దిశ దశ, హైదరాబాద్:
చిరుద్యోగులే కాదు పెద్ద స్థాయిలో ఉన్న అధికారులను వేటాడడంలో వెనకాడేది లేదంటులోంది ఏసీబీ. ఉన్నతాధికారి అయినా… సామాన్య ఉద్యోగి అయినా అవినీతికి పాల్పడితే అంతే సంగతులంటూ చేతల్లో చూపిస్తోంది. అవినీతి అధికారుల విషయంలో మీనామేషాలు లెక్కించకుండా ఏసీబీ పెంచిన దూకుడు యంత్రాంగంలో సరికొత్త గుబులు స్టార్ట్ అయింది. తాజాగా నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆసుపత్రి సూపరింటిండెంట్ లచ్చు నాయక్ రూ. 3 లక్షలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. హస్పిటల్ మెడిసి కాంట్రాక్టర్ రాపోలు వెంకన్నను రూ. 3 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో ఆయన ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. శుక్రవారం ఉదయం తన ఇంట్లో సూపరింటిండెట్ లచ్చు నాయక్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
దూకుడు పెంచిన వైనం…
ఇటీవల కాలంలో ఏసీబీ అధికారులు అవినీతికి పాల్పడుతున్న వారిని పట్టుకునే విషయంలో దూకుడు పెంచినట్టుగా స్పష్టం అవుతోంది. హెచ్ఎండీఏ మాజీ డైరక్టర్ శివ బాల కృష్ణపై ఆదాయానికి మించి ఆస్తులు గడించిన విషయంలో ఏసీబీ ప్రత్యేకంగా దాడులు నిర్వహించింది. ఆయన వద్ద లభ్యమైన డాక్యూమెంట్లు, విలువైన వస్తువలతో పాటు నగదును స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరు పరిచింది. ఆ తరువాత కస్టడీ పిటిషన్ వేసి విచారించిన ఏసీబీ అధికారులు షాకింగ్ విషయాలను వెలుగులోకి తెచ్చారు. వాల్యూయేషన్ ప్రకారం రూ. 250 కోట్ల వరకు ధర పలుకుతుండగా… బహిరంగ మార్కెట్లో రూ వెయ్యి కోట్ల పై మాట పలుకుతున్న స్థిరాస్థులను, బినామీలను కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. శివ బాలకృష్ణ అక్రమ ఆస్థుల అంశం జాతీయ స్థాయిలో కూడా చర్చనీయాంశంగా మారింది. ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్ రైటర్, హెడ్ కానిస్టేబుల్ కోటేశ్వర్ రావు రూ. 50 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. 7 ఏళ్ల లోపు జైలు శిక్ష పడే కేసుల్లో 41 సీఆర్పీసీ కింద నోటీసులు ఇవ్వాలని కోర్టు స్పష్టంగా చెప్పినప్పటికీ కొంతమంది పోలీసులు అక్రమార్జన మాత్రం మానడం లేదు. ఖమ్మం టూ టౌన్ హెచ్ సి కోటేశ్వర్ రావు కూడా ఈ నోటీసులు ఇచ్చేందుకు రూ. 1.50 లక్షల లంచం అడగగా చివరకు రూ. 50 వేలకు సమ్మతించాడు. బాధితుడు ఏసీబీ అధికారులను కలివడంతో కోటేశ్వర్ రావును పట్టుకున్నారు. ప్రేమ వ్యవహారానికి సంబంధించిన కేసు నమోదు చేయకుండా ఉండాలంటే రూ. 50 వేలు డిమాండ్ చేసిన మహ్మదాబాద్ ఎస్ఐ సురేష్ కు మొదట బాధితులు రూ. 30 వేలు చెల్లించారు. మిగతా రూ. 20 వేలు స్టేషన్ సమీపంలోని జిరాక్స్ సెంటర్ లో ఇవ్వాలని సూచించాడు. జిరాక్స్ సెంటర్ యజమాని మూసాకు రూ. వేలు చెల్లిస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఓ కాంట్రాక్టర్ నుండి రూ. 13 వేలు లంచం తీసుకుంటుండగా రాజీవ్ స్వగ్రుహ కార్పేరేషన్ లిమిటెడ్ ఏజీఎం(టెక్నికల్), చీఫ్ ఇంజనీర్ ఎండీ మసూద్ అలిని పట్టుకున్నారు. మహబూబ్ నగర్ మునిసిపాలిటీ ఏఈ ఎస్ పృథ్వి రూ. 11 లక్షల విలువైన బిల్లులు తయారు చేసుందకుకు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రూ. 50 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. మేడ్చల్ జిల్లా శామీర్ పేట తహసీల్దార్ తోడేటి సత్యనారాయణ రూ. 10 లక్షలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. రూ. 20 లక్షల చెక్కు కూడా అడ్వాన్స్ గా తీసుకున్న సత్యనారాయణ తన డ్రైవర్ భద్రి ద్వారా లంచం తీసుకుంటున్నప్పుడు పట్టుకున్నారు. దూద్ బౌళిలో రూ. 2 లక్షల లంచం తీసుకుంటుంన్న సబ్ రిజిస్ట్రార్ అమీర్ ఫరాజ్ ను ట్రాప్ చేసి పట్టుకున్నారు. తాజాగా శుక్రవారం ఉధయం నల్గొండ జిల్లా కేంద్రంలో ఆసుపత్రి సూపరింటిండెంట్ లచ్చు నాయక్ రూ. 3 లక్షలు తీసుకుంటున్నప్పుడు వల వేసి పట్టుకున్నారు.
మిడియేటర్లనూ…
ఇటీవల కాలంలో ఏసీబీ అధికారులు రెడ్ హైండెడ్ గా దొరికితేనే క్రిమినల్ కేసులు నమోదు చేయడం కాకుండా మీడియేటర్ల ద్వారా లంచం తీసుకుంటున్న ఘటనలు కూడా వదిలి పెట్టడం లేదు. మధ్యవర్తిత్వం చేసిన వారికి బాధితులకు ఎలాంటి సంబంధాలు లేకపోవడంతో పాటు అవినీతికి పాల్పడే అధికార యంత్రాగం ఎంచుకున్న సరికొత్త మార్గాన్ని కూడా ట్రేస్ చేశారు. దీంతో మిడియేటర్లుగా వ్యవహరిస్తున్న వారూ కూడా ఏసీబీ కేసుల్లో ఇరుక్కొక తప్పడం లేదు. అధికారులకు వంత పాడేందుకు ప్రయత్నిస్తే ప్రైవేటు వ్యక్తులు అయినా సరే చట్టాలకు పని చెప్పి తీరుతామని అంటున్నారు ఏసీబీ అధికారులు. శామీర్ పేట ఎమ్మార్వోను ట్రాప్ చేసినప్పుడు అతని డ్రైవర్ భద్రి లంచం డబ్బులు తీసుకుంటున్నారు. మహ్మదాబాద్ ఎస్ఐ సురేష్ కూడా జిరాక్స్ సెంటర్ యజమానికి డబ్బులు ఇవ్వాలని సూచించడంతో ఆయనకు బాధితులు డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. గతంలో మిడియేటర్లు డబ్బులు తీసుకున్నట్టయితే వారిని అరెస్ట్ చేసే విధానాన్ని అవలంభించకపోయేవారు. కొంతకాలంగా వీరిని కూడా పట్టుకుంటుడడంతో అధికార యంత్రాంగం ఎంచుకున్న అవినీతి దారులనూ మూసి వేసే ప్రయత్నం ఏసీబీ చేస్తున్నట్టుగా స్పష్టమవుతోంది.