దిశ దశ, జనగామ:
విద్యుత్ లైన్ క్లియరెన్స్ కోసం లంచం అడిగిన టీజీఎన్‌పీడీసీఎల్ డివిజనల్ ఇంజనీర్ ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. రూ. 20 వేలు లంచం తీసుకున్నప్పుడు అతన్ని ట్రాప్ చేశారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్‌లోని టీజీఎన్‌పీడీసీఎల్ ఆపరేషన్స్ డివిజనల్ ఇంజనీర్ మాలోత్ హుస్సేన్ నాయక్ బాధితుని నుండి రూ. 20 వేలు లంచం తీసుకుని తన టేబుల్ డ్రాలో దాచారు. వరంగల్ రేంజ్ ఏసీబీ అధికారులు లంచం సొమ్మును రికవరీ చేసి డీఈని అరెస్ట్ చేసి వరంగల్ ఏసీబీ స్పెషల్ కోర్టులో హాజరు పరిచారు. తన వ్యవసాయ భూమి మీదుగా వెల్తున్న 33 కెవి విద్యుత్ లైన్ ను మార్చాలని రైతు డీఈని అభ్యర్థించారు. లైన్ క్లియరెన్స్ ఇవ్వడానికి రూ. 20 వేలు లంచం అడిగినట్టుగా బాధిత రైతు ఏసీబీ అధికారులకు వివరించి అతన్ని పట్టించారు. లైన్ క్లియరెన్స్ కోసం ఏఈ, కాంట్రాక్టర్ కు బాధ్యతలు అప్పగించాల్సి ఉన్న క్రమంలో లంచం సొమ్ము అడిగినట్టుగా రైతు వివరించారు.