వేస్ట్ వాటర్ బాటిల్స్ తో బస్ షెల్టర్ నిర్మాణం
జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన గ్రామం
దిశ దశ, హన్మకొండ:
అన్ని పంచాయితీల్లాగే అదో చిన్న గ్రామ పంచాయితి. హుజురాబాద్, పరకాల ప్రధాన రహాదారిపై ఉన్న ఈ పల్లె గురించి నిన్న మొన్నటి వరకు స్థానికేతరలు అంతగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడా గ్రామం జాతీయ స్థాయిలో హైలెట్ గా నిలిచింది. ఓ ఐడియా జీవితాన్నే కాదు దేశాన్నే మార్చడానికి ఈ ఊరు వేదికగా మారింది. వినడానికి వింతగా ఉన్నా అక్షరాల ఇది నిజం. ఈ గ్రామం గురించి నేడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆరా తీస్తున్నాయంటే అక్కడ జరిగిన ఇన్నోవేషన్ ప్రోగ్రాం ఏంటో తెలిసిన ప్రతి ఒక్కరు గుడ్ ఐడియా అని అనక మానరు. ఇంతకీ ఆ ఊరేది..? ఆ ఊర్లో చేపట్టిన వినూత్న కార్యక్రమం ఏంటంటే..?
ఉప్పులల్లి విలేజ్ స్పెషాలిటీ…
హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పులపల్లి గ్రామంలో నిర్మించిన బస్ షెల్టర్ హైలెట్ గా నిలుస్తోంది. గ్రామంలోని సెగ్రిగేషన్ షెడ్డుకు వచ్చి చేరుతున్న ప్లాస్టిక్ బాటిళ్లు పంచాయితీని పరేషన్ చేస్తున్నాయి. అప్పటికే గ్రామాన్ని నో ప్లాస్టిక్ విలేజ్ గా తీర్చిదిద్దాలని సంకల్పించి అన్ని వర్గాల వారిలో అవగాహన కల్పించారు. అయితే పాలథిన్ కవర్ల వాడకాన్ని తగ్గించగలిగారు కానీ వాటర్ బాటిల్స్ ఓ సమస్యగా మారిపోయాయి. నిత్యం పంచాయితీ సిబ్బంది సేకరించిన వాటర్ బాటిళ్లు సెగ్రిగేషన్ షెడ్డుకు వచ్చి చేరుతుండడంతో పంచాయితీ సర్పంచ్ బొల్లపల్లి ఉమాదేవి వీటిని తగ్గించడం ఎలా అన్న ఆలోచనలో పడ్డారు. ఇదే అంశాన్ని ఎంపీడీఓ పల్లవితో సర్పంచ్ చర్చించినప్పుడు వచ్చిన ఆలోచనను కార్యరూపంలో పెట్టడంతో జాతీయ స్థాయిలో ఈ గ్రామానికి ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఇన్నోవేటివ్ ఆలోచనతో మండలంలో ఏదో ఒక వినూత్న కార్యక్రమం చేపట్టాలన్న భావనతో ఉన్న ఎంపీడీఓ పల్లవి వేస్ట్ వాటర్ బాటిల్స్ ను ఉపయోగించి బష్ షెల్టర్ సిద్దం చేస్తే ఎలా ఉంటుందన్న ప్రతిపాదన తీసుకొచ్చారు. అంతే ఇందుకు తగినట్టుగా ఐరన్ ఫ్రేం తయారు చేయించి ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ను వాటి మధ్య పకడ్భందీగా ఏర్పాటు చేయించి బస్ షెల్టర్ సిద్దం చేశారు. అంతేకాకుండా వృధాగా పడేసిన వాహనాల టైర్లను కూడా సేకరించి బస్ షెల్టర్ బోర్డుకు ఉపయోగించి న్యూ లుక్ తీసుకొచ్చారు. ఈ బస్ షెల్టర్ కోసం సెగ్రిగేషన్ షెడ్డ్ వద్దకు చేరిన బాటిల్స్ సరిపోయే పరిస్థితి లేదని కొద్ది రోజుల పాటు మరిన్ని కలెక్ట్ చేసుకుని మరీ నిర్మించారు. సుమారు 1200 బాటిల్స్ తో షెల్టర్ నిర్మించగా ఇందు కోసం ఖర్చు రూ. 10 వేల లోపునే కావడం విశేషం.
