అటు అన్నలు… ఇటు పోలీసులు
దిశ దశ, దండకారణ్యం:
బ్రిటిష్ పాలకుల నుండి విముక్తి కోసం పోరాడిన ఎందరో యోధుల గురించి చరిత్ర పదిలమై ఉంది. కానీ కేవలం దండకారణ్య అటవీ ప్రాంతానికి పరిమితమైన ఆ యోధుడి గురించి చాలా మందికి తెలియదు. అటు అన్నలు… ఇటు పోలీసులు ఆయన్ని స్మరించుకుంటుంటారు. ప్రపంచ ఆదివాసి చరిత్రలో ఒకటిగా నిలిచే ఆ పోరాట చరిత్ర గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. ఆ పోరాటాన్ని ముందుండి నడిపించిన ఆ యోధుడిని మాత్రం అక్కడి ఆది వాసీ బిడ్డలు నేటికి పూజిస్తూనే ఉంటారు. చారిత్రాత్మక నేపథ్యం ఉన్నదే భూంకాల్ పోరాటం. 1910 ఫిబ్రవరి 10న భ్రిటీష్ పాలకులకు వ్యతిరేకంగా జరిగిన ఈ పోరాటం ఒక దశలో ఆధునిక ఆయుధాలకు కూడా సవాల్ విసిరిందని చెప్పవచ్చు. అభూజామడ్ అటవీ ప్రాంతంలో విస్తరించిన కీకారణ్యాల్లో అత్యంత విలువైన ఖనిజ సంపద ఉంది. దవళేశ్వరం పూర్తయిన తరువాత ఎగువ గోదావరి ప్రాంతంలో సంచరించిన బ్రిటీష్ అధికారులు అభూజామడ్ పై దృష్టి సారించారు. గోదావరి, ప్రాణహిత, ఇంద్రావతి నది తీరాల్లో సంచరిస్తూ ఇక్కడి సహజ వనరులపై కన్నేసిన పాలకులు ఆయా ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకొచ్చుకున్నారు. ఆ ప్రాంతాల్లో పరిపాలన కొనసాగిస్తున్న స్థానిక రాజులను హెచ్చరించి మరీ తమకు అనుకూలంగా మల్చుకున్నారు. ఇందులో బస్తర్ అటవీ ప్రాంతం కూడా ఒకటిగా చెప్పవచ్చు. రాజు రుద్ర ప్రతాప్ పరిపాలన కొనసాగుతున్న ఈ ప్రాంతంలో బ్రిటిష్ పాలకుల ఆదేశాలను పాటించాల్సి వచ్చింది నాడు. దీంతో రాజు రుద్ర ప్రతాప్ అక్కడి ప్రజలపై భారాలు మోపుతూ ఆదివాసీలపై ఆదిపత్యం చెలాయించాల్సి వచ్చింది. ఈ క్రమంలో అడవులు, కొండల్లో సహజీవనం చేస్తున్న మూలవాసి బిడ్డలు తిరుగు బాటు బావుటా ఎగురవేశారు. ఎదురు తిరిగిన వీరిపై పట్టు బిగించాలన్న లక్ష్యంతో బ్రిటిష్ పాలకులు ఏకంగా 10 వేల మంది సైన్యాన్ని యుద్దానికి పంపించారు. 1910 ఫిబ్రవరి 10న ఆదివాసీ బిడ్డలకు నాయకత్వం వహించిన భగ్ ధృవ ఆ సైన్యానికి వ్యతిరకంగా విరోచిత పోరాటం చేశారు. ట్రెడిషనల్ ఆర్మ్స్ (సాంప్రాదాయ ఆయుధాల)తో బ్రిటిష్ సైన్యాన్ని ముప్పు తిప్పలు పెట్టారు అభూజామడ్ ప్రాంత ఆదివాసీలు. తమ ప్రాంతంలోకి శత్రు సైన్యం చొరబడకుండా విల్లులు, బరిశెలతో పాటు ఇతరాత్ర ఆయుధాలతో ఎదురు దాడికి దిగారు. ఆధునిక ఆయుధాలతో ఆదివాసీలను భయాందోళనలకు గురి చేయాలనకున్న బ్రిటీష్ పాలకుల అంచనాలు తలకిందులు అయ్యాయి భగ్ ధృవ కారణంగా. దీంతో 35 ఏళ్ల వయసున్న ఆయన చేసిన ఈ సాహసంతో గుండాధూర్ అని బిరుదు ఇచ్చారు బ్రిటీష్ పాలకులు. కీకారణ్యాల్లో జీవనం సాగించే మూలవాసి బిడ్డలు కూడా ఆఈ స్థాయిలో ఎదురు దాడికి పూనుకుంటారని ఊహించలేదని, గుండాధూర్ గురించి అప్పటి అధికారులు తమ డైరీల్లో ఆయన గురించి ప్రత్యేకంగా రాసుకున్నారంటే ఆయన విరోచిత పోరాటం ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు. ప్రపంచ ఆదివాసీల పోరాటాల చరిత్రలో ఒకటిగా నిలిచిన బస్తర్ ఆదివాసీల తిరుగుబాటు కోసం ‘భూంకాల్’ పోరాటం చేశారు. అంతర్జాతీయ స్థాయిలో కూడా బస్తర్ అడవి బిడ్డల సాహసం గురించి కీర్తించిన చరిత్ర. వీరందరికి నాయకత్వం వహించిన గుండాధూర్ ను నేటికి ఆదివాసీలు స్మరించుకుంటారు. ఆయన చేసిన సాహసంపై మూలవాసీలు జానపద బాణిలో పాటలు కూడా పాడుకుంటూ ఆయన ఆదర్శాన్ని భావితరాలకు అందిస్తున్నారు. నేటి తరానికి తెలిసిన చరిత్ర పుటల్లో నామ మాత్రపు ప్రాధాన్యత కూడా లేని గుండాధూర్ పోరాట స్పూర్తిని ఇటీవల కాలంలో కొనియాడే సంస్కృతి ప్రారంభం అయింది.
