శతాబ్దంన్నర కాలం నాటి ఆలయం… రెండు దశాబ్దాలుగా పూజకు నోచుకోని వైనం

ఆయన మరణం తరువాత భయం భయం…

దిశ దశ, చొప్పదండి:

భక్తులకు కొంగు బంగారమై నిలిచే వేణుగోపాల స్వామి… దుష్ట శక్తులను సంహరించిన కాళికా మాత… భూత ప్రేత పిశాచాలను హడలెత్తించే పవన సుతుడు ఉన్న ఆ ఆలయం వైపు కన్నెత్తి చూడడానికే భయపడుతున్నారు స్థానికులు. ఒకప్పుడు తెలంగాణాతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన భక్తుల రాకపోకలతో కళకళలాడినా ఇప్పుడు మాత్రం ఒక్కరు కూడా అటుగా వెల్లడం లేదు. రెండు దశాబ్దాలుగా పూజకు పనికి రాని దేవతా మూర్తులు మిగిలిపోయారక్కడ… ఎందుకిలా జరిగింది..? వరాలిచ్చే దేవుళ్లు ఉన్న ఆ గుడిలో పూజలు చేసేందుకు ఎందుకు జంకుతున్నారు..? మిస్టరీగా మారిన తీరు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

చొప్పదండి మండలం…

కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం ఆర్నకొండ గ్రామంలో దాదాపు 200 ఏళ్ల క్రితమే వెలిసిన వేణుగోపాల స్వామి ఆలయం ఆదరణకు నోచుకోకుండా పోయింది. కాళికా మాత, ఆంజనేయ స్వామి విగ్రహాలు కూడా ఈ ఆలయ ఆవరణలో ఉన్నప్పటికీ అక్కడ పూజలు చేసేందుకు పూజారులు కూడా సాహసించడం లేదు. రెండు దశాబ్దాలుగా పూజలకు నోచుకోని విగ్రహాలు అర్చకుల ఆరాధాన కోసం… భక్తుల రాక కోసం ఎదరు చూస్తున్నాయి.

హన్మంతు అయ్యగారు…

ఆర్నకొండ గ్రామంలోని ఈ ఆలయ ఆలనా పాలనా అంతా కూడా హన్మంతు పూజారే పర్యవేక్షించే వారు. నిత్య పూజలు చేయడంతో పాటు ఇక్కడకు వచ్చే భక్తులను ఆదరించే వారు. మానసిక సమస్యలతో పాటు ఇతరాత్ర రుగ్మతల బారిన పడిన వారు పెద్ద సంఖ్యలో వేణుగోపాలుడి సన్నిధికి చేరుకునే వారు. శక్తి స్వరూపిని కాళికా మాత అనుగ్రహం ఆయనకు ఉండడం వల్లే ఆయన వద్దకు వచ్చిన బాధితులు సాధారణ మనుషుల్లా మారిపోయేవారని గ్రామస్థులు చెప్తున్నారు. తెలంగాణ, ఏపీతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన భక్తులు కూడా పెద్ద సంఖ్యలో వచ్చి హన్మంతు పూజారి హస్తవాసి కోసం పరితపించే వారు. ఆయన ఆశీస్సుల కోసం గంటల తరబడి భక్తులు క్యూలో నిలబడి మరి తమ సమస్యలను విన్నవించుకునే వారు. వారిని బాగు చేసేందుకు హన్మంతు పూజారి తనవంతు ప్రయత్నం చేసేవారు. దీంతో ఇక్కడకు వచ్చే భక్తులు ఇచ్చే వనరులతో ఆలయాన్ని అభివృద్ది చేయడంపై ప్రత్యేక దృష్టి సారించే వారని గ్రామస్థులు వివరిస్తున్నారు.

ఆయన తరువాత…

దాదాపు ఇరవై ఏళ్ల క్రితం అనారోగ్యం బారిన పడిన హన్మంతు అయ్యగారు మృత్యువు ఒడిలోకి చేరిపోయారు. దీంతో అప్పటి నుండి ఈ ఆలయం వైపు కన్నెత్తి చూసే వారు లేకుండా పోయారు. కాళికా మాత కూడా ఇక్కడ వెలిసి ఉండడంతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన పూజారులను ఇక్కడకు తీసుకొచ్చేందుకు ఎవరూ సాహసించలేదు. అయితే ఈ ఆలయం వద్ద ఏదో అదృశ్య శక్తి ఉందన్న భయం గ్రామస్థులను వెంటాడుతోంది. అప్పటి నుండి స్థానికులు ఈ గుడి వైపు కన్నెత్తి చూడడానికి కూడా భయపడిపోతున్నారు. కొంతకాలంగా తీగలగుట్టపల్లికి చెందిన మరో పూజారి ఈ ఆలయం వద్దకు అడపాదడపా వచ్చి ధూప దీప నైవైద్యాలు అందించి వెల్లిపోతున్నారు. ఆయన వచ్చినప్పుడు మాత్రమే ఈ ఆలయంలో కొలువైన విగ్రహాలు పూజకు నోచుకుంటున్నాయని ఆర్నకొండ వాసులు చెప్తున్నారు.

మిస్టరీ టెంపుల్…

అయితే వేణుగోపాల స్వామి ఆలయంలో ఏ అదృశ్య శక్తి ఉందో ఎవరూ చూడలేదు కానీ… పుకార్లు శికార్లు చేయడంతో గుడిలో గంటలు మూగబోయాయి. కర్పూర హరతులు కరువయ్యాయి. నివేదనలు లేవు… భక్తుల రాకపోకలు అంతకన్నా లేకుండాపోయాయి. హన్మంతు పూజారి ఉన్నప్పుడు శోభాయమానంగా వెలుగొందిన ఈ ఆలయం ఆయన మరణం తరువాత భక్తుల రాకపోకలు లేక వెలవెలబోయింది. బోసిపోయిన ఈ ఆలయంలోని విగ్రహాలు నిత్య కైంకర్యాల కోసం ఎదురు చూస్తుంటే… స్థానికులు మాత్రం అదృశ్య శక్తి ఉందన్న అనుమానపు కోరల్లో చిక్కుకుని ఊగిసలాడుతున్నారు. భక్తలు కోరిన వరాలిచ్చే దేవతా మూర్తులు ఉన్న చోట అదృశ్య శక్తులు ఉండడం సాధ్యమా అన్న విషయాన్ని మాత్రం విస్మరిస్తున్నారు. ఎంతో ఘనకీర్తిని మూటగట్టుకున్న ఈ ఆలయంలో నిత్య పూజలు జరిపించేందుకు చొరవ తీసుకోవాలన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

You cannot copy content of this page