వ్యాసకర్త: చాడ వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యే, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు
సోదరి,సోదరులారా! తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు నిజాం గుండెల్లో రణభేరి మ్రోగించిన అనభేరి ప్రభాకర్ రావు,సింగిరెడ్డి భూపతి రెడ్డి తోపాటు మరో 10 మంది అమరవీరుల 76వ వర్ధంతిని 2024 మార్చి 14న కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రధాన కూరగాయల మార్కెట్ వద్ద గల అనభేరి ప్రభాకర్ రావు స్మారక విగ్రహం వద్ద మరియు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని బస్ డిపో చౌరస్తా వద్ద గల అనభేరి విగ్రహం వద్ద అలాగే అనభేరి ప్రభాకర్ రావు తో పాటు మరో 12 మంది అమరులైన మహ్మాదాపూర్ గుట్టల్లోని వారి స్మారక స్థూపాల వద్ద భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళ్ళర్పించి వారిని స్మరించుకునే కార్యక్రమం నిర్వహించుకోవడం సంతోషకరం.
అనభేరి ప్రభాకర్ రావు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పోలంపల్లి గ్రామంలో అనభేరి వెంకటేశ్వరరావు-రాధాబాయి లకు 1910 ఆగస్టు15న రెండవ సంతానంగా జన్మించారు.
400 వందల ఎకరాలకు పైగా భూములున్న భూస్వామ్య కుటుంబంలో జన్మించిన అనభేరి ప్రభాకర్ రావు ప్రాథమిక విద్యను కరీంనగర్ లో అభ్యసించి అనంతరం మచిలీపట్నంలో కొన్నాళ్లపాటు చదువుకొని, హైదరాబాద్ లోని రెడ్డి హాస్టల్ లో ఉంటూ చాదర్ ఘాట్ హైస్కూల్లో పదవ తరగతి పూర్తి చేశాడు.నిజాం కళాశాలలో ఇంటర్ చదివారు.
ఆనాటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా చిన్న వయస్సు లొనే సరళా దేవి తో అనభేరి ప్రభాకర్ రావుకు వివాహం జరిగింది.ఆ దంపతులకు
సులోచనా దేవి,శకుంతలా దేవి, విప్లవ కుమారి అను ముగ్గురు కుమార్తెలు జన్మించారు. తన స్వగ్రామంలో పటేల్,పట్వారీ, భూస్వామ్య విధానాలకు స్వస్తి పలకాలని,వెట్టి చాకిరి,బానిసత్వం ఉండకూడదని భావించి పాలేరుల పిల్లలను బడిలో చేర్పించాడు గ్రామంలో రైతు మహాసభలు నిర్వహించి వారిని చైతన్యపరిచారు. గ్రామంలో సహకార సంఘాలను ఏర్పాటు చేసాడు, కరీంనగర్ లో చేనేత సహకార సంఘం ఏర్పాటు చేసి ఆ రోజుల్లోనే 30 వేల మందికి రేషన్ కార్డులు ఇప్పించాడు. 1942 నుండి 1946 వరకు ఆ సంఘానికి రాష్ట్ర అధ్యక్షులుగా పని చేశాడు. విద్యార్థి దశలోనే నిజాం పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించడం మొదలుపెట్టాడు. ఆంధ్ర మహాసభ పేరుతో బద్దం ఎల్లారెడ్డి,రావి నారాయణరెడ్డి,మాక్ధూమ్ మోహియుద్దీన్ లాంటి గొప్ప నాయకులు నిర్వహించే సభలు, సమావేశాలకు ఆకర్షితుడై, వారి ఆదేశాలకు అనుగుణంగా ఆంధ్ర మహాసభ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొన్నాడు. 1936 సిరిసిల్లలో జరిగిన ఆంధ్ర మహాసభ నాల్గవ ప్లీనరీలో అనభేరి ప్రభాకర్ రావు కీలక భూమిక పోషించాడు.భారత కమ్యూనిస్టు పార్టీ కరీంనగర్ జిల్లా మొట్టమొదటి కార్యదర్శి గా పనిచేశారు. హైదరాబాద్ సంస్థానంలో నిజాం నవాబుల ఆగడాలు రోజురోజుకు పెట్రేగిపోతున్న రోజుల్లో భూస్వామ్య వ్యవస్థ పై, రజాకారుల ఆగడాలపై,గ్రామాల్లో పటేల్ పట్వారీ ల ఆధిపత్యాన్ని ఎదిరించడానికి ముందుకు వచ్చాడు. 1947లో సెప్టెంబర్ 11న తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి రావి నారాయణరెడ్డి,బద్దం ఎల్లారెడ్డి, మగ్దూం మోహియుద్దీన్ లు పిలుపనివ్వడంతో వందలాదిమంది యువకులు దళాలుగా ఏర్పడి ఉద్యమించడానికి ముందుకు రావడంతో వారందరికీ అనభేరి ప్రభాకర్ రావు నాయకత్వం వహించారు. విజయవాడ,చందా,సిరివంచ, అదిలాబాద్,కరీంనగర్ దళాలకు శిక్షణ ఇచ్చాడు. మొట్టమొదటి దళం అనభేరి ప్రభాకర్ రావు గారిదే ఆయన ఒక్కని వద్దనే స్టెన్ గన్ ఉండేది.
