దిశ దశ, హైదరాబాద్:
తెలంగాణ అవినీతి నిరోధక శాఖ అధికారులు పెద్ద తలలే టార్గెట్ గా ముందుకు సాగుతున్నారు. ఓ వైపున లంచం తీసుకుంటున్న వారిని రెడ్ హైండెడ్ గా పట్టుకుంటూనే మరో వైపున అక్రమ ఆస్తులు కలిగి ఉన్న అధికారుల భరతం పడుతున్నారు. తాజాగా మంగళవారం ఉదయం నుండి రాత్రి వరకు హైదరాబాద్ నగరంలోని అశోక్ నగర్ లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. సెంట్రల్ క్రైం స్టేషన్ (సీసీఎస్) ఏసీబీ ఉమా మహేశ్వర్ రావు ఆదాయానికి మించిన ఆస్తులు గడించారన్న ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు బృందం సెర్చింగ్ ఆపరేషన్ చేపట్టింది. మంగళవారం ఉదయం నుండే చేపట్టిన ఈ సోదాల్లో ఇప్పటి వరకు రూ. 45 లక్షల నగదు, 65 తులాల బంగారం ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్టుగా ప్రాథమికంగా తెలుస్తోంది. ఏసీపీ ఉమా మహేశ్వర్ రావు ఆస్తులకు సంబంధించిన వివరాలను సేకరించే పనిలో ఏసీబీ టీమ్ నిమగ్నం అయినట్టుగా తెలుస్తోంది. ఆస్తులకు సంబంధించిన డాక్యూమెంట్లతో పాటు బినామీలపై కూడా ఆరా తీసే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. సోదాలు పూర్తయిన తరువాత ఏసీబీ అధికారులు వివరాలను వెల్లడించే అవకాశాలు ఉన్నాయి.