ఒక ఆలోచన ఎన్నో ప్రయోజనాలు…
అయితే ఎంపీడీఓ పల్లవికి వచ్చిన ఈ ఆలోచన వల్ల ఎన్నో ప్రయోజనాలు కలిగాయన్నది వాస్తవం. గ్రామంలో బస్ షెల్టర్ నిర్మాణం ఒక్కటే జరగడం కాదు… పరోక్షంగా పర్యావరణ పరిరక్షణకు కూడా ఈ ఆలోచన ఎంతో దోహదపడనుంది. ప్రపంచాన్ని ప్రస్తుతం భయం గుప్పిటకు చేర్చుతున్న అత్యంత ప్రమాదకరమైనది ఏమైనా ఉందంటే అది ప్లాస్టిక్ ఒక్కటేనని చెప్పాలి. ప్రపంచ పర్యవరణ సమతుల్యతకు సవాల్ విసురుతున్న ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలని అన్ని దేశాలు ప్రత్యేక చర్యలు తీసుకోవల్సిన ఆవశ్యకత ఏర్పడింది. మెటల్ కానీ, పేపర్ కానీ భూమిపై పడేసినప్పడు అవి భూమి లోపలకు చేరినప్పుడు కొంతకాలానికి అంతర్థానం అవుతాయి. భూమి వేడికి కరిగిపోని మెటల్ ఉండిపోయినా ఎలాంటి ఇబ్బందులు మాత్రం ఎదురు కావు. కానీ ప్లాస్టిక్ భూతం మాత్రం వందేళ్లయినా భూమిలో కరిగిపోకుండా ఉండి పర్యవరణ సమస్యలను తయారు చేస్తున్నాయి. భవిష్యత్తులో మానవాళి మనుగడకు కూడా సవాల్ విసిరే ప్రమాదం కొని తెచ్చుకుంటున్న పరిస్థితి ప్లాస్టిక్ వినియోగంతో ఏర్పడింది. అయితే ఉప్పులపల్లి గ్రామంలో వినూత్నంగా ఆలోచించి నిర్మించిన బష్ షెల్టర్ వల్ల ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ భూమికి భారం కాకుండా ప్రయాణీకులకు నీడనిచ్చేవిగా మారిపోయాయి. కేవలం రూ. 10 వేల లోపునే వెచ్చించి నిర్మించిన ఈ బస్ షెల్టర్ వల్ల ప్రభుత్వానికి ఆర్థిక భారం కూడా గణనీయంగా తగ్గిపోయింది.
భవిష్యత్తులో ఇలా…
అయితే మూడు నాలుగు రోజుల క్రితమే నిర్మించిన ఈ బస్ షెల్టర్ భవిష్యత్తులో వాటర్ బాటిల్స్ అసలే కనిపించవు. కొన్ని వాటర్ బాటిల్స్ లో నాటిన మనీ ప్లాంట్ ఎదిగిన తరువాత తీగలు పర్చుకుని పోనున్నాయి. దీంతో బస్ షెల్టర్ సహజ సిద్దమైన పచ్చదనాన్ని పరుచుకుని అక్కడకు వచ్చే వారికి అహ్లదాన్ని అందించనుంది. మనీ ప్లాంట్ మొక్కలు పెరిగినా కొద్ది తీగలు లతలా అల్లుకుపోతుంటే క్రమక్రమంగా బస్ షెల్టర్ కోసం వినియోగించిన వాటర్ బాటిల్స్ అసలే కనిపించవు. అయితే ఈ బస్ షెల్టర్ గురించి పై అధికారులకు సమాచారం ఇచ్చిన వెంటనే రాష్ట్ర స్థాయి అధికారులు పూర్తి నివేదికలు తెప్పించుకుని స్టడీ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి కూడా ఈ సమాచారం చేరవేయడంతో ఈ బస్ షెల్టర్ గురించి ఢిల్లీ నుండి అధికారులు కూడా వివరాలు సేకరించారు. రూ. 10 వేల లోపు వెచ్చించి నిర్మించిన బస్ షెల్టర్ ఈ గ్రామాన్ని నేషనల్ లెవల్లో గుర్తింపు తీసుకరావడం గమనార్హం.
