ఎస్డీఎస్ఏ… ఎన్డీఎస్ఏ…

కాళేశ్వరం బ్యారేజీల సందర్శన

దిశ దశ, భూపాలపల్లి:

కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీలను పరిశీలించేందుకు డ్యాం సేఫ్టీ అథారిటీ నిపుణులు రంగంలోకి దిగారు. మంగళవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని అన్నారం, మేడిగడ్డ, పెద్దపల్లి జిల్లా సుందిళ్ల బ్యారేజీలను స్టేట్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) టీమ్ సందర్శించింది. ఇరిగేషన్ అధికారులను బ్యారేజీల నిర్మాణాల తీరు తెన్నులను అడిగి తెలుసుకున్నారు. బ్యారేజీల్లో ఇప్పటి వరకు ఎక్కడెక్కడ లీకేజీలు జరిగాయి..? బుంగలు ఎక్కడ పడ్డాయి వీటిని బాగు చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు..? నిర్మాణం తీరు తెన్నులపై వివరాలు అడిగినట్టుగా తెలుస్తోంది. మేడిగడ్డలోని కుంగుబాటుకు గురైన 7వ బ్లాకుకు సంబంధించిన పూర్తి వివరాలను, ఇతర పిల్లర్లు, గేట్లకు సంబంధించిన అంశాల గురించి అడిగి తెలుసుకున్నట్టుగా తెలుస్తోంది. తాజా పరిస్థితులపై స్టేట్ డ్యాం సేఫ్టీ అథారిటీ టీమ్ మరో నివేదిక తయారు చేయనున్నట్టుగా సమాచారం. మూడు బ్యారేజీలు కూడా ఒకే డిజైన్ తో నిర్మించారని మూడింటిని కూడా క్షుణ్నంగా పరిశీలించాల్సి ఉందని నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ టీమ్ ఇప్పటికే నిర్దారించిన సంగతి తెలిసిందే. మూడు బ్యారేజీలను కూడా సందర్శించి మరిన్ని లోతుపాతులను తెలుసుకునేందుకు నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ టీమ్ మరోసారి క్షేత్ర స్థాయి పరిశీలన చేయనున్న నేపథ్యంలోనే ఎస్డీఎస్ఏ టీమ్ మంగళవారం సందర్శించినట్టుగా తెలుస్తోంది. తాజా పరిస్థితులను అధ్యయనం చేసి తయారు చేయనున్న నివేదికన ఎన్డీఏస్ఏ నిపుణులకు అందించనున్నట్టు సమాచారం. అయితే అధికార వర్గాలు మాత్రం ఈ పర్యటనలపై క్లారిటీ ఇవ్వడం లేదు. తాజాగా అన్నారంలోని 39వ గేటుకు దిగువన మరో బుంగ పడినట్టుగా తెలుస్తోంది. రెండు రోజుల క్రితమే ఈ బుంగ ఏర్పడినట్టుగా సమాచారం.

You cannot copy content of this page