దిశ దశ, కరీంనగర్:
ఎరువుల దుకాణం లైసెన్సు కోసం పెట్టిన దరఖాస్తును పై అధికారికి పంపించాలంటే పైకం ఇవ్వాల్సిందేనని పట్టుబట్టిన ఓ వ్యవసాయ శాఖ ఉద్యోగికి జైలు శిక్ష పడింది. లంచం ఇస్తేనే ఫైలు కదులుతుందని చెప్పడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించి రెడ్ హైండెడ్ గా పట్టించాడు. కేసు విచారించిన కరీంనగర్ ఏసీబీ కోర్టు నిందితునికి నాలుగేళ్ల జైలు శిక్ష, రూ. 6 వేల జరిమానా విధించింది. సంఘటనా వివరాల్లోకి వెల్తే… కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామానికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి 2013లో ఫెర్టిలైజర్స్ షాపు ఏర్పాటు చేయాలని భావించాడు. ఇందుకు అనుమతి కోసం వ్యవసాయశాఖ అధికారి కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్న తరువాత ఆ ఫైలును ఏడీ కార్యాలయానికి పంపించాల్సి ఉంటుంది. అయితే అప్పుడు వ్యవసాయ కార్యాలయంలో పని చేస్తున్న అన్నారెడ్డి ప్రణవేందర్ రెడ్డి లంచం ఇస్తేనే ఫైలు అసిస్టెంట్ డైరక్టర్ కార్యాలయానికి పంపిస్తానని చెప్పడంతో బాధితుడు శ్రీనివాస్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. బాధితుని నుండి వివరాలు సేకరించిన ఏసీబీ అధికారులు రూ. 3 వేలు లంచం తీసుకుంటుండగా ప్రణవేందర్ రెడ్డిని రెడ్ హైండెడ్ గా పట్టుకున్నారు. కరీంనగర్ ఏసీబీ స్పెషల్ కోర్టులో ఈ కేసు విచారణ చేపట్టిన స్పెషల్ జడ్జ్ కుమార్ వివేక్ నిందితునికి శిక్ష ఖరారు చేశారు. నాలుగేళ్ల పాటు జైలు శిక్షతో పాటు రూ. 6 వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. ప్రాసిక్యూషన్ తరుపున పీపీ కిషోర్ జడ్జి ముందు వాదనలు వినిపించారు.