నిర్మల్ జిల్లాలో ఏసీబీ ట్రాప్…

దిశ దశ, నిర్మల్:

నిర్మల్ జిల్లాలో అవినీతిపరులు నిర్భయంగా లంచం తీసుకుంటున్నారు. ఇటీవలే ఓ ఉద్యోగిని ఏసీబీ అధికారులు పట్టుకున్నా… లంచావతారుల్లో మాత్రం మార్పు వచ్చినట్టుగా కనిపించడం లేదు. తాజాగా బుధవారం మరో అధికారి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హైండెడ్ గా పట్టుబడ్డాడు. జిల్లా మార్కెటింగ్ అధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న శ్రీనివాస్ బాధితుని నుండి రూ. 7 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హైండెడ్ గా పట్టుకున్నారు. కెమికల్ టెస్ట్ అయిన తరువాత వాంగ్మూలాలు నమోదు చేసే పనిలో ఏసీబీ అధికారులు నిమగ్నం అయ్యారు. శ్రీనివాస్ ను కరీంనగర్ ఏసీబీ కోర్టులో హాజరు పర్చనున్నారు.

వరస ఘటనలు… 

ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాపై ఓ వైపున పులి, మరో వైపున ఏసీబీ పంజా విసురుతున్నట్టుగా మారింది. ఆసిఫాబాద్ అడవుల్లోని జనాన్ని పెద్దపులి సంచారం కలవరపెడుతుంటే నిర్మల్ జిల్లా ప్రభుత్వ యంత్రాంగాన్ని అవినీతి నిరోధక శాఖ భయపెడుతోంది. 20 రోజుల్లో ముగ్గురు ప్రభుత్వ యంత్రాంగం లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. మునిసిపల్, ల్యాండ్ రికార్డ్స్ విభాగానికి చెందిన ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లను వేర్వేరే ఘటనల్లో ఏసీబీ అధికారులు ట్రాప్ చేశారు. తాజాగా బుధవారం మార్కెటింగ్ జిల్లా అధికారి పట్టుకోవడం సంచలనంగా మారింది.

బార్డర్ చెక్ పోస్టులపై… 

మరోవైపున ఏసీబీ అధికారులు సరిహధ్దుల్లోని మోటారు వెహికిల్ విభాగం చెక్ పోస్టులపై కూడా దాడులు నిర్వహించారు. ఏడు బృందాలుగా ఏర్పడిన ఏసీబీ అధికారులు ఆదిలాబాద్ జిల్లా భోరజ్, నల్లగొండ జిల్లా విష్ణుపురం, జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ చెక్ పోస్టులపై ఆకస్మిక దాడులు చేశారు. ఈ దాడుల్లో భోరజ్ చెక్ పోస్టులో రూ. 62,500, విష్ణుపురం చెక్ పోస్టులో 86,600, అలంపూర్ చెక్ పోస్టులో రూ. 29,200లు స్వాధీనం చేసుకున్నారు. అధికారిక లెక్కల్లో లేని ఈ నగదులో పాటు పలు అక్రమాలను కూడా ఏసీబీ బృందాలు గుర్తించాయి. 

You cannot copy content of this page