దిశ దశ, వరంగల్:
రక్త సంబంధం పెనవేసుకుని పుట్టిన బిడ్డలు తమ అప్యాయతను చాటుకునేందుకు ఏ మాత్రం వెనకాడరు. ఏటా అంగరంగ వైభవంగా జరుపుకునే శ్రావణ పౌర్ణమి రోజున అయితే తమలోని ప్రేమను పంచేందుకు ఆడబిడ్డలు ఇచ్చే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. తోడబుట్టిన వారు బావుండాలని ఆకాంక్షిస్తూ… వారి ఆశీస్సులు తమపై అన్ని వేళల్లో ఉండాలని ఆశిస్తూ రాఖీలు కట్టేందుకు పుట్టినింటికి చేరుకునేందుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు ఆడపడచులు. అయితే కొంతమంది తమ సోదరులకు రాఖీలు కట్టేందుకు చూపించిన చొరవ నెటిజన్లను అబ్బురపరుస్తోంది. ఆరు పదుల వయసు దాటిన ఓ అవ్వ 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన సోదరుడికి రాఖీ కట్టేందుకు కాలినడకన బయలుదేరింది. మరో వైపున వరంగల్ ఉమ్మడి జిల్లాలోనే మరో అరుదైన ఘటన చోటు చేసుకుంది. తన సోదరుడు ఆర్టీసీ కండక్టర్ కావడంతో విధులకు పరిమితం కావల్సి వచ్చింది. దీంతో ఆమన సోదరి మార్గ మధ్యలోనే బస్సు ఆపి మరీ సొదురునికి రాఖీ కట్టి నోరు తీపి చేసింది. భూపాలపల్లి ఆర్టీసీ డిపోలో కండక్టర్ గా పనిచేస్తున్న పోకల కృష్ణమూర్తి విధుల్లో భాగంగా సోమవారం హన్మకొండ నుండి మంచిర్యాలకు వెల్తున్నారు. శాయంపేట మండలం కోడెపాకలో నివాసం ఉంటున్న అతని సోదరి ముక్కా సరస్వతి తన సోదరుడికి రాఖీ కట్టేందుకు తీసుకున్న చొరవ ప్రయాణీకులను ఆశ్చర్యపర్చింది. పరకాల సమీపంలోని కోడెపాక క్రాసింగ్ వద్దకు చేరుకున్న సరస్వతి సోదరుడు కృష్ణమూర్తి డ్యూటీ చేస్తున్న బస్సు కోసం ఎదురు చూసి అక్కడే బస్సును ఆపి రాఖీ కట్టింది. తన సోదరుడు విధుల్లో ఖచ్చితంగా ఉండాల్సిన పరిస్థితులను అర్థం చేసుకున్న సరస్వతి మార్గమధ్యలోనే బస్సు ఆపి రాఖీ కట్టారు. ఈ విషయాన్ని గమనించిన ప్రయాణీకులు సోదరి, సోదరుల మధ్య ప్రేమకు తార్కాణంగా ఈ ఘటన నిలిచిందని వ్యాఖ్యానించారు. ఏది ఏమైనా సోదర, సోదరిమణుల మధ్య నెలకొన్న అనురాగానికి వేదికగా నిలిచే రాఖీ పౌర్ణమి ఈ సారి ఎన్నెన్నో సరికొత్త అనుభూతులను అందించింది.
ఆడపడచులు అనురాగాన్ని పంచే తీరుకు సంబంధించిన వీడియో కోసం ఈ కింది లింక్ పై క్లిక్ చేయండి…