దద్దరిల్లిన దండకారణ్యం
మావోయిస్టుల పై బలగాల పట్టు
దిశ దశ, దండకారణ్యం:
నారాయణపూర్ జిల్లా నందుర్, తుల్ తుల్ అడవుల్లో జరిగిన కాల్పుల మోత దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. విప్లవోద్యమ చరిత్రలో మావోయిస్టు పార్టీ మరో భారీ నష్టాన్ని చవి చూసింది. పెట్టని కోటగా ఉన్న దండకారణ్యంలో శుక్రవారం జరిగిన ఎన్ కౌంటర్ లో 31 మంది నక్సల్స్ ప్రాణాలు కోల్పోయారు. చతిస్ గడ్ రాష్ట్రంలో కొనసాగుతున్న కూంబింగ్ ఆపరేషన్లలో బలగాలు నక్సల్స్ పై పై చేయిగా మరోసారి నిలిచాయి. తాజాగా నారాయణపూర్, దంతేవాడ జిల్లాల సరిహద్దుల్లో జరిగిన ఎన్ కౌంటర్ లో మావోయిస్టు పార్టీ కీలక నాయకత్వాన్ని కోల్పోయింది. ఈ ఘటనలో DKSZC ముఖ్య నాయకులు కమలేశ్, ఉర్మిళలు కూడా మరణించారని పోలీసులు వెల్లడించారు. ఈ ఎన్ కౌంటర్ లో చనిపోయిన వారిలో 13 మంది మహిళలు ఉన్నారు. ఈ ఘటనలో PLGA 6, ఇంద్రావతి ఏరియా, ప్లాటూన్ నెంబర్ 16 కమిటీలకు చెందిన నక్సల్స్ చనిపోయినట్టుగా పోలీస్ వర్గాలు చెబుతున్నాయి. ఘటనా స్థలం నుండి ఇన్సా స్, ఏకే 47, SLR, BLGతో పాటు మరిన్ని ఆయుధాలను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.
ఐదు గంటలకు పైగా…
తుల్ తుల్ అటవీ ప్రాంతంలో శుక్రవారం మధ్యాహ్నం నుండి సాయంత్రం ఐదు గంటల వరకు వరుసగా ఎదురు కాల్పుల ఘటనలు జరిగాయని బస్తర్ రేంజ్ పోలీస్ అధికారులు తెలిపారు. 15 రోజులుగా మావోయిస్టుల ఏరివేత కోసం నారాయణపూర్, దంతేవాడ పోలీసులతో పాటు డిఆర్జీ, SPF, బలగాలు ఈ ప్రాంతంలో సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం తుల్ తుల్ సమీపంలోని అడవుల్లో నక్సల్స్ ఎదురుపడడంతో కాల్పులు జరిగినట్లుగా పోలీస్ అధికారులు చెప్తున్నారు.
వారంతా సేఫ్
మావోయిస్టు పార్టీ ఈ ఎన్ కౌంటర్ లో ముఖ్య నాయకత్వాన్ని కోల్పోయిందన్న ప్రచారం విస్తృతంగా సాగింది. అయితే ఇప్పటివరకు పోలీస్ అధికారులు వివరించిన సమాచారాన్ని బట్టి సెంట్రల్ కమిటీ నాయకత్వానికి ఎలాంటి ముప్పు వాటిల్ల లేదని స్పష్టం అవుతుంది. శనివారం ఉదయం నుండి మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాలా కేశవరావు, మరో ముఖ్య నేత తక్కలపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్నలు ఉన్నట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే శనివారం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో బస్టర్ రేంజ్ పోలీసులు మీడియాకు అందించిన వివరాల్లో సీసీ కమిటీ నాయకత్వం పేర్లు లేవు. దీంతో పార్టీ కేంద్ర కమిటీ సేఫ్ జోన్ లోనే ఉన్నట్టుగా స్పష్టమవుతుంది. ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతంలో కేంద్ర కమిటీ ముఖ్య నాయకులు షెల్టర్ తీసుకుంటారన్న కారణంగా నంబాల, తక్కళ్లపల్లిలు కూడా ఉండి ఉంటారన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఉదయం నుండి జరిగిన ప్రచారంతో మావోయిస్టు పార్టీ కూడా అయోమయానికి గురైంది. పౌరహక్కుల సంఘాలు, ఇతర ఆర్గనైజేషన్స్ కూడా ఈ ఘటనపై ప్రకటనలు.విడదల చేశాయి. ఎన్ కౌంటర్లో చనిపోయిన వారి వివరాలు, ఫోటోలు కూడా విడుదల చేయాలని డిమాండ్ చేశాయి. మరో వైపున ఈ ఘటపలో కమలేష్ కూడా లేడని, ఆయన కూడా సేఫ్ గా ఉన్నాడని తెలుస్తోంది.