టీఎస్పీఎస్సీ బోర్డు సభ్యులకు నోటీసులు
దిశ దశ, హైదరాబాద్:
గ్రూప్స్ పరీక్షా పత్రాల లీకేజీ వ్యవహారంలో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసు విచారణ జరుపుతున్న సిట్ మరో అడుగు ముందుకేసింది. తాజాగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) సభ్యులకు నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు కమిషన్ ఉద్యోగులు ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డిల చుట్టే తిరిగగా ఇప్పుడు సభ్యుల భాగస్యామ్యంపై కూడా సిట్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్టుగా స్సష్టమవుతోంది. ఏడుగురు సభ్యులకు ఈ నోటీసులు ఇచ్చినట్టుగా వెలుగులోకి రావడంతో కేసు ఎటువైపు మలుపు తిరుగుతుందోనన్న చర్చ మొదలైంది. అయితే సిట్ వీరి నుండి ప్రశ్నా పత్రాల లీకేజీ తీరుతో పాటు ఎవరెవరి భాగస్వామ్యం ఉందో వెలకితీయనున్నట్టు సమాచారం. సిట్ విచారణలో వివిధ కోణాల్లో వీరిని కూడా ప్రశ్నించే అవకాశాలు ఉంటాయని దీంతో మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.