భార్య కోసం ఓ యువకుడి వినూత్న ప్రయత్నం

ఫ్లెక్సీ కట్టి మరీ ప్రచారం…

కులం పట్టింపు లేదని వెల్లడి…

దిశ దశ, ఏపీ బ్యూరో:

ఆలి కోసం తపన పడుతున్న ఓ యువకుడు సరికొత్త ప్రయత్నానికి తెరలేపాడు. డిగ్రీ పూర్తి చేసిన వైవాహిక బంధంతో తన జీవితంలోకి అడుగుపెట్టాల్సిన యువతి కోసం ఆయన చేసిన ఈ ప్రయత్నం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. జీవిత భాగస్వామి కోసం తిరిగి తిరిగి వేసారి ఈ విధానాన్ని ఎంచుకున్నాడో లేక… తొలి ప్రయత్నమే ఈ విధంగా మొదలు పెట్టాడో తెలియదు కానీ భార్య కోసం ఆయన పడుతున్న బాధ మాత్రం కళ్లకు కట్టినట్టుగా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకున్న ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. ఏపీలోని చీరాల పట్టణానికి చెందిన దేవన నీలకంఠ అయ్యప్ప కుమార్ తన జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునేందుకు ఎంచుకున్న విధానం గమ్మత్తుగా ఉంది. పట్టణంలోని స్టేట్ బ్యాంక్ ముందు ఓ సైకిల్ కు ప్రత్యేకంగా ఓ ఫ్లెక్సీని ఏర్పాటు చేసిన ఆయన తన వైఖరి ఏంటో స్ఫష్టంగా వివరించారు. ఏడడుగుల బంధంతో నిండు నూరేళ్లు కలిసి జీవనం సాగించాల్సిన తన జీవితంలోకి రావల్సిన వారు కూడా తనపై స్పష్టత వస్తేనే వివరాలు ఇవ్వాలని మరీ ఫ్లెక్సీలో పేర్కొనడం గమనార్హం. ఇదే సైకిల్ పై ఉంచిన ఓ నోట్ బుక్ లో తాను అంటే ఇష్టం ఉన్న అమ్మాయిలు వివరాలు రాయాలని, కులం పట్టింపు లేదని కూడా అందులో పేర్కొన్నారు. అంతేకాకుండా వీలు ఉన్నప్పుడు తనను కలవలాని కోరడమే కాకుండా నమ్మకం లేనట్టయితే వివరాలను ఇవ్వవద్దని కూడా అందులో కోరాడు. మనస్పూర్తిగా మాత్రమే వివరాలు నమోదు చేయాలని లేని వారు తన సమయాన్ని కూడా వృధా చేయకూడదని అయ్యప్ప కుమార్ అభ్యర్థించారు. బీకాం పూర్తి చేసిన ఆయన జీవిత భాగస్వామి కోసం ఎంచుకున్న విధానం మాత్రం అందరినీ ఆశ్యర్యంలో ముంచెత్తుతోంది. అయితే నేటి తరం అమ్మాయిలు కూడా తమ డిమాండ్లకు అనుగుణంగా ఉన్నవారితోనే జీవితాన్ని పంచుకోవాలని భావిస్తుండడంతో సగటు యువకుల బ్రహ్మచారులుగానే మిగిలిపోతున్నారు. దేశ వ్యాప్తంగా కూడా సాఫ్ట్ వేర్ వైపు యువత పయనిస్తుండడం ఆ దిశగా అడుగులు వేయన అబ్బాయిల పరిస్థితి కూడా దయనీయంగా ఉంది. వ్యాపారమే వృత్తిగా జీవనం సాగించే ఆర్యవైశ్య సామాజిక వర్గంలోనూ ఉద్యోగాలు చేసే వారిని మాత్రమే పెళ్లి చేసుకునేందుకు యువతులు ఆసక్తి చూపుతున్న పరిస్థితి తయారైంది. వ్యాపారంలో స్థిరపడిన తల్లిదండ్రులు కూడా అదే దిశగా ఆలోచిస్తుండడంతో వ్యాపారం చేస్తున్న వైశ్యులు బ్రహ్మచారులుగానే మిగిలిపోతున్నారు. దీంతో నేటితరానికి చెందిన చాలామంది కులం పట్టింపులకు ప్రాధాన్యత ఇవ్వకుండా జీవిత భాగస్వామిని ఎంచుకుంటే చాలు అన్నట్టుగా ఆలోచిస్తున్నారన్నది నిజం. చీరాల పట్టణానికి చెందిన అయ్యప్ప కుమార్ ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన తీరుపై నెటిజెన్లు ఎలాంటి కామెంట్లు చేస్తున్నా దాని వెనక దాగిఉన్న నిగూడత మాత్రం ఇదేనన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న వారెందరో… ఈ యువకుడి ఆలోచనతో అయినా జీవితంలోకి భాగస్వామి అడుగు పెట్టాలని మనమూ ఆశిద్దాం.

You cannot copy content of this page