కామారెడ్డి జిల్లాలో ఎస్సై, కానిస్టేబుల్ పట్టివేత…
దిశ దశ, నిజామాబాద్:
క్రిమినల్ కేసుల్లో నిందితులకు బీఎన్ఎస్ యాక్టు ప్రకారం నోటీసులు ఇవ్వడానికి కూడా లంచం అడుగుతున్నారు పోలీసులు. దీంతో బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించి రెడ్ హైండెడ్ గా పట్టిస్తున్నారు. 7 సంవత్సరాల లోపు జైలు శిక్ష పడే సెక్షన్లలో స్టేషన్ హౌజ్ ఆఫీసర్లు నోటీసులు ఇవ్వాలన్న ఆదేశాలను ఆసరగా చేసుకుంటున్న పోలీసులు అవినీతికి పాల్పడుతున్నారు. తాజాగా కామారెడ్డి జిల్లాలో ఇలాంటి ఘటనలో లంచం తీసుకుంటున్న ఎస్సై, కానిస్టేబుళ్లను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. సంఘటనా వివరాల్లోకి వెల్తే… జిల్లాలోని లింగంపేట స్టేషన్ లో పనిచేస్తున్న ఎస్సై పబ్బ అరుణ్, స్టేషన్ రైటర్ గా పనిచేస్తున్న కానిస్టేబుల్ తోట రామస్వామిలు క్రైం నంబర్ 186/2024లో బీఎన్ఎస్ యాక్ట్ 35 ప్రకారం నిందితులకు నోటీసు ఇచ్చేందుకు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మొదట కొంత డబ్బులు ముట్టజెప్పగా అనుకున్న ఒప్పందం ప్రకారం మిగతా రూ. 10 వేలు ఇస్తేనే నోటీసులు ఇస్తామని తేల్చిచెప్పారు. దీంతో గురువారం కానిస్టేబుల్ తోట రామస్వామికి రూ. 10 వేలు బాధితుడు ఇచ్చిన తరువాత నిజామాబాద్ జిల్లా ఏసీబీ అధికారులు దాడులు చేసి పట్టుకున్నారు. పీసీ రామస్వామి నుండి స్వాధీనం చేసుకున్న డబ్బుకు కెమికల్ టెస్టులో కానిస్టేబుల్ చేతి వేలి ముద్రలకు సంబంధంచిన ఆనవాళ్లు లభ్యం అయ్యాయి. ఈ కేసులో ఎస్సై పబ్బా అరుణ్, పీసీ రామస్వామిలను అరెస్ట్ చేసి హైదరాబాద్ నాంపల్లిలోని ఏసీబీ స్పెషల్ కోర్టులో హాజరు పర్చనున్నట్టు ఏసీబీ అధికారులు తెలిపారు.