28 ఏళ్ళుగా…
భూంకాల్ పోరాట స్పూర్తితో పీపుల్స్ వార్ నక్సల్స్ ఉత్తర తెలంగాణ అటవీ ప్రాంతాల నుండి దండకారణ్య అటవీ ప్రాంతంలో పట్టు బిగించారు. అక్కడి పాలకులు ఎన్నికలప్పుడు మాత్రమే సాయుధులగా వచ్చి ఓట్లు వేయించుకుని పోయే సంస్కృతికే ఇంతకాలం ప్రాధాన్యత ఇచ్చారు. దీంతో సాయుధాలతో వచ్చే వారంతా కూడా సర్కార్ కు చెందిన ప్రతినిధులు అన్న భావన అక్కడి ఆదివాసీల్లో బలంగా నాటుకపోయింది. భూంకాల్ పోరాటాన్ని ఆసరగా చేసుకున్న మావోయిస్టులు 28 ఏళ్లుగా అభూజామఢ్ అటవీ ప్రాంతంలో కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. అక్కడ సమాంతర ప్రభుత్వాన్ని కూడా నిర్వహిస్తున్న మావోయిస్టు పార్టీ ఓ సామ్రాజ్యాన్నే స్థాపించుకుంది. ఏటా ఫిబ్రవరి 10న భూంకాల్ మిలిషీయా పోరాట స్పూర్తిని నేటి తరానికి అందించేందుకు ప్రత్యేక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తోంది క్రాంతి కారీ జనతన్ సర్కార్ ప్రభుత్వం.
ప్రభుత్వం…
అయితే గుంఢాధర్ తో పాటు బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా ఆదివాసీలను ఊసిగొల్పిన నాయకులపై కన్నెర్ర జేశారు. వారిని గుర్తించి జగ్దల్ పూర్ గోల్ బజార్ చింతచెట్టు వద్ద మరణ శిక్ష విధించారు. చత్తీస్ ఘడ్ ప్రభుత్వం కూడా జగ్దల్ పూర్ లో స్మృతి వనాన్ని ఏర్పాటు చేసి ఆనాటి పోరాట యోధులను స్మరించుకునే ఆనవాయితీకి శ్రీకారం చుట్టింది. ఆనాటి పోరాటానికి నాయకత్వం వహించిన గుండాధూర్ పేరిట ఆర్చరి పోటీల్లో అవార్డులు కూడా ఇస్తోంది చత్తీస్ గడ్ ప్రభుత్వం. అలాగే జగ్దల్ పూర్ లో ప్రత్యేకంగా ప్రతి ఫిబ్రవరి 10న గుండాధూర్ స్మారకంగా ప్రత్యక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. అమర్ షహీద్ గుండాధూర్ పోరాట జ్ఞాపకార్థం భూమ్‌కాల్ దినోత్సవం సందర్భంగా మావోయిస్టలు చేతిలో మరణించినవారిని స్మరించుకునే కార్యక్రమం నిర్వహిస్తున్నారు. శనివారం కూడా బస్తర్ ప్రాంతంలోని పలు ప్రాంతాల్లో గుండాధూర్ ను స్మరిస్తూ ప్రత్యేక కార్యక్రామాలు నిర్వహించారు. ‘భూంకాల్ దివస్’ పేరిట చేపట్టిన ఈ కార్యక్రమంలో నకల్స్ చేతిలో మరణించిన 1700 మందికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజ్ పి మాట్లాడుతూ ఇలాంటి పోరాట యోధులను స్మరించుకోవడంతో పాటు నక్సల్స్ చేతిలో మరణించిన వారిని స్మరించుకుంటున్నామన్నారు. 24 ఏళ్లుగా నక్సల్స్ బస్తర్ అటవీ ప్రాంతంలో హింసాత్మక సంఘటనలకు పాల్పుడతున్నారంటూ దుయ్యబట్టారు. నక్సల్స్ ఏరివేతలో కేంద్ర పారా మిలటరీ బలగాలతో పాటు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పోర్స్ నిర్విరామంగా కృషి చేస్తోందన్నారు. ఏది ఏమైనా ఆదివాసిలు చేపట్టిన భూంకాల్ పోరాటాన్ని అటు మావోయిస్టులు, ఇటు పోలీసులు చేపట్టడం మాత్రం విశేషం. కాలగర్బంలో కలిపోయిన గుండాధూర్ లాంటి ఆదివాసీల పోరాట యోధుల చరిత్ర వెలుగులోకి రావడంతో స్మరించుకునే అవకాశం దక్కింది.