దిశ దశ, రాజన్న సిరిసిల్ల:
క్రిస్మస్ వేడుకలు ముగిసిన తరువాత కలుద్దామని తన స్నేహితులకు బైబై చెప్పి గురుకుల పాఠశాల నుండి ఇంటికి చేరిన ఆ చిన్నారి కానరాని లోకాలకు తరలి వెళ్లిన ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. క్రిస్మస్ సెలబ్రేషన్స్ లో ఇంటిల్లిపాది సంబరాల్లో మునిగితేలుతున్న క్రమంలో 13 ఏళ్ల బాలుడు ఛాతి నొప్పికి గురై మరణించిన తీరు ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తోంది. సంఘటనా వివరాల్లోకి వెల్తే… రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామానికి చెందిన తాళ్లపల్లి శంకర్, సరిత దంపతులకు జశ్వంత్, సుశాంత్ మగ సంతానం కలిగారు. కూలీ నాలి చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఇద్దరు బిడ్డలను కూడా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివిస్తున్నారు. జశ్వంత్ కోనరావుపేట ప్రభుత్వ ఇంటర్మీడియెట్ కాలేజీలో చదువుతుండగా, సుశాంత్(13) ముస్తాబాద్ మండలం గురుకుల పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్నాడు. సోమవారం క్మిస్మస్ వేడుకులను పురస్కరించుకుని సెలవులు ప్రకటించడంతో ఆదివారం ఇంటికి చేరుకున్నాడు. సోమవారం ఇంట్లో క్మిస్మస్ పర్వదిన వేడుకలు నిర్వహిస్తున్న క్రమంలో ఛాతిలో నొప్పి వస్తున్నదని సుశాంతి తల్లిదండ్రులకు తెలిపాడు. వెంటనే అతనికి చికిత్స అందించేందుకు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రైవేటు ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. ప్రాథమిక చికిత్స అందుతున్న క్రమంలోనే సుశాంత ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు తెలపడంతో అతని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. నిరుపేద కుటుంబానికి చెందిన బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని నిజామాబాద్ సర్పంచ్ కేతిరెడ్డి అరుణ ప్రభుత్వాన్ని కోరారు.