పేరు మార్పిడీ కోసం లంచం అడిగిన వీఆర్వో…

నాలుగేళ్ల జైలు శిక్ష, రూ. 14 ఏళ్ల జరిమానా విధించిన కరీంనగర్ ఏసీబీ కోర్టు

దిశ దశ, కరీంనగర్:

రిజిస్టర్ గిఫ్ట్ డీడ్ చేసిన భూమికి సంబంధించిన పట్టాదారు పేర్లను రెవెన్యూ రికార్డుల్లో మార్చేందుకు లంచం అడిగిన వీఆర్వోకు జైలు శిక్షతో పాటు జరిమానా విధించింది కరీంనగర్ ఏసీబీ స్పెషల్ కోర్టు. సంఘటనా వివరాల్లోకి వెల్తే… కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అల్గూనురుకు చెందిన దొంత తార తన వారసులకు తనకు చెందిన 494/D వ్యవసాయ భూమిలో 2 గుంటలు కూతురు తంగవేలు స్వాతి, తంగవేలు శివకుమార్ ల పేరిట, 18 గుంటల భూమిని తంగవేలు స్వాతి పేరిట రిజిస్ట్రేషన్ కార్యాలయంలో గిఫ్ట్ డీడ్ చేశారు. అయితే ఈ మేరకు రెవెన్యూ రికార్డుల్లో పేర్లను మార్చాలని వీఆర్వో అడుప శ్రీనివాస్ ను అభ్యర్థించగా ఆయన రూ. 10 వేలు లంచం అడిగాడు. నిరుపేద కుటుంబానికి చెందిన తాను మామూళ్లు ఇచ్చుకోలేనని బ్రతిమాలిడినా వీఆర్వో శ్రీనివాస్ వినకుండా డబ్బులు ఇవ్వందే పని కాదని తేల్చిచెప్పి చివరకు రూ. 7 వేలు ఇవ్వాలన్నాడు.. లంచం డబ్బులు తయారు చేసుకుని తనకు కాల్ చేస్తే ఎక్కడ ఇవ్వాలో చెప్తానని కూడా వీఆర్వో అనడంతో తార ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఈ మేరకు 2012 డిసెంబర్ 5న వీఆర్వో శ్రీనివాస్ కు రూ. 7 వేలు లంచంగా తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ గౌడ్ నేతృత్వంలో దాడి చేసి పట్టుకున్నారు. కరీంనగర్ ఏసీబీ స్పెషల్ కోర్టులో విచారణ జరుగుతున్న ఈ కేసులో గురువారం తీర్పునిచ్చింది. వీఆర్వో శ్రీనివాస్ కు నాలుగేళ్ల జైలు శిక్షతో పాటు రూ. 14 వేల జరిమానా కూడా విధించింది ఏసీబీ న్యాయ స్థానం. అప్పుడు అల్గునూరు వీఆర్వోగా పనిచేసిన అడుప శ్రీనివాస్ ప్రస్తుతం జగిత్యాల మెడికల్ కాలేజీలో జూనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్నారు.

You cannot copy content of this page