిపోయిన తరువాత వారి మధ్య ఓ తాడును అడ్డంగా ఉంచుతారు. ఇరు పక్కల ఉన్న వారు ఎదుటి పక్షం వారిపై పిడిగుద్దుల వర్షం కురిపిస్తారు. ఎదుటి వారి ముఖాలపై, వీపులపై పిడి గుద్దులు గుద్తుతూ హోళీ వేడుకలను నిర్వహించుకునే ఆనవాయితీ వందల ఏళ్లుగా హున్నా గ్రామంలో కొనసాగుతోందని గ్రామస్థులు చెప్తున్నారు. దాదాపు 30 నిమిషాల పాటు జరిగే పిడిగుద్దుల తీరును కొత్తగా చూసిన వారు అక్కడ రణరంగంగా మారిందని భయపడిపోతారు. కానీ పిడిగుద్దులతో హోళీ కేళీ ముగిసిన తరువాత ఒకరికొకరు పర్వదిన శుభాకాంక్షలు చెప్పుకుంటూ అలాయ్ బలయ్ చెప్పుకుని తమతమ ఇండ్లకు తిరిగి వెళ్లిపోతారు. ఈ సమయంలో గాయాల పాలైన వారు ముందు రోజు రాత్రి జరిపిన కామ దహనంలోని బూడిద తీసుకుని రాసుకుంటుంటారు. అప్పటి వరకూ ఒకరిపై ఒకరు పిడి గుద్దులు గుద్దుకున్న విషయాన్ని అక్కడి నుండి వెళ్లిపోయిన తరువాత మరిచిపోయి గ్రామస్థులంతా సోదర భావంతోనే మెదులుతుంటారు. ఈ సమయంలో కుల, వర్ణ వివక్షకు తావు లేకుండా గ్రామస్థులంతా కలిసి ఈ తంతు నిర్వహించుకోవడం విశేషం. అయితే ఈ సాంప్రాదాయం సరికాదని పోలీసులు పదే పదే చెప్పినా గ్రామస్థులు మాత్రం తరతరాలుగా వస్తున్న ఈ ఆనవాయితీని మాత్రం కొనసాగిస్తామని చెప్తారు. పోలీసులు కఠినంగా వ్యవహరిస్తామని తేల్చి చెప్పడంతో ఆంక్షల నడుమ పిడి గుద్దుల కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఈ తంతు ముగిసే వరకూ కూడా పోలీసులు హున్నా గ్రామంలో భారీ బందోబస్తు చేపట్టి వారిని నిలవురించే ప్రయత్నం చేస్తారు. ముందుగా నోటీసులు ఇచ్చినప్పటికీ తాత ముత్తాతల కాలం నాటి సాంప్రాదాయం కొనసాగించేందుకే గ్రామస్థులు మొగ్గు చూపిస్తండడం విశేషం.
ఎలా వచ్చిందంటే…
గతంలో మహారాష్ట్రలో ఉన్న హున్నా గ్రామం ఆ తరువాత తెలంగాణలో విలీనం అయింది. మహారాష్ట్రలో ఉన్నప్పుడూ హున్నా గ్రామానికి పొరుగునే ఉన్న సగ్రోలిలో ఈ తంతు నిర్వహించే వారని చెప్తున్నారు. సగ్రోలి గ్రామస్థులు ఈ పిడిగుద్దుల కేళిని హున్నా గ్రామస్థులకు అప్పగించడంతో పూర్వ కాలం నుండి ఈ గ్రామస్థులు హోళీ రోజున ఖచ్చితంగా ఈ కార్యక్రమం కొనసాగిస్తూనే ఉన్నారు. పూర్వీకులు అందించిన ఆచారాన్ని కొనసాగించేందుకే తాము మొగ్గు చూపుతున్నామని చూసేవారికి విచిత్రంగా ఉన్నా ఈ సాంప్రాదాయంతో తమ గ్రామంలో సమనత్వాన్ని ప్రదర్శించుకుంటున్న తీరును గమనించాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. ఏది ఏమైనా హోలీ అంటే రంగుల చల్లుకోవడమే కాదు పిడి గుద్దులు గుద్దుకునే సాంప్రాదాయమూ సాగిస్తున్న తీరు మాత్రం విచిత్రమనే చెప్పాలి.