మోడల్ గా ఉండాలన్న ఆలోచనే: ఎంపీడీఓ పల్లవి.
ఇతర ప్రాంతాల్లో చేపట్టిన వినూతన్న కార్యక్రమాల గురించి మాకు ఎప్పటికప్పడు ఉన్నతాధికారులు తెలుపుతుంటారు. కొత్త కొత్త ఆలోచనలతో చేపట్టిన చర్యల గురించి సవివరంగా మాకు అందిస్తుంటారు. అలాగే దేశ వ్యాప్తంగా చూసుకుంటే చాలా విషయాల్లో కేరళను రోల్ మోడల్ గా చూస్తుంటాం. అక్షరాస్యతతో పాటు పలు అంశాల్లో కేరళ ఆదర్శంగా ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. అలాంటి ఆదర్శనీయమైన చర్యలు నేను పని చేస్తున్న చోట కూడా ఉండే బావుంటుంది కదా అన్నదే ఆలోచన. వైవిద్యంగా ఆలోచించినప్పుడు వినూత్న చర్యలకు వేదికగా నేను విధులు నిర్వర్తిస్తున్న ప్రాంతం నిలిస్తే నాకెంతో సంతోషంగా ఉంటుంది కదా. ఆ కారణంగానే ఆలోచనల సంఘర్షణల నుండి పుట్టుకొచ్చిందే వేస్ట్ వాటర్ బాటిల్స్ బస్ షెల్టర్ నిర్మాణం. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రతిఫలం అందించడంతో పాటు వేస్ట్ వాటర్ బాటిల్స్ సమస్యను కూడా అదిగమించానన్న సంతృప్తి కలిగింది. నా ఆలోచనలకు తగ్గట్టుగా ఉప్పులపల్లి సర్పంచ్ ఉమాదేవి, పంచాయితీ సిబ్బంది పనిచేయడం వల్లే సత్ఫలితాన్ని సాధించాం. జాతీయ స్థాయిలో గుర్తింపు లభించినందుకు నాకిప్పుడు ఎంతో సంతోషంగా ఉంది. ఇలాంటి వినూత్న ఆలోచనలతో మరిన్ని కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలన్న ఆశయంతో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాను.
ఆ బాటిళ్లే మా ఆలోచనలకు కారణం: సర్పంచ్ బొల్లపల్లి ఉమాదేవి.
రోజూ పంచాయితీ పరిధిలో సేకరిస్తున్న చెత్త అంతా కూడా సెగ్రిగేషన్ షెడ్డుకు చేరుకుంటోంది. ఇందులో వాటర్ బాటిల్స్ ను ఏం చేయాలో అర్థం కాకుండా పోయింది. రోజు రోజుకు వాటర్ బాటిళ్ల సంఖ్య పెరిగిపోతుండడంతో ఎంపీడీఓ పల్లవి దృష్టికి ఈ విషయం తీసుకెళ్లాం. ఆమె ఇచ్చిన సలహాతో బస్ షెల్టర్ నిర్మించాం. 1200 బాటిల్స్ తో బస్ షెల్టర్ నిర్మాణం పూర్తి కాగా ప్రయాణీకులకు నీడనిచ్చే విధంగా తక్కువ ఖర్చుతో తయారు చేయడం ఆనందంగా ఉంది.