హైదరాబాద్ సంస్థానంలోని నిజాం నవాబు వారి తాబేదారులైన దేశ్ ముఖ్ లు,దొరలు,పటేల్,పట్వారీలు, రజాకార్ పోలీసులు ప్రజలను పట్టిపీడిస్తూ,పన్నులు వసూలు చేస్తూ,మహిళలను వివస్త్రలను చేసి అత్యాచారాలకు ఒడిగడుతుంటే చూస్తూ ఊరుకోక చావుకు ఎదురెళ్లి నిజాం ఆధిపత్యాన్ని ప్రశ్నించడం కోసం, భూమి కోసం, భుక్తి కోసం,వెట్టి చాకిరి విముక్తి కోసం ఉవ్వెత్తున సాగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో అనగారిన వర్గాలకు,పీడిత ప్రజలకు,మహిళలకు అండగా నిలిచి నిజాం నవాబు రజాకార్ల తుపాకీ గుండ్లకు ఎదురొడ్డి వీరోచితంగా పోరాడిన గొప్ప విప్లవకారుడు అనభేరి ప్రభాకర్ రావు.
భూస్వామ్య వ్యవస్థ పై తిరుగుబాటు చేస్తున్న అనభేరి ప్రభాకర్ రావుకు తాలూకాదార్ పదవి ఇస్తానని నిజాం సర్కార్ కబురు పెట్టినా లెక్కచేయలేదు
నిజాం సర్కార్ అనభేరి పై నజర్ బంద్ ప్రకటించినా
సర్కార్ కు నిద్రలేకుండా చేసిన ధైర్యశీలీ అనభేరి.
నిజాం నవాబు కు,రజాకార్ పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న అనభేరి ప్రభాకర్ రావుని పట్టిస్తే 50 వేల నజరానా ఇస్తామని నిజాం ప్రభుత్వం ప్రకటించిందంటే అనభేరి వారికి ఎంతటి టార్గెట్ అయ్యాడో అర్థం చేసుకోవచ్చు.
అణభేరిని లొంగదీసుకోవడం కోసం నిజాం సర్కార్ చేయని ప్రయత్నం లేదు. నేనేప్పుడూ పేదల పక్షమే అని చాటిచెప్పిన విప్లవ యోధుడు అనభేరి ప్రభాకర్ రావు.
1948 మార్చి 14 న అనభేరి ప్రభాకర్ రావు,సింగిరెడ్డి భూపతి రెడ్డి ల దళం హుస్నాబాద్ కు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న మహమ్మదాపూర్ గ్రామంలో భోజనం చేస్తుండగా రజాకార్ పోలీసులు చుట్టుముట్టడంతో దళమంతా గ్రామ సమీపాన గల గుట్టల వైపు పరిగెత్తి దళ సభ్యులు నలుదిక్కులు వెళ్లగా రజాకార్లు కాల్పులు జరపగా దళ సభ్యులు ఒక్కొక్కరుగా నేలకొరుగుతుంటే రజాకార్లపై అనభేరి ప్రభాకర్ రావు కాల్పులు జరుపుతూ గుట్ట ఎక్కుతుంటే తన చేతిపై రజాకార్ల కాల్పులు జరిపి ఆయనను నిరాయుధున్ని చేసి కాల్చి చంపారు.ఆ వీరోచిత పోరాటంలో ప్రభాకర్ రావు తో పాటు దళం లోని తాడూరు గ్రామానికి చెందిన సింగిరెడ్డి భూపతి రెడ్డి,ఓగులాపూర్ గ్రామానికి చెందిన ముస్కు చొక్కా రెడ్డి, ఏలేటి మల్లారెడ్డి, సోమారంపేట గ్రామానికి చెందిన అయిరెడ్డి భూంరెడ్డి,బేగంపేట గ్రామానికి చెందిన తూమోజు నారాయణ,నల్గొండ జిల్లాకు చెందిన బి.దామోదర్ రెడ్డి,గాలిపెల్లి గ్రామానికి చెందిన ఇల్లందుల పాపయ్య,రేగడిమద్దికుంట గ్రామానికి చెందిన నల్లగొండ రాజారాం, సిక్కుడు సాయిలు,రేపాక గ్రామానికి చెందిన రొండ్ల మాధవ రెడ్డి లు 12 మంది వీరోచితంగా పోరాడి అసువులు బాసారు.
అనభేరి ప్రభాకర్ రావు స్మారకార్థం 1986 లో చిగురుమామిడి మండలం రేకొండ గ్రామంలో సీపీఐ గ్రామ శాఖ కార్యాలయం నిర్మించడం జరిగింది.
మహ్మాదాపూర్ గ్రామంలో స్మారక స్థూపం నిర్మించి,ఎన్ కౌంటర్ జరిగిన గుట్ట స్థలంలో లెవలింగ్ చేసి గోడ నిర్మించి అమర వీరుల పేర్ల శిలాఫలకం కూడా ఏర్పాటు చేయడం జరిగింది.
దేశ స్వాతంత్ర్యo కోసం, హైదరాబాద్ సంస్థానంలోని నిజాం సర్కారుకు వ్యతిరేకంగా తాడిత, పీడిత ప్రజలకు అండగా నిలిచి వీరోచితంగా పోరాడి తన ప్రాణాలను తృణప్రాయంగా వదిలేసిన అనభేరి ప్రభాకర్ రావు లాంటి మహానీయుని విగ్రహాన్ని కరీంనగర్ నడిబొడ్డున ప్రధాన కూరగాయల మార్కెట్ చౌరస్తా వద్ద 1994 జనవరి 12న నాటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారిచే ప్రారంభించుకొవడం జరిగింది
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో అనేక రాజకీయ పార్టీలు అమరుల త్యాగాలను కొనియాడి నేడు విస్మరించడం కొంత బాధ కలిగించినప్పటికీ భారత కమ్యూనిస్టు పార్టీ గత 75 సంవత్సరాలుగా మహ్మదాపూర్ అమరవీరులను స్మరిస్తూ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది.
చాడ వెంకట రెడ్డి