దిశ దశ, అంతర్జాతీయం:
బంగ్లాదేశ్ లో పరిస్థితులు అల్లకల్లోలంగా మారాయి. ఆందోళనకారుల అల్లర్లు కంట్రోల్ చేసే పరిస్థితి కూడా లేకుండా పోయింది. రిజర్వేషన్లు విషయంలో మొదలైన అల్లర్లు దేశ వ్యాప్తంగా పాకాయి. దీంతో బంగ్లాదేశ్ లో అల్లకల్లోలం నెలకొంది. పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగడంతో మృతుల సంఖ్య కూడా క్రమక్రమంగా పెరుగుతోంది. దేశ వ్యాప్తంగా కూడా ఆందోళన కారులు చెలరేగిపోవడంతో వాటిని కట్టడి చేసే పరిస్థితి కూడా చేయి దాటిపోయినట్టుగా స్పష్టం అవుతోంది. దీంతో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి దేశం వదిలి పారిపోయినట్టుగా అక్కడి వార్త సంస్థలు పేర్కొన్నాయి. ఆమె భారత్ కు వచ్చి తల దాచుకుందన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ప్రధాని అధికారిక నివాసంలోకి కూడా ఆందోళనకారులు చొచ్చుకపోయారు.
సైనిక పాలన…
బంగ్లాదేశ్ లో నెలకొన్న అస్థిరత నేపథ్యంలో అక్కడి ఆర్మీ ప్రభుత్వాన్ని నిర్వహించాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు ఆర్మీ చీఫ్ కూడా అధికారికంగా ప్రకటన విడుదల చేసి పరిపాలన బాధ్యతలు తమ చేతుల్లోకి తీసుకున్నామన్నారు.
హై అలెర్ట్…
మరో వైపున బంగ్లాదేశ్ లో నెలకొన్న పరిస్థితులను భారత్ కూడా గమనిస్తోంది. అక్కడ నెలకొన్న ఆందోళనలను సునిశితంగా గమనిస్తున్న భారత్ అంతర్గత భద్రత విషయంపై దృష్టి సారించింది. బంగ్లాలో అల్లర్లు తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు పశ్చిమ బెంగాల్ లోని సరిహద్దు ప్రాంతంలో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ను మరింత బలోపేతం చేశారు. అక్రమ చొరబాట్ల విషయంలో కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. బీఎస్ఎఫ్ డీజీ కూడా హుటాహుటిన కోల్ కత్తా చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ లోని కూచ్‌బెహార్, పెట్రాపోల్ సరిహధ్దు ప్రాంతాల్లో హై అలెర్ట్ ప్రకటించారు.