ఢిల్లీ నుండి వచ్చిన ఐఏఎస్ అధికారుల బృందం
ధర్మపురి ఈవీఎంల స్ట్రాంగ్ రూం కీస్ మిస్సింగ్ వ్యవహారం
దిశ దశ, జగిత్యాల:
ధర్మపురి ఎన్నికల కౌంటింగ్ కు సంబంధించిన ఈవీఎంల స్ట్రాంగ్ రూం కీస్ మిస్సింగ్ మిస్టరీపై విచారించేందుకు ఎన్నికల అధికారుల బృందం కొండగట్టు జెఎన్టీయూకు చేరుకుంది. మద్యాహ్నం 12 గంటల ప్రాంతంలో న్యూ ఢిల్లీ నుండి వచ్చిన అధికారుల టీం విచారణ ప్రారంభించింది. ఈ నెల 10న హైకోర్టు ఆదేశాలతో స్ట్రాంగ్ రూం నుండి ఫామ్ 17 సేకరించేందుకు జగిత్యాల జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ యాస్మిన్ భాషా నేతృత్వంలో ప్రయత్నించారు. అయితే మూడు గదులకు సంబంధించిన తాళం చేతుల్లో రెండు గదులవి లభ్యం కాలేదు. ఈ విషయాన్ని ధర్మపురి కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుామర్ హై కోర్టు దృష్టికి తీసుకెల్లగా 2018 ఎన్నికల కౌంటింగ్ తరువాత స్ట్రాంగ్ రూంలోకి ఈవీఎంలు ఇతర రికార్డులకు సంబంధించిన వ్యవహారం అంతా కూడా నివేదిక ఇవ్వాలని ఈసీఐని ఆదేశించింది. ఈ నెల 26న ఈ నివేదికను అందించాల్సి ఉన్నందున భారత ఎన్నికల సంఘం ప్రత్యేకంగా ముగ్గురు అధికారుల బృందాన్ని క్షేత్ర స్థాయి విచారణకు పంపించింది. ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాశ్ కుమార్, అండర్ సెక్రటరీ సంజయ్ కుమార్, జాయిట్ సీఈఓ రవి కిరణ్, సత్యవాణిలు విచారణ చేసేందుకు జగిత్యాల జిల్లా కొండగట్టుకు చేరుకున్నారు. ముగ్గురు అధికారుల బృదం ఈవీఎం స్ట్రాంగ్ రూం కీస్ వ్యవహారంపై సంబంధిత అధికారుల నుండి వివరాలు సేకరించే పనిలో నిమగ్నం అయ్యారు.
అప్పటి కలెక్టర్ నుండి…
జగిత్యాల కలెక్టర్ గా ఎన్నికలప్పుడు పని చేసిన శరత్, ఆయన తరువాత పని చేసిన రవి, ప్రస్తుతం బాధ్యతలు నిర్వర్తిస్తున్న యాస్మిన్ భాషాలను విచారణకు రావాలని ఎన్నికల కమిషన్ నుండి ఆదేశాలు రావడంతో ముగ్గురు కలెక్టర్లు కూడా కొండగట్టు జెఎన్టీయూకు చేరుకున్నారు. వీరితో పాటు అడిషనల్ కలెక్టర్లుగా పని చేసిన అరుణ శ్రీ, రాజేశం, ఎన్నికల రిటర్నింగ్ అధికారి భిక్షపతిలు కూడా ఈసీఐ అధికారుల బృందం ముందు విచారణకు హాజరయ్యారు. వీరితో పాటు మరికొంత మందిని కూడా త్రిమేన్ కమిటీ ఆరాతీసే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. స్ట్రాంగ్ రూం కీస్ మిస్సింగ్ వ్యవహారంపై సమగ్ర నివేదిక తయారు చేసి ఈసీఐ ద్వారా హై కోర్టుకు సమర్పించనున్నారు.
నో ఎంట్రీ…
అయితే ఈసీఐ నుండి కొండగట్టు జెఎన్టీయూ వద్దకు చేరుకున్న అధికారుల బృందం వద్దకు జిల్లా అధికార యంత్రాంగం తప్ప వేరే వారికి నో ఎంట్రీ బోర్డు పెట్టేశారు. ధర్మపురి కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఈసీఐ అధికారుల బృందానికి వినతి పత్రం అందిస్తామని చెప్పినా అనుమతించలేదు. అలాగే మీడియా ప్రతినిధులు కూడా జెఎన్టీయూ మెయిన్ గేటుకు 500 మీటర్ల దూరంలో ఉండాలని జిల్లా అధికారులు స్పష్టం చేశారు. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠతతో మీడియా ప్రతినిధులు జెఎన్టీయూ ముందు ఎదురు చూస్తున్నారు.
Disha Dasha
1884 posts
Prev Post
Next Post