దిశ దశ, హైదరాబాద్:
ఫార్ములా ఈ కార్ రేస్ పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింట్ ప్రసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (KTR)తో పాటు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండీఏ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డిలపై ఈ కేసు నమోదయింది. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ తో పాటు క్యాబినెట్ అనుమతి లేకుండానే నిధులు విడుదల చేశారన్న అభియోగాలపై ఈ కేసు నమెదు చేశారు. 13 (1) A, 13 (2) పీసీ యాక్ట్, 409, 120B సెక్షన్లలో కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు దర్యాప్తు చేపట్టనున్నారు.
అసలేం జరిగింది..?
2023లో హైదరాబాద్ నగరంలో ఫార్మూలా ఈ కార్ రేసింగ్ (ఫార్మూలా రేస్ సీజన్ 9) పేరిట కార్ల రేసింగ్ నిర్వహించారు. రేసింగ్ రోడ్డు, ఇతర మౌళిక సదూపాయాల కోసం HMDA రూ. 20 కోట్లు, రేస్ ప్రమోటర్ గా వ్యవహరించిన నెక్స్ట్ జెన్ అనే ఏజెన్సీ రూ. 150 కోట్లు ఖర్చు చేశాయి. ప్రచారంతో పాటు స్టాల్స్, సీటింగ్, స్ట్రీట్ లైట్స్ వంటి ఖర్చులను ఏజెన్సీనే భరించింది. ఈ ఈవెంట్ విషయంలో HMDA, నెక్స్ట్ జెన్, ఈ ఫార్ములాల మధ్య త్రైపాక్షిక ఒప్పందం జరగగా హెచ్ఎండీఏకు కానీ, నెక్స్ట్ జెన్ సంస్థలు నష్టాన్ని చవి చూసాయి. అయితే ఈ ఫార్ములా రేస్ కోసం ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఒప్పందం చేసుకుని రూ. 55 కోట్ల నిధులు విడుదల చేశారని ఉన్నతాధికారులు గుర్తించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో కేవలం ఫోన్ల ద్వారానే ఆదేశాలు అందుకుని నిధులను విడుదల చేసినట్టుగా తేల్చారు. క్యాబినెట్ నిర్ణయం లేకుండా కేటాయించిన రూ. 55 కోట్లు ప్రభుత్వానికి చెల్లించాలని అరవింద్ కుమార్ కు నోటీసులు కూడా ఇచ్చినట్టుగా తెలుస్తోంది. తాజాగా కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు కేటీఆర్, అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డిలతో పాటు మరికొందరిని కూడా విచారించే అవకాశాలు ఉన్నాయి. విచారణకు హాజరు కావాలని వీరికి నోటీసులు ఇవ్వనున్నట్టు సమాచారం.