తీగ లాగుతున్నారా..? డొంక కదలడమేనా..?

దిశ దశ, హైదరాబాద్:

హెచ్ఎండీఏ మాజీ డైరక్టర్ శివ బాలకృష్ణ కోసులో మరో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆయన చుట్టూ ఉచ్చు బిగించిన ఏసీబీ కలుగులో ఉన్న ఎలుకలను బయటకు లాగే పనిలో నిమగ్నం అయింది. శివ బాలకృష్ణను కస్టడీకి తీసుకుని విచారించినప్పుడు వెలుగులోకి వచ్చిన ఆస్తులు, బినామీలే కాకుండా అక్రమార్జన వ్యవహారాలతో సంబంధం ఉన్న వారి గురించి కూడా వివరాలు సేకరించారు ఏసీబీ అధికారులు. ఐఏఎస్ అధికారి అరవింద్ తో ఉన్న సంబంధాల గురించి కూడా ఏసీబీ అధికారులు తెలుసుకోవడంతో ఆయనకు 151 సీఆర్పీసీ కింద నోటీసులు ఇవ్వనున్నట్టుగా సమాచారం. ఇప్పటికే ఆయన్ని విచారించేందుకు అనుమతించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది ఏసీబీ. అలాగే ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కు నోటీసులు ఇచ్చేందుకు కూడా న్యాయ నిపుణులతో చర్చించి చర్యలు తీసుకునేందుకు సమాయత్తం అవుతోంది. శివ బాలకృష్ణ నుండి స్వాధీనం చేసుకున్నా ల్యాప్ టాప్, సెల్ ఫోన్లను కూడా ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నట్టుగా సమాచారం. వీటి ద్వారా లభ్యం అయ్యే సమాచారం ఆధారంగా కూడా మరింత లోతుగా ఆరా తీసే అవకాశాలు కూడా ఉన్నాయి. శివ బాలకృష్ణ, ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ లు జరిపిన వాట్సప్ ఛాట్ ను కూడా సేకరించే పనిలో టెక్నికల్ టీమ్స్ నిమగ్నం అయినట్టుగా తెలుస్తోంది. వాట్సప్ ఛాట్ ను రిట్రైవ్ చేయడంతో పాటు ఇతరాత్ర ఆధారాలను కూడా సేకరించనున్నట్టు సమాచారం.

You cannot copy content of this page