కాపాడిన స్థానికులు
బహుదూర్ ఖాన్ పేట్ లో ఘటన
దిశ దశ, కరీంనగర్:
సంధ్యాకాలం కావడంతో అప్పుడప్పుడే చీకట్లు అలుముకుంటున్నాయి… అంతలో ఇంట్లోంచి స్పార్క్స్ రావడంతో ఆ యువకుడు ఠక్కున లోపలకు పరిగెత్తాడు. గదిలో కమ్ముకున్న పొగతో ఉక్కిరిబిక్కిరై ఏం చేయాలో అర్థంకాక మరోగదిలోకి వెళ్లి ప్రాణాలు దక్కించుకుందామనుకున్నాడు. కానీ నెమ్మదిగా మంటలు చెలరేగుతూ పొగ అంతా ఇళ్లంతా కమ్ముకపోయింది. ఊపిరాడక బిడ్డ గదిలో అయోమయానికి గరువుతున్నాడు. అంతలోనే నా మనవడు ఏడీ అన్న అరపులు వినిపించడంతో ఓ గదిలో చిక్కుకున్న యువకున్ని స్థానికులు కాపాడారు. లేనట్టయితే ఓ నిండు ప్రాణం సజీవ దహనం అయ్యేది.
కరీంనగర్ జిల్లాలో ప్రాణాపాయం నుండి 18 ఏళ్ల యువకుడు బయటపడ్డాడు. షాట్ సర్క్యూట్ కారణంగా చోటు చేసుకున్న అగ్నిప్రమాదంలో చిక్కుకోగా అతన్ని స్థానికులు కాపాడారు. సంఘటనా వివరాల్లోకి వెల్తే… కరీంనగర్ సమీపంలోని బహుదూర్ ఖాన్ పేటలో మంగళవారం సాయంత్రం మహాలక్ష్మీ జనరల్ స్టోర్స్ అండ్ లేడీస్ ఎంపోరియంలో షాట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగింది. అనివర్ష్ (18) ఇంట్లో మొబైల్ ఛార్జింగ్ పెట్టి బయటకు రాగా ఇంతలో సెల్ ఫోన్ స్విచ్ బోర్డు వద్ద స్పార్క్స్ వచ్చాయి. దీంతో అనివర్ష్ ఇంట్లోకి వెల్లి చూసేసరికి స్పార్క్స్ అక్కడే ఉన్న అమ్మకానికి తెచ్చిన దుస్తులపై పడడంతో నిప్పు రాజుకుంది. ఆ గదిలోకి వెల్లిన అనివర్ష్ పొగచూరిన గదిలోకి వెల్లి ఆందోళనకు గురై పక్కనే ఉన్న మరో గదిలోకి వెల్లి తలుపులు వేసుకున్నాడు. ఇంట్లో ఒక్కసారిగా పొగ కమ్ముకోవడం గమనించిన షాపు యజమానికి ఆకుల మల్లయ్య కుటుంబ సభ్యులు హుటాహుటిన మంటలు ఆర్పే పనిలో నిమగ్నం అయ్యారు. అంతలో తన అనివర్ష్ కనిపించకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు భోరున విలపించారు. ఇంటికి అంటుకున్న మంటలు ఆర్పుతున్న స్థానికులు ఇంటి కిటికిని పగలగొట్టి అందులో అనివర్ష్ ఉన్నాడని నిర్దారించుకుని ఇంటిపై రేకులను పగలగొట్టి బయటకు తీశారు. అప్పటికే ఆ గదిలోకి కూడా పొగ వెళ్లడంతో శ్వాస సంబంధిత సమస్యను ఎదుర్కోవడంతో పాటు అనివర్ష్ పాదాలకు కూడా గాయాలయ్యాయని బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. అతన్ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ సమాచారం అందుకున్న కరీంనగర్ ఫైర్ స్టేషన్ సిబ్బంది బహుదూర్ ఖాన్ పేట్ లోని ఆకుల మల్లయ్య ఇంటికి ఫైరింజన్ తీసుకెళ్లి మంటలు ఆర్పారు. ఈ ఘటనలో షాపులోని సామాగ్రి అంతా దగ్దం కావడంతో రూ. 15 లక్షల వరకు ఆస్థినష్టం సంభవించి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ ఘటనలో బంగారం, నగదుతో పాటు జనరల్ అండ్ లేడీస్ ఎంపోరియంలోని సామాగ్రి అంతా కాలి బూడిదైందని బాధిత కుటుంబసభ్యులు తెలిపారు.
రైల్వేగేట్ ఎఫెక్ట్…
బహుదూర్ ఖాన్ పేట్ లో అగ్నిప్రమాదం జరిగిన సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకునేందుకు ఫైరింజన్ బయలు దేరినా సకాలంలో చేరుకోలేకపోయింది. కరీంనగర్ సమీపంలోని రైల్వేగేట్ కారణంగా 12 నిమిషాలు వెయిట్ చేయాల్సి వచ్చింది. రైల్వే గేట్ ఓపెన్ అయిన తరువాత ఫైర్ ఇంజన్ బహుదూర్ ఖాన్ పేట్ కు చేరుకునే సరికే చాలావరకు గ్రామస్థులు మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. రైల్వే గేట్ అడ్డంకిగా లేనట్టయితే సకాలంలో ఫైరింజన్ చేరడంతో ఆస్థి నష్టం కొంతమేర తగ్గేదని స్థానికులు అంటున్నారు.