నిందితులను మరిపిస్తున్న పోలీసులు…

దిశ దశ, హైదరాబాద్:

శాంతి భద్రతల పరిరక్షణలో అత్యంత కీలక భూమిక పోషించే పోలీసు విభాగం అబాసుపాలవుతోంది. యంత్రాంగంలో కొద్ది మంది చేస్తున్న తప్పిదాలు రాష్ట్ర పోలీసు వ్యవస్థకే తలవంపులు తెచ్చే విధంగా మారిపోయింది. నిందితులను వేటాడాల్సిన వారే చెర నుండి తప్పించుకునే ప్రయత్నాలు చేసే దుస్థికి చేరుకుంటున్నారు. సమాజాన్ని గాడిలో పెట్టాల్సిన పోలీసు అధికారులు దారి తప్పుతున్న తీరు మాత్రం అటు పోలీసు ఉన్నతాదికారులను, ఇటు సామాన్యులను ముక్కున వేలేసుకునేలా చేస్తోంది.

పరార్ అవుతున్న తీరు…

హైదరాబాద్ సీసీఎస్ ఈఓడబ్లు వింగ్ సీఐ సుధాకర్ రూ. 3 లక్షల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకునేందుకు రంగం సిద్దం చేసుకున్నారు. అయితే డబ్బులు తీసుకున్న తరువాత సీఐ సుధాకర్ ఏసీబీ అధికారుల నుండి తప్పించుకుని హైదరాబాద్ రోడ్లపై పరుగు పెట్టడం మొదలు పెట్టారు. దీంతో ఏసీబీ అధికారులు అతన్ని ఛేజ్ చేసి మరిపట్టుకున్నారు. తాజాగా జగిత్యాల జిల్లా రాయికల్ ఎస్సై అజయ్ రూ. 10 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకునేందుకు ఏసీబీ అధికారులు వ్యూహం పన్నారు. శుక్రవారం రాత్రి అశోక్ ను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో బయట నుండి ఠాణాకు వచ్చిన ఎస్సై అశోక్ ఏసీబీ అధికారుల కదలికలను గమనించి మిడియేటర్ వద్ద డబ్బులు ఉంచి పరార్ అయ్యాడు. దీంతో అతని కోసం ఏసీబీ అధికారులు గాలింపు మొదలు పెట్టారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ఎస్సై భవాని సేన్ తనవద్ద సబార్డినేట్లుగా పని చేస్తున్న మహిళా ఉద్యోగిని పట్ల వ్యవహరించిన తీరు అందరికీ తెలిసిందే. అయితే ఈ వ్యవహారంపై అతన్ని విచారించేందుకు అదుపులోకి తీసుకున్న క్రమంలో అధికారుల కళ్లుగప్పి తప్పించుకునేందుకు స్కెచ్ వేసుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఓ ప్రైవేటు వాహనం తెప్పించుకుని వెల్లిపోయి ఈ కేసుల నుండి బయటపడేందుకు ప్రయత్నించాలని భావించినట్టుగా తెలుస్తోంది. అతని కదలికలను గమనించిన భూపాలపల్లి జిల్లా పోలీసు అధికారులు కట్టడి చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుని భవాని సేన్ ను అరెస్ట్ చేశారు. నేరాలకు పాల్పడిన నిందితులు పరార్ అయితే వారిని వేటాడి… వెంటాడి పట్టుకునే పోలీసులే నిందితులుగా మారిపోయి పోలీసుల చెర నుండి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్న తీరు అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. చట్టానికి ఏనాటికైనా చిక్కక తప్పదన్న విషయం తెలిసి… ఇంతకాలం చట్ట ప్రకారం నడుచుకున్న పోలీసు అధికారులే పరార్ కావాలనుకుంటుండడమే విచిత్రంగా మారింది.

You cannot copy content of this page