చల్లగరిగ గ్రామానికి అంతర్జాతీయ ఖ్యాతి
తెలంగాణలోని అన్ని కుగ్రామల వలెనే ఆదో చిన్న పల్లెటూరు… ఆ ఊర్లో పుట్టిన బిడ్డ నేడు అంతర్జాతీయ ఖ్యాతిని గడించి అత్యంత అరుదైన పురస్కారాన్ని అందుకున్నాడు. ఉగ్గు పాలు తాగుతూ ఒగ్గు కథలు వింటూ… చిందు భాగవతాలు చూస్తూ తెలుగు భాషలోని మధురామృతాన్ని తన హృదయంలో పదిల పర్చుకుని… నాటకాల్లోని అక్షరాల పొందికను… ఒడిసి పట్టుకుని ఎదిగిన ఆ బిడ్డ నేడు అంతర్జాతీయ ఆస్కార్ పురస్కారాన్ని అందుకుని తెలంగాణా కీర్తిని దశ దిశలా చాటాడు.
చంద్రబోస్ ప్రస్థానమిది…
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చల్లగరిగ గ్రామంలో పుట్టి పెరిగాడు. ప్రభుత్వ టీచర్ నర్సయ్య సారు, మధునమ్మల నాలుగో సంతానం సుభాష్ చంద్రబోస్. విప్లవోద్యమాలు అట్టుకుడుతున్న సమయంలో చల్లగరిగ గ్రామంలోనే ఎదిగిన చంద్రబోస్ మొదట డిప్లోమా పూర్తి చేసి ఆ తరువాత ఇంజనీరింగ్ పట్ట భద్రుడయ్యాడు. సాంకేతికతను అందిపుచ్చుకుని డిగ్రీ చేత బట్టుకున్న తన బిడ్డ జీవన యానం ఓ వైపు సాగుతుందనుకున్న ఆ తల్లిదండ్రులు ఊహించని విధంగా సినీ రంగం వైపు అడుగులు వేశాడు. ఓ వైపున చదువు మరో వైపున మదిలో నిండుకున్న భావాలను పాటలుగా మారుస్తూ ముందుకు సాగాడు. ఓ వైపున కలం నుండి జాలు వారిన పాటలను సినీ పరిశ్రమకు అందిస్తూనే మరో వైపున ప్లే బ్యాక్ సింగర్ గా కూడా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు చంద్రబోస్.
తాజ్ మహల్…
తనలోని రచనలను వెండి తెరకు పరిచయం చేయడానికి తొలి అవకాశం వచ్చింది మాత్రం తాజ్ మహల్ చిత్రంతోనే. మంచు కొండల్లో చంద్రమా అనే పాట రాయడం… మూవీ రిలీజ్ అయిన తరువాత ఈ పాట అత్యంత ప్రజాదరణ పొందడంతో చంద్రబోస్ వెనక్కి తిరిగి చూసే పరిస్థితి రాలేదు. ఇంజనీరింగ్ ఫైనల్ ఈయర్ చదువుతుండగా అందివచ్చిన ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని సినీ రంగం వైపే తన పయనమని నిర్ణయించుకున్నాడు ఇందుక కోసం తన తల్లిదండ్రులను కూడా మెప్పించి ఒప్పించిన చంద్రబోస్ మొత్తం 800లకు పైగా సినిమాల్లో 3300ల వరకూ పాటలు రచించారు. ఇప్పటికే ఎన్నో అవార్డులను అందుకున్న చంద్రబోస్ ట్రిపుల్ ఆర్ మూవీలోని నాటు నాటు పాట రచించి ప్రపంచంలోనే అత్యున్నతమైన అస్కార్ ను ముద్దాడాడు. తెలంగాణాలోని ఓ పల్లెటూరిలో పుట్టిన బిడ్డ లాస్ ఎంజిల్స్ లో పురస్కారం అందుకుంటుంటే పుట్టిన ఊరు పులకరించిపోయింది.