దిశ దశ, హుజురాబాద్:
కరీంనగర్ జిల్లా జమ్మికుంట తహసీల్దార్ రజని ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో బుధవారం ఉదయం నుండి ఈ దాడులు చేస్తున్నట్టుగా సమాచారం. హన్మకొండలోని కెఎల్ఎన్ రెడ్డి కాలనీలో నివాసం ఉంటున్న రజని జనగామ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర్ రెడ్డికి బంధువని తెలస్తోంది. ఆమె ఇంటితో పాటు గతంలో రజని పనిచేసిన వివిధ మండలాల్లో, ఆమెకు సంబంధించిన ఇతరుల ఇండ్లలో కూడా ఏసీబీ అధికారుల బృందాలు దాడులు చేస్తున్నట్టుగా సమాచారం. ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాలతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన ఏసీబీ అధికారులు ఈ సోదాల్లో పాల్గొన్నారు. అయితే సోదాలు కొనసాగుతున్న నేపథ్యంలో పూర్తి వివరాలు తెలియరావల్సి ఉంది.
ఐదు సార్లు మిస్..?
ఎక్కువగా ప్రైమ్ ఏరియా పోస్టింగుల్లోనే కొనసాగిన తహసీల్దార్ రజనిపై గతంలో కూడా అవినీతి ఆరోపణలు వచ్చినట్టుగా తెలుస్తోంది. బాధితులు కొంతమంది ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో రెడ్ హైండెడ్ గా ట్రాప్ చేసేందుకు ప్రయత్నించినట్టుగా తెలుస్తోంది. ఐదు సార్లు ఆమెను పట్టుకునేందుకు ఏసీబీ అధికారులు రంగంలోకి దిగినప్పటికీ చివరి క్షణంలో మిస్సయినట్టుగా సమాచారం. అయితే ఆరోసారి మాత్రం ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు దాడులకు చేపట్టారు.
టీచర్ నుండి…
విద్యార్థులను తీర్చిదిద్దేందుకు ఉపాధ్యాయ వృత్తిలో మొదట కొనసాగిన రజని ఆ తరువాత రెవెన్యూ విభాగంలో నియామక ప్రక్రియికు హాజరై తహసీల్దార్ గా ఎంపికయినట్టుగా తెలుస్తోంది. ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాల్లోని పలు మండలాల్లో పనిచేసిన ఆమె ఓ సారి మంచిర్యాల జిల్లాకు బదిలీ కాగా 24 గంటల్లోనే పోస్టింగు ఉత్తర్వులను రద్దు చేయించుకున్నారని రెవెన్యూ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఎన్నికల నేపథ్యంలో కోడ్ లో భాగంగా ఆమె జమ్మికుంటకు బదిలీ అయినట్టుగా తెలుస్తోంది.