తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదం..
40 మందికి గాయాలు…
దిశ దశ, పెద్దపల్లి:
పెద్దపల్లి జిల్లా కాట్నపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదంతో శుకార్యక్రమం జరిగిన ఇంట విషాదచాయలు అలుముకున్నాయి. అంగరవంగ వైభవంగా వివాహం జరుపుకుని వలిమా దావత్ ముగించుకుని ఇంటికి చేరుకుంటున్న క్రమంలో రోడ్డు ప్రమాదం వారిని ఆసుపత్రి పాలు చేయడం స్థానికులను దిగ్భ్రాంతికి గురి చేసింది. సంఘటన వివరాల్లోకి వెల్తే… జిల్లాలోని రామగుండం పట్టణంలోని జెన్ కో సి కాలనీకి చెందిన బాబా జూనియర్ ప్లాంట్ ఆఫీసర్ గా పని చేస్తున్నారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమారుడు కాగా మూడు నాలుగు రోజుల క్రితం బాబా పెద్ద కూతురు వివాహం ఘనంగా జరిపించారు. హైదారబాద్ లో నివాసం ఉంటున్న వ్యక్తికి ఇచ్చి నిఖా జరిపించిన బాబా ఫ్యామిలీ ఆదివారం రాత్రి ఆయన వియ్యంకుని ఇంట నిర్వహించిన వలిమా దావత్ లో పాల్గొనేందుకు వెల్లారు. ఆదివారం రాత్రి ఘనంగా వలిమా డిన్నర్ నిర్వహించిన అనంతరం రామగుండం పట్టణానికి ఓ ప్రైవేటు బస్సులో బయలు దేరారు. తెల్లవారు జామున పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి వద్ద వీరు ప్రయాణిస్తున్న బస్సు అదుపుతప్పి డివైడర్ ను ఢికొట్టింది. దీంతో బస్సులు ప్రయాణిస్తున్న సుమారు 40 మంది గాయాల పాలయ్యారు. ఇందులో కొంతమంది పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి తలరించారు. ఘటనా స్థలాన్ని పెద్దపల్లి ఏసీపీ ఎడ్ల మహేష్, సీఐ జగదీష్, ఎస్ఐ విజయేందర్ లు సందర్శించి ప్రమాద బాధితులను హుటాహుటిన 108లో ఆసుపత్రికి తలరించారు. అయితే ఇదే సమయంలో పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ నేత చింతకుంట విజయ రమణారావు పార్టీ కార్యక్రమంలో పాల్గొనేందుకు అదే రహదారి మీదుగా వెల్తున్నారు. రోడ్డు ప్రమాదాన్ని గమనించిన ఆయన వెంటనే ఘటనా స్థలానికి వెల్లి యాక్సిడెంట్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆసుపత్రికి తరలించిన వారిని కూడా పరామర్శించారు.
ఎమ్మెల్యే చందర్ ఆరా…
కాట్నపల్లి రోడ్డు ప్రమాద సమాచారం అందుకున్న రామగుండం ఎమ్మల్యే కోరుకంటి చందర్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మహారాష్ట్ర టూర్ నేపథ్యంలో ఆయన కూడా బయలుదేరారు. మార్గ మధ్యలో ఉన్న ఎమ్మెల్యేకు ఈ సమాచారం అందుకున్న వెంటనే అధికారులు, పార్టీ నాయకులతో మాట్లాడి రోడ్డు ప్రమాదం గురించి తెలుసుకున్నారు. వారికి అవసరమైన వైద్య సాయంతో పాటు ఇతరాత్ర సపరిచర్యలు అందించాలని ఎమ్మెల్యే పార్టీ క్యాడర్ కు సూచించారు. పరిస్థితి విషమయంగా ఉన్న వారికి మెరుగైన వైద్యం అందించేందుకు కరీంనగర్, హైదరాబాద్ లకు కూడా తలరించేందుకు చర్యలు చేపట్టాలని కోరుకంటి చందర్ పార్టీ నాయకులను ఆదేశించారు.
నిద్రలోకి జారుకున్నాడా..?
అయితే తెల్లవారు జామున 5.30 గంటల ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగినట్టుగా భావిస్తున్నారు. అర్థరాత్రి సమయంలో బయలుదేరడంతో డ్రైవర్ నిద్రలోకి జారుకుని ఉంటాడని ప్రాథమికంగా అంచనా వేశారు. వేకువ జామున 3 గంటల నుండి గంటల వరకు నిద్ర తీవ్రంగా వచ్చే సమయం అయినందున ఆ సమయంలో వాహనాలను నడపడం శ్రేయస్కరం కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిద్రతో కళ్లు మూసుకుపోతున్నప్పటికీ మరి కొద్దిసేపట్లో గమ్యం చేరుకుంటామన్న ధీమాతో వాహనాలను నడపడం కన్న రోడ్డు పక్కన నిలిపి కొద్దిసేపు నిద్రించిన తరువాత తిరిగి ప్రయాణం చేయడం సరైన పద్దతని అంటున్నారు. కాట్నాపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం కూడా ఇదే కారణంగా జరిగి ఉంటుందని భావిస్తున్నారు.
హాహాకారాలు…
సోమవారం తెల్లవారు జామున కాట్నపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంతో రాజీవ్ రహదారి అంతా హాహాకారలతో దద్దరిల్లిపోయిందని ప్రత్యక్ష్య సాక్ష్యులు చెప్తున్నారు. వలిమా డిన్నర్ ముగిసిన తరువాత బయలుదేరడంతో బస్సులో ప్రయాణిస్తున్న వారంతా కూడా గాడ నిద్రలోకి జారుకున్నట్టుగా తెలుస్తోంది. దీంతో కాట్నాపల్లి వద్ద బస్సు బోల్తాపడడంతో అందులో ఉన్న వారంతా అసలేం జరుగిందో అర్థ కాక నిద్ర మత్తులోనే హహాకారాలు చేశారు. ఓ వైపున బస్సు బోల్తా పడిన శబ్దం… మరో వైపున అందులో ప్రయాణిస్తున్న వారిని అరుపులతో కాట్నపల్లి క్రాసింగ్ వద్ద ఒక్క సారిగా గందరగోళం నెలకొంది.