రూ. 6 వేల జరిమానా
దిశ దశ, కరీంనగర్:
రిటైర్ అయినా కూడా చేసిన నేరానికి శిక్ష అనుభవించాల్సిందే. అవినీతికి పాల్పడిన అధికార యంత్రాంగం ఎప్పటికైనా శిక్షార్హులే. తాజాగా కరీంనగర్ ఏసీబీ స్పెషల్ కోర్ట్ ఈ మేరకు తీర్పు ఇచ్చింది. శుక్రవారం కరీంనగర్ ఏసీబీ స్పెషల్ కోర్ట్ జడ్జి కుమార్ వివేక్ జడ్జిమెంట్ ఇచ్చారు. ప్రాసిక్యూషన్ తరుపున పిపి కిషోర్ కుమార్ వాదనలు వినిపించారు. కేసు పూర్వాపరాల్లోకి వెళితే… 2009లో ఆదిలాబాద్ జిల్లా ఊట్నూరు ఐటీడీఏ ప్రాజెక్టు పరిధిలోని కోలం ఆత్రం హైస్కూల్‌లో నర్సింహారెడ్డి ఉపాధ్యాయునిగా పని చేస్తున్నారు. ఎర్న్ డ్ లీవ్ (EL) ప్రొసిడింగ్స్ అందించాలని ఐటీడీఏలో డిప్యూటీ డైరెక్టర్ గా పని చేస్తున్న మోకరాల శ్రీధర్ ను అభ్యర్థించారు. ప్రొసిడింగ్స్ ఇవ్వాలంటే లంచం కావాలని డిప్యూటీ డైరెక్టర్ శ్రీధర్ అడిగాడు. దీంతో టీచర్ నర్సింహారెడ్డి రెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. నర్సింహారెడ్డి నుండి రూ. 3 వేలు లంచం తీసుకుంటున్న డిప్యూటీ శ్రీధర్ ను ఏసీబీ అధికారులు రెడ్ హైండెడ్ గా పట్టుకున్నారు. ఈ మేరకు ఏసీబీస్ పెక్టర్ కిరణ్ కుమార్ కేసు నమోదు చేసి నిందితులను కోర్టులో హాజరుపరిచారు. ప్రస్తుతం ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా కృష్ణ కుమార్ ఉన్నారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన కరీంనగర్ ఏసీబీ స్పెషల్ కోర్టు నిందితుడు శ్రీధర్ కు నాలుగేళ్ళ జైలు శిక్ష, రూ. 6 వేల జరిమానా విధించింది.
రిటైర్ అయినా…
2009లో ఏసీబీకి చిక్కిన ఐటీడీఏ డిప్యూటీ డైరెక్టర్ శ్రీధర్ కేవలం రూ. 3 వేల కోసం కక్కుర్తి పడ్డారు. అప్పుడు ఆయన వయసు 56 ఏళ్ళు కాగా నేడు ఆయనకు శిక్ష పడింది. ఏసీబీకి చిక్కిన 2 ఏళ్లలో రిటైర్ అయినా కేసు మాత్రం వెంటాడింది. చివరకు 70 ఏళ్ల వయసులో కూడా ఆయనకు శిక్ష పడక తప్పలేదు.