దిశ దశ, వేములవాడ:
భక్తులకు కొంగు బంగారంగా నిలుస్తున్న వేములవాడ రాజన్న ఆలయంలో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. పేదల పాలిట ప్రత్యక్ష్య దైవంగా భావించే రాజన్న గుడిలో దేవాదాయ శాఖ అధికారులు వ్యవహరించిన తీరుపై ఏసీబీ విచారణలు బయటపడ్డాయి. రెండు రోజుల క్రితం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేసిన సంగతి తెలిసిందే. కరీంనగర్ రేంజ్ డీఎస్పీ రమణ మూర్తి నేతృత్వంలో జరిగిన ఈ విచారణలో పలు తప్పిదాలను గుర్తించారు.
స్టాక్ రిజిస్టర్ లో తేడాలు…
రాజన్న ఆలయంలోని పలు రికార్డులను పరిశీలించిన ఏసీబీ అధికారులు స్టాక్ రిజిస్టర్లలో ఉన్న తప్పిదాలు గుర్తించారు. నెయ్యి, జీడిపప్పు, నూనెకు సంబంధించిన వివరాల్లో తేడాలు ఉన్నాయని గుర్తించారు. రాజన్నకు మొక్కులు చెల్లించేందుకు వచ్చే భక్తుల నుండి డబ్బులు వసూలు చేస్తున్నారన్న విషయాన్ని కూడా గమనించారు. తల నీలాలు సమర్పించే ఒక్కో భక్తుని నుండి రూ. 50, రూ. 100 చొప్పున వసూలు చేస్తున్నారని ఇది నిబంధనలకు విరుద్దమని తేల్చారు. కొత్త టెండర్ల విధానానికి దేవాదాయ శాఖ ఆమోదం లేకుండానే పాత టెండర్ల ద్వారానే వస్తువులు, సామాగ్రి కొనుగోలు చేస్తున్నారని ఏసీబీ అధికారులు గుర్తించారు.
ఒక్క రోజులోనే…
ఏసీబీ అధికారులు వేములవాడ రాజన్న ఆలయంలో తనిఖీలు ఒక్క రోజు మాత్రమే చేపట్టారు. గంటల వ్యవధిలో సాగిన ఈ పరిశీలనలోనే ఇన్ని అవకతవకలు వెలుగులోకి వచ్చాయంటే ఆలయంలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఆలయానికి సంబంధించిన మిగతా విభాగాల్లోనూ ఏసీబీ అధికారులు తల దూర్చితే ఇంకా ఎన్ని అక్రమాలు వెలుగులోకి వస్తాయోనన్న చర్చ సాగుతోంది. అన్న సత్రం, కోడెల నిర్వహణ, భక్తుల సౌకర్యాలకు కెటాయించిన గదులకు సంబంధించిన అంశాలు, ఉద్యోగుల తీరు తెన్నులు, వీఐపీల దర్శనాల కోసం అవుతున్న ఖర్చు తదితర పలు అంశాల గురించి పరిశీలిస్తే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా శాశ్వత కళ్యాణం కోసం డబ్బులు చెల్లించే భక్తులకు కనీస సమాచారం కూడా ఇవ్వకపోవడం, కళ్యాణం భక్తుల కోసం ప్రత్యేకంగా ఇచ్చే ప్రసాద వితరణ వంటి అంశాలు, డోనర్స్ ఇచ్చిన డబ్బుల వివరాలతో పాటు, సెక్యూరిటీ కోసం తీసుకున్న చర్యలు ఇందుకోసం వెచ్చిస్తున్న ఖర్చుల వివరాలు సేకరిస్తే బావుంటుందని భక్తులు సూచిస్తున్నారు. అనుబంధ ఆలయాల నిర్వహణ పేరిట వెచ్చిస్తున్న నిధుల గురించి కూడా సేకరించాల్సిన అవసరం ఉందని అంటున్నారు. ఏసీబీ అధికారులు రాజన్న ఆలయానికి సంబంధించిన అన్ని అంశాలపై దృష్టి సారించి మరింత లోతుగా ఆరా తీస్తే భక్తులకు వరాలిచ్చే రాజన్న ఆలయ ఖర్చుల పేరిట కల్పతరువుగా మార్చుకున్న వారి బండారం బయటపడే అవకాశాలు ఉన్నాయి.
https://x.com/TelanganaACB/status/1827038856706937149