రూ. లక్ష ఇచ్చి లక్షణంగా పెళ్లి జరిపించిన రసమయి


దిశ దశ, మానకొండూరు:

నూతన వధూవరులను ఆశీర్వదించాలని ఆ ఫంక్షన్ హల్లోకి అడుగుపెట్టిన ఆ ఎమ్మెల్యే షాకయ్యారు. మేళ తాళాల మోగాల్సిన చోట మాటల యుద్దం చోటు చేసుకుంది. వధువు కుటుంబ సభ్యులంతా కన్నీటి పర్యంతం అవుతుంటే వరుని కుటుంబ సభ్యుల తమ పంథాన్ని వీడడం లేదు. అక్షింతలు వేసి నిండు నూరేళ్లు ఆదర్శవంతమైన కాపురం చేయాలని ఆశీర్వదించేందుకు వెళ్లిన ఆ ఎమ్మెల్యే పెళ్లి తంతు జరిపించాల్సిన బాధ్యత తనపై పడిందన్న విషయం గమనించాడు. అసలు విషయం కనుక్కుని ఆ పెళ్లి పందిరిలో మూడు ముళ్ల బంధంతో ఆజంటను ఏకం చేసి ఏడడగులు వేయించి పెద్ద మనసు చాటుకున్నాడు. కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటనలో ఎమ్మెల్యే వ్యవహరించిన తీరు విన్న ప్రతి ఒక్కరూ ఆయన్ను అభినందిస్తున్నారు. వివరాల్లోకి వెల్తే… కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం అంబాల్ పూర్ మాజీ సర్పంచ్ గాజుల మల్లయ్య, లక్ష్మీ దంపతులు కూతురు అనూషను సైదాపూర్ మండలం వెన్నంపల్లికి చెందిన సంఘాల వినయ్ తో శుక్రవారం వివాహం జరగాల్సి ఉంది. వివాహానికి ముందే లాంఛనాలు కూడా అప్పగించిన పుట్టింటి వారు బైక్ కొనిస్తామని మాట ఇచ్చినప్పటికీ ఆర్థిక పరిస్థితుల సహకరించకపోవడంతో ద్విచక్ర వాహనం కొనలేకపోయారు. పెళ్లి సమయానికి బైక్ ఏమైందని వరుని తరుపు వారు అడిగారు. సకాలంలో చేతికి డబ్బు రాకపోవడంతో బైక్ కొనలేకపోయామని అనూష తల్లిదండ్రులు చెప్పడంతో కినుక వహించిన వరుని తరుపు బంధువుల పెళ్లి చేసుకునేందుకు ససేమిరా అన్నారు. ఈ విషయంపై ఫంక్షన్ హాల్లో వాదనలు సాగుతున్న క్రమంలో మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ వధూవరులను ఆశీర్వదించేందుకు ఫంక్షన్ హాల్ కు చేరుకున్నారు. నవ వధూవరులను ఆశీర్వదించాలన్న సంతోషంతో చేరుకున్న రసమయి ఫంక్షన్ హాల్లో నెలకొన్న వాతావరణాన్ని చూసి ఆందోళన వ్యక్తం చేశారు. అర్థాంతరంగా పెళ్లి ఆగిపోవడం ఏంటన్న విషయం తెలుసుకున్న బాలకిషన్ మానవత్వాన్ని ప్రదర్శించి పీటల వరకూ చేరి నిలిచిపోయే స్థితికి చేరుకుంటున్న తరుణంలో పెళ్లి తంతును యథావిధిగా కొనసాగించేందుకు చొరవ తీసుకున్నారు. వరునికి వధువు తల్లిదండ్రులు ఇస్తానని చెప్పిన బైక్ ఇప్పించేందుకు ముందుకు వచ్చి అప్పటికప్పుడు రూ. లక్ష వరుని చేతిలో పెట్టి నిర్విఘ్నంగా పెళ్లి తంతు సాగేందుకు దొహదపడ్డారు. రసమయి బాలకిషన్ తీసుకున్న చొరవతో అప్పటి వరకు నిశ్శబ్దానికి కేరాఫ్ గా ఉన్న ఆ ఫంక్షన్ హాల్ లో ఒక్కసారిగా భాజా భజంత్రిలతో సందడి మొదలైంది. వేద మంత్రోచ్ఛరణాల మధ్య వివాహం బంధంతో ఆ జంట ఒక్కటయింది. పెద్దన్న పాత్ర పోషించిన రసమయి పీటల వరకు వచ్చిన పెళ్లి ఆగకుండా వ్యవహరించిన తీరుపై ప్రతి ఒక్కరూ చర్చించుకున్నారు. వధువు పుట్టింటి వారికి ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవడంతో అనుకున్న మేర లాంఛనాలు ఇవ్వలేక… నిలిచిపోయే స్థితికి చేరుకున్న పెళ్లిని యథావిధిగా కొనసాగించిన రసమయిని ప్రతి ఒక్కరూ అభినందించారు. అతిథిగా వెల్లి ఆశీస్సులు అందించాల్సిన ఆయన అప్పటికప్పుడు వధువుకు పెద్దన్నయ్యలా మారిపోయిన తీరుపై సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఏది ఏమైనా మరొక్క అడుగు ముందుకేస్తే ఏడడుగులతో ఏకం కావల్సిన ఆ జంట దూరం అయ్యే సమయంలో రసమయి వేసిన ముందడుగుతో ఇరు కుటుంబాల్లో శాశ్వత బంధాన్ని నిలిపిన తీరు ఆదర్శనీయం.

You cannot copy